టీకాకు ‘డెల్టా’ వేరియంట్ లొంగుతలే

టీకాకు ‘డెల్టా’ వేరియంట్ లొంగుతలే
  • వుహాన్ వైరస్ కన్నా ఎక్కువగా వ్యాపిస్తోంది  
  •  దీనిపై టీకా ఎఫెక్ట్ 8 రెట్లు తక్కువ 
  • ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ స్టడీలో వెల్లడి 

 
న్యూఢిల్లీ: మన దేశంతో పాటు దాదాపు 100 దేశాల్లో బయటపడిన డెల్టా రకం కరోనా.. టీకాలకు అంత ఈజీగా లొంగడం లేదని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. వుహాన్ లో పుట్టిన ఒరిజినల్ కరోనా వేరియంట్ కంటే దీనిపై వ్యాక్సిన్ల ఎఫెక్ట్ 8 రెట్లు తక్కువగా ఉందని, ఒరిజినల్ వైరస్ కన్నా దీనికి వేగంగా వ్యాపించే కెపాసిటీ ఉన్నట్లు తేలింది. ‘‘డెల్టా వేరియంట్ (బీ.1.617.2) పుట్టుక, టీకా ప్రభావం’’ అనే అంశంపై గంగారాం హాస్పిటల్ సహా ఢిల్లీలోని మూడు దవాఖాన్లలో 100 మంది హెల్త్ కేర్ వర్కర్లపై కేంబ్రిడ్జి సైంటిస్టులతో కలిసి ఈ స్టడీ నిర్వహించారు. కరోనా సోకి కోలుకున్న వాళ్లలో, టీకాలు తీసుకున్న వాళ్లలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఏర్పడతాయి. ఇవి ఉన్నవాళ్లకు వైరస్ మళ్లీ సోకినా ఇమ్యూన్ సిస్టం వెంటనే అంతం చేస్తుంది. కానీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉన్నా డెల్టా వేరియంట్ విచ్చలవిడిగా రెప్లికేషన్ అవుతూ వైరస్ సెల్స్ సంఖ్యను పెంచుకుంటోందని తేలింది.