పార్క్ చేసిన లారీ దొంగతనం... నిందితులు అరెస్ట్

పార్క్ చేసిన లారీ దొంగతనం... నిందితులు అరెస్ట్

మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ మయూరి నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను నరేష్ అనే వ్యక్తి లాక్కుని వెళ్లినట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్, చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డట్టు డీసీపీ వెల్లడించారు. ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారన్న ఆమె... నరేష్ నడిపిన పల్సర్ బైక్ సైతం గచ్చిబౌలిలో దొంగిలించినదిగా తాము గుర్తించినట్టు స్పష్టం చేశారు. నరేష్ పై బైక్ చోరీ కేసు కూడా నమోదు చేశామని, పక్కా సమాచారంతోనే అతడిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడి వద్ద నుండి ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, ఒక బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నామన్నారు. నరేష్ పై గతంలో మొబైల్ స్నాచింగ్ కేసు కూడా నమోదైందని చెప్పారు. 

పార్క్ చేసిన లారీని దొంగిలించిన నిందితుల అరెస్ట్

మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 1వ తేదీన ఇంటి ముందు పార్క్ చేసిన లారీని దొంగిలించిన నిందితులను సైబరాబాద్ క్రైమ్ టీం అరెస్టు చేసింది. లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్న మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి... లేబర్ గా పని చేస్తున్న నార్ల మల్లేష్(32), ముడావత్ శ్రీను(32) ఇద్దరు కలిసి ఈ లారీని దొంగిలించారని స్పష్టం చేశారు. బాచూపల్లిలోని పార్కింగ్ ప్రదేశంలో ఈ లారీని దుండగులు ఉంచారని... అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. నిందితులను తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుడు నార్ల మల్లేష్ పై వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో మొత్తం 11 చోరీ కేసులు నమోదు అయ్యాయన్న డీసీపీ... పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 8 లక్షల విలువ చేసే లారీ స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.