సబ్సిడీలో గ్యాస్‍ స్టౌ ఇప్పిస్తానని ఇండ్లలో చోరీలు

సబ్సిడీలో గ్యాస్‍ స్టౌ ఇప్పిస్తానని ఇండ్లలో చోరీలు

వరంగల్‍ , వెలుగు:  గ్యాస్‍ స్టౌలు, సిలిండర్లు సబ్సిడీలో ఇప్పిస్తానని మహిళలను మోసం చేస్తూ ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న ఓవ్యక్తిని అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని బుధవారం వరంగల్‍  సీసీఎస్‍ పోలీసులు అరెస్ట్​ చేశారు. క్రైమ్​ ఏసీపీ డేవిడ్‍ రాజ్‍ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన పర్వతం రాజు (27)  హైదరాబాద్‍లోని కూకట్‍పల్లిలో ఉంటున్నాడు. గ్యాస్‍  స్టౌ  రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తూ  జల్సాలకు అలవాటు పడ్డాడు.

 ఆదాయం కోసం చోరీల బాట పట్టాడు.  మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు గడిచిన ఐదేండ్లలో రాజును పలుమార్లు జైలుకు పంపారు. అయినా తన ప్రవర్తన మార్చుకోలేదు.  ఏప్రిల్‍ 2న దామెర పీఎస్‍ పరిధిలోని కంఠాత్మకూర్‍లో ఓ వృద్ధురాలికి ఫ్రీ గ్యాస్‍ స్టౌ, సిలిండర్‍ ఇవ్వడానికి ఫొటో దించుతానన్నాడు.  మెడలో ఉన్న గోల్డ్​ చైన్‍ తీయాలని చెప్పాడు. ఆమె దానిని ఇంట్లో ఉండే అల్మరాలో పెట్టడాన్ని చూశాడు. ఫొటో తీశాక పాత స్టౌ శుభ్రం చేసి ఇవ్వాలని చెప్పాడు.  

వృద్ధురాలు ఆ పనిలో ఉండగా అల్మరాలో  పెట్టిన బంగారు గొలుసు చోరీ చేశాడు.  ఇదే తరహాలో  పలు చోరీలు చేశాడు.  ఈ సొత్తును యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు ప్రాంతానికి చెందిన చింతకింది రాములు ద్వారా ఇదే మండల కేంద్రానికి చెందిన గోవింద్‍ చౌదరి వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు.  వరుస దొంగతనాలతో పోలీసులు రంగంలోకి దిగారు.  సీపీ రంగనాథ్‍ ఆదేశాలతో క్రైమ్​ డీసీపీ డి.మురళీధర్‍ ఆధ్వర్యంలో ఏసీపీ డేవిడ్‍రాజ్‍ బృందం నిందితుడి కదలికలపై కన్నేసింది.  టెక్నాలజీ ఆధారంగా దామెర క్రాస్‍ వద్ద పట్టుకున్నారు.  అతడిని,  మిగతా ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.2 లక్షల 20 వేల విలువ చేసే 21.5 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి, రూ.15,800, బైక్‍ స్వాధీనం  చేసుకున్నారు.