సింహాచలం దేవస్థానంలో చోరీ.. ఇంటి దొంగల పనే

సింహాచలం దేవస్థానంలో చోరీ.. ఇంటి దొంగల పనే

4 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు..

మాజీ  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్‌లతోపాటు కానుకలు అమ్మిన.. కొన్న.. మొత్తం 8 మంది అరెస్టు

విశాఖపట్టణం: సింహాచలం దేవస్థానంలో భారీ స్థాయిలో కానుకలను చోరీ చేసిన కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే చేదించారు. ఇంటిదొంగల పనేనని అనుమానించి ఆ దిశలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 రోజుల్లేనే మిస్టరీని తేల్చేశారు. మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేష్, సోమ సతీష్ లపై నిఘా పెట్టి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. టెక్నాలజీ సహాయంతో వీరేనని గుర్తించిన పోలీసులు సరైన సమయం చూసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈనెల 10వ తేదీన సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో సంచుల్లో వేసి భద్ర పరచిన 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు గుర్తించి దేవస్థానం ఏఈవో రామారావు స్థానిక గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక కేసుగా టేకప్ చేసి తమదైన టెక్నాలజీ ఆధారంగా అనుమానితులపై నిఘా పెట్టి విచారణ చేపట్టారు. ఇంటి దొంగలే దొంగతనానికి  పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. గతంలో దేవాలయంలో పనిచేసిన మాజీ  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఆలయంలో పనిచేసే మరికొంత మందితో కలసి వీరు ఆలయ వ్యర్థాల్లో ఇత్తడి కానుకల బస్తాలను కూడా కలిపేసి బయటకు తరలించినట్టు నేరం అంగీకరించారు. దేవస్థానం కానుకలను విక్రయించిన..  కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేసి నిందితులను విశాఖ డీసీపీ వి.సురేష్ బాబు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.