నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
పట్టపగలు.. నడిరోడ్డుపై ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిపై తల్వార్ తో దాడి చేశాడు. మొదటి వేటు పడగానే.. యువతి అక్కడే కుప్పకూలిపోయింది. ఐనా.. తన కసితీరా ఆమె మెడపై పొడవాటి కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రం ధర్వాడ్ జిల్లా హుబ్బల్లి పట్టణం దేశ్ పాండే నగర్ ఏరియాలో జరిగింది. ఈ దాడిలో 21 ఏళ్ల బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఐతే.. ఆమె కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పారు. నిందితుడిని హుబ్బల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 25ఏళ్ల నిందితుడు ఇస్మాయిల్… ధర్వాడ్ జిల్లా రామ్ పురాలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. ఇదే జిల్లా మొరాబా గ్రామానికి చెందిన బాధితురాలు.. హుబ్బల్లిలోని ఓ జ్యుయెలరీ షాప్ లో పనిచేస్తోంది. గతంలో ఇద్దరికీ పరిచయం ఉంది. ఐతే.. తనతో కాకుండా.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో.. నిందితుడు ఇస్మాయిల్ రగిలిపోయాడు. ఇవాళ ఉదయం పది గంటలకు షాప్ కు వెళ్తున్న బాధితురాలిని వెనుక నుంచి అనుసరించాడు. తల్వార్ తో వేటువేశాడు. ఊహించని ఘటన కావడంతో.. బాధితురాలు తప్పించుకోలేకపోయింది. నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. బాధితురాలిపై నాలుగైదు కత్తి వేట్లు పడ్డాక.. ఓ బైకర్ ధైర్యం చేశాడు. అతడి దగ్గరకు వెళ్లి సముదాయించి.. పక్కకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.