చీలపల్లిలో నాలుగు ఇండ్లలో చోరీ...ఒకే ఇంట్లో 100 తులాలకు పైగా బంగారం మాయం?

చీలపల్లిలో నాలుగు ఇండ్లలో చోరీ...ఒకే ఇంట్లో 100 తులాలకు పైగా బంగారం మాయం?

పెద్దశంకరంపేట, వెలుగు: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్‌‌‌‌‌‌‌‌చల్ చేశారు. గ్రామంలోని నాలుగు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రాయిని రాములు ఇంట్లోనే 100 తులాలకు పైగా బంగారం, రెండు కిలోలకు పైగా వెండి చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడలో జరిగిన స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లగా ఇంట్లో చోరీ జరిగిందని రాములు తెలిపారు. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో బంధువుల బంగారాన్ని తన ఇంట్లో ఉంచినట్లు వివరించాడు. 

అలాగే మాణిక్ రెడ్డి ఇంట్లో రెండున్నర తులాలు, జగ్గు చిన్న మల్లారెడ్డి, జగ్గు అరుంధతి ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించారని బాధితులు తెలిపారు. వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు జరగడంతో మండలంలో కలకలం రేగింది. ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒకే ఇంట్లో వంద తులాలకు పైగా బంగారం పోయిందనే ప్రచారం సంచలనం సృష్టించింది. మెదక్ ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. రాయిని రాములు ఇంట్లో వంద తులాలకు పైగా బంగారం చోరీకి గురైందన్న విషయంపై స్పష్టత లేదని ఎస్పీ తెలిపారు. విచారణలో ఆభరణాల అసలు పరిమాణం తేలుతుందని చెప్పారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి, టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ ఉన్నారు.