అమ్మవారికి దండం పెట్టి హుండీ పైసలు ఎత్తుకపోయిండు

అమ్మవారికి దండం పెట్టి హుండీ పైసలు ఎత్తుకపోయిండు
  • ఏడుపాయల టెంపుల్​లో దొంగతనం
  • గర్భగుడిలో హుండీ పగలగొట్టి రూ. లక్ష చోరీ 
  • ఇతర కానుకలు కూడా..
  • వెండి తొడుగులు ముట్టుకోని దొంగ

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో బుధవారం అర్ధరాత్రి హుండీ పగలగొట్టిన ఓ దొంగ అందులో డబ్బు, కానుకలు ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఈ చోరీ చేశాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ముందుగా గడ్డపారతో గర్భ గుడి ఆలయ ముఖద్వారం తాళం పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాత ఎడమవైపు( వీఐపీల దర్శనం) ఉన్న కిటికీని కూడా బ్రేక్​ చేయడానికి ట్రై చేశాడు. ఆ పని కూడా కాకపోవడంతో గర్భగుడికి కుడివైపు ఉన్న కిటికీని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడి రెండు హుండీల్లో ఒక హుండీని గడ్డపారతో పగలగొట్టి అందులోని డబ్బులు, భక్తులు వేసిన కానుకలను సంచిలో నింపుకుని వెళ్లిపోయాడు. తెల్లారి వచ్చిన పూజారులు చూసి ఆలయ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మెదక్ ​అడిషనల్​ ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ  సైదులు, సీఐ వెంకట్​తోపాటు  క్లూస్ టీం, ఐడీ పార్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఈఓ శ్రీనివాస్, అడిషనల్​ఎస్పీ, డీఎస్పీ మాట్లాడుతూ హుండీలో దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు క్యాష్​తో పాటు భక్తులు వేసిన వివిధ రకాల కానుకలను దొంగ ఎత్తుకెళ్లాడని చెప్పారు.   
అవి ముట్టుకోలే..మొక్కుకొని పోయిండు
15 రోజుల కింద అమ్మవారికి ఓ భక్తుడు చేయించిన రూ.5 లక్షల విలువ చేసే వెండి తొడుగు, అమ్మవారి ద్వారం దగ్గర రూ.25 లక్షలతో చేయించిన వెండి కడప తొడుగును దొంగ ముట్టుకోలేదు. ఒక హుండీని కొల్లగొట్టి మరో హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు వెళ్లిపోయేటప్పుడు అమ్మవారి పరదా పక్కకు జరిపి రెండు చేతులెత్తి దండం పెట్టుకుని మెల్లగా జారుకున్నాడు.     
ఆదాయం వస్తున్నా సెక్యూరిటీ ఏది?  
ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం  తెలంగాణలోనే పేరు పొందింది. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. శివరాత్రి సీజన్​లో భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఏడాదికి సుమారు రూ.7  కోట్ల వరకు ఆదాయం వస్తున్నా సర్కారు, ఆఫీసర్లు సెక్యూరిటీపై దృష్టి పెట్టడం లేదు. ఇంతకుముందు ఇద్దరు వాచ్​మెన్లు ఉండగా ఈ మధ్యే ఒకరు రిటైర్​ కాగా ఒక్కరే కాపలా కాస్తున్నారు. చోరీ జరిగినప్పుడు అతను కూడా ఆలయంలో కాకుండా వంద మీటర్ల దూరంలోని ఎండోమెంట్ ఆఫీసులో పడుకున్నాడు. దీనికీ ఓ కారణం ఉంది. ఏడాది కింద ఓ దొంగ ఎండోమెంట్​ఆఫీసులో రూ. 80 వేల విలువ చేసే వెండి తొడుగు ఎత్తుకెళ్లాడు. అప్పటి నుంచి వాచ్​మన్​ ఆఫీసులోనే డ్యూటీ చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ చోరీ జరిగింది. గత దసరా టైంలో పోలీస్​ ఔట్​ పోస్ట్​ ఏర్పాటు చేసినా చోరీని ఆపలేకపోయారు.