సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తే ఊరుకోం

సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తే ఊరుకోం

హైదరాబాద్: రిలీజుకు రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీలకు అమ్మకూడదని నిర్మాతలను మూవీ ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్లు కోరారు. ఓటీటీల్లో సినిమాల విడుదలపై చర్చ కోసం మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. థియేటర్ల వల్ల ఏళ్లుగా నిర్మాతలు ఎంతో లాభాలు గడించారని.. అయితే కొత్తగా ఓటీటీలు వచ్చాయని సినిమాలను వారికి అమ్మేస్తే థియేటర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. అక్టోబర్ 30 వరకు ఓపిక పట్టాలని.. అప్పటివరకు ఓటీటీలకు మూవీస్‌ను విక్రయించొద్దని నిర్మాతలను కోరారు. ఆ తర్వాత ఏమైనా సమస్యలు ఏర్పడితే అమ్మేసుకోవచ్చునని స్పష్టం చేశారు. 

థియేటర్ల ఓపెన్ కోసం తమకు కనీసం రెండు, మూడు నెలల సమయం ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, థియేటర్లు ఓనర్లు విజ్ఞప్తి చేశారు. కరోనా పరిస్థితులు చక్కబడటానికి, ప్రభుత్వాలు థియేటర్ల ఓపెనింగ్‌కు కొంత టైమ్ పట్టొచ్చని అప్పటివరకు ఓపిక పట్టాలని కోరారు. ఒకవేళ కాదని సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తే తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్ మొత్తం సినీ థియేటర్లదేనని, సినిమాలను ఓటీటీలకు అమ్మితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.