ప్రపంచంలోనే మొదటి ప్రభుత్వ వృద్ధాశ్రమం.. 115 ఏళ్ళ చరిత్ర, ముగ్గురు స్నేహితుల పోరాటం..

ప్రపంచంలోనే మొదటి ప్రభుత్వ వృద్ధాశ్రమం.. 115 ఏళ్ళ చరిత్ర, ముగ్గురు స్నేహితుల పోరాటం..

వృద్ధాశ్రమాలు... ఆశ్రయం లేని వృద్దులకు మలిదశలో గౌరవప్రదమైన జీవితం అందిస్తున్నాయి. వీటి సంఖ్య పెరుగడం క్షీణిస్తున్న మానవ సంబంధాలకు సంకేతమే అయినప్పటికీ.. ఎంతోమంది అనాథలైన వృద్దులకు ఇవి అండగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఈ వృద్ధాశ్రమం కాన్సెప్ట్ కు 115 ఏళ్ళ చరిత్ర ఉందని తెలుసా..? అవును 115 ఏళ్ళ క్రితం అమెరికాలో ముగ్గురు స్నేహితుల పోరాటానికి ఫలితంగా ప్రపంచంలోనే మొదటి వృద్దాశ్రమం ఏర్పాటయింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ముగ్గురు స్నేహితుల పోరాటం, ఒక చారిత్రాత్మక చట్టం:

వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రయం కావాలన్న డిమాండ్‌ ను మొదట మేజర్ ఎ.జె. డోరన్, జానీ డ్యూక్, ఫ్రాంక్ ఎం. మర్ఫీ లేవనెత్తారు. డోరన్ 1907లో అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు, కానీ అది ఆమోదం పొందలేదు. అయినా నిరుత్సాహపడకుండా ఆయన పట్టువదలకుండా రెండు సంవత్సరాల తరువాత, 1909లో మళ్ళీ ప్రవేశపెట్టగా... ఆ బిల్లు ఆమోదం పొందింది. 1909 మార్చి 11న, అప్పటి గవర్నర్ జోసెఫ్ హెన్రీ కిబ్బే దానిపై సంతకం చేసి చట్టంగా మార్చి చరిత్ర సృష్టించారు.

ఫ్రాంక్ మర్ఫీ విరాళంగా ఇచ్చిన 4.5 ఎకరాల భూమిలో ఈ వృద్ధాశ్రమానికి శంకుస్థాపన జరిగింది. ప్రెస్కాట్‌లోని గ్రానైట్ కొండచరియలపై ఒక అద్భుతమైన మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిని డబ్ల్యూ.ఎస్. ఇలియట్ అనే మహిళా వాస్తుశిల్పి రూపొందించారు. ఎర్ర ఇటుకల ముఖభాగం, చెక్క వరండాలతో ఉన్న ఈ అందమైన భవనం నిర్మాణానికి సుమారు 25,000 డాలర్లు ఖర్చయింది.

ఈ వృద్ధాశ్రమం తలుపులు ఫిబ్రవరి 1, 1911న మొదటిసారిగా తెరుచుకున్నాయి. మొదట్లో  ఇందులో కేవలం 40 మంది పురుషులు మాత్రమే ఉండేవారు. ఇక్కడ నివసించడానికి అర్హతలు కఠినంగా ఉండేవి, కనీస వయస్సు 60 సంవత్సరాలు, అరిజోనాలో 25 సంవత్సరాల నివాస రికార్డు, మరియు పూర్తి ఆర్థిక అవసరం ఉండటం వంటివి ఉన్నాయి. ఈ చట్టం కోసం పోరాడిన ఎ.జె. డోరన్, దీనికి మొదటి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.

కాలక్రమేణా ఈ ప్రభుత్వ సంస్థ విస్తరించింది. 1916లో మహిళల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్మించారు, 1929లో అంగవైకల్యం పొందిన గని కార్మికులకు చికిత్స అందించడానికి ఒక ఆసుపత్రిని కూడా నిర్మించారు.