లోన్ ఇప్పిస్తమని రూ.50లక్షల చోరీ

లోన్ ఇప్పిస్తమని రూ.50లక్షల చోరీ
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన మీర్ పేట్ పోలీసులు
  • 46 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం
  • పరారీలో మరో ఇద్దరు నిందితులు 

ఎల్ బీనగర్,వెలుగు:  భూమి కొనుగోలుకు లోన్ ఇప్పిస్తమని ఓ వ్యక్తిని మోసగించి రూ.50లక్షలు ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరిని మీర్ పేట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.46లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రాజాపూర్ తాలూకాకు చెందిన బన్సీలాల్ శర్మ(54)    సొంతూరిలోనే జమీర్ నిజాం ఖలీఫ్ కు చెందిన  15 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇందుకు ఎల్ బీనగర్ పరిధి మన్సూరాబాద్ కు చెందిన వజ్రగిరి దుర్గప్ప అలియాస్ సురేందర్ రెడ్డిని బన్సీలాల్ శర్మ ఆశ్రయించాడు.

దీంతో ఆ భూమి కొనుగోలుకు 6 శాతం వడ్డీతో  రూ.5 కోట్లులోన్ ఇప్పిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. లోన్ అప్రూవల్ కు డాక్యుమెంట్స్ పరిశీలించి తెచ్చేందుకు దుర్గప్ప తన అనుచరులైన అర్జున్, వెంకటేష్, మహేష్ లను పంపించాడు. ఆ తర్వాత లోన్ శాంక్షన్ కు బన్సీలాల్ శర్మను డిపాజిట్ అమౌంట్ కింద రూ.50లక్షలు జమ చేయాలని దుర్గప్ప సూచించాడు. దీంతో బన్సీలాల్ శర్మ భూమి అమ్మే నిజాం ఖలీఫ్ వద్దనే రూ.25లక్షలు చే బదులుగా తీసుకున్నాడు. మరో 25లక్షలు అడ్జెస్ట్ చేసి ఆ మొత్తం నగదును దుర్గప్పకు ఇచ్చేందుకు మీర్ పేట్ లోని జిల్లెలగూడ వద్ద ఉన్న స్వాగత్ గ్రాండ్ హోటల్ కు బన్సీలాల్ శర్మ వచ్చాడు.  

దుర్గప్ప కోసం వెయిట్ చేస్తుండగా అతని అనుచరుడు వెంకట్ వచ్చి బన్సీలాల్ శర్మను బెదిరించి రూ.50 లక్షలు తీసుకొని పరార్ అయ్యాడు. దీంతో బాధితుడు మీర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు.  ప్రధాన నిందితుడు దుర్గప్ప, అతని అనుచరుడు విజయ్ ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వెంకటేశ్, మహేష్ ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. కేసును దర్యాప్తు చేసిన ఇన్ స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, డీఐ సిబ్బందిని  వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి, డీసీపీ ప్రవీణ్ కుమార్ అభినందించారు.