ఈజీ మనీ కోసం ఇండ్లల్లో చోరీలు

ఈజీ మనీ కోసం ఇండ్లల్లో చోరీలు
  • ఇండ్లల్లో చోరీలు.. ఇద్దరు అరెస్ట్
  • 130 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం

సికింద్రాబాద్​, వెలుగు: ఇండ్లల్లో చోరీలు  చేస్తున్న ఇద్దరిని సౌత్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాబాద్​లోని సంతోశ్ నగర్ కు చెందిన సయ్యద్ మహబూబ్ అలీ అలియాస్ ఖుస్రో(42) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి జల్సాలకు బానిసై మహబూబ్ ఈజీ మనీ కోసం ఇండ్లల్లో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. సిటీ, సైబరాబాద్ కమిషనరేట్లలోని పీఎస్​ల పరిధిలో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా మహబూబ్ తీరు మారలేదు.  2020లో సంతోశ్​నగర్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపారు.

ఈ ఏడాది జులైలో బయటికి వచ్చిన మహబూబ్ తలాబ్ కట్టకు చెందిన తన చిన్నప్పటి ఫ్రెండ్ మహ్మద్ ఫిరోజ్(30)తో కలిసి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. వీరిద్దరు కలిసి ఆరు ఇండ్లల్లో చోరీలు చేశారు. వీరిపై ఎయిర్​పోర్టు పీఎస్, మీర్ చౌక్ పీఎస్​ల పరిధిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మంగళవారం చిలకలగూడలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.

వీరి దగ్గరి నుంచి రూ. 7 లక్షలు విలువైన 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల క్యాష్​ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. వారిని రిమాండ్​కు తరలించినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.