యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం కార్తీక శోభను సంతరించుకుంది. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. ఆదివారం ఆరు బ్యాచుల్లో నిర్వహించిన సత్యనారాయణ వ్రత పూజల్లో 734 మంది దంపతులు పాల్గొన్నారు. వ్రతాల నిర్వహణ ద్వారా రూ.5,87,200 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు. రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండపైకి వెళ్లేందుకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేక అవస్థలు పడ్డారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో  రూ.150 పెట్టి స్పెషల్ దర్శన టికెట్లు కొన్న కొందరు భక్తులు ధర్మదర్శన క్యూలైన్లలోనే వెళ్లాల్సి వచ్చింది. భక్తులు జరిపించిన కార్తీక పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.52,17,063 ఇన్ కం వచ్చింది.

10 తులాల బంగారం అపహరణ
నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన ఓ భక్తురాలికి చెందిన బంగారాన్ని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన టంగుటూరి చంద్రకళ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి శనివారం సాయంత్రం యాదగిరిగుట్టకు వెళ్లారు. హ్యాండ్ బ్యాగులో 10 తులాల బంగారం, రూ.20 వేల నగదు పెట్టుకున్నారు. ధర్మదర్శన క్యూలైన్​లో వెళ్లి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.