చేజార్చుకుంటున్నరు! బలమైన క్యాడర్ ఉన్నా ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు

చేజార్చుకుంటున్నరు! బలమైన క్యాడర్ ఉన్నా ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు
  •     ముఖ్య నేతలను తమవైపు తిప్పుకుంటున్న ఇతర  పార్టీలు
  •     ఎటు తేల్చుకోలేక నామినేషన్లు వేస్తున్న ఆశావాహులు 

సూర్యాపేట, వెలుగు :  కాంగ్రెస్‌‌లో పార్టీలో టికెట్లు రావాలంటే ఆశావహులు పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్ని స్థానాలకు ఇంకా టికెట్లు ప్రకటించకపోవడంతో.. గెలిచే అవకాశం ఉన్న స్థానాలు సైతం చేజారిపోయేలా ఉన్నాయి. నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉన్నప్పటికే  సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, నల్గొండ జిల్లాలోని మిర్యాల గూడ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో ఆ పార్టీ స్ర్కీనింగ్ కమిటీ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ జాప్యమే ఇప్పుడు శాపంగా మారుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ, బీఎస్పీ పార్టీలు.. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌‌ క్యాడర్‌‌‌‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆశావహులు మాత్రం ఎటూతేల్చుకోలేక పార్టీ తరఫున నామినేషన్లు మాత్రం వేస్తున్నారు. 

సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉన్నా.. 

టికెట్లు పెండింగ్‌‌ ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్  పార్టీ బలంగా ఉంది.  తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మిర్యాలగూడలో గెలుపొందగా.. సూర్యాపేట, తుంగతుర్తిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది.  2018 ఎన్నికల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌ గెలిచే అవకాశం ఉన్నా..  లీడర్ల వర్గ పోరు కారణంగా నామినేషన్ ముందు రోజు వరకు టికెట్ ఇవ్వకపోవడంతో స్వల్ప మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ సారైనా త్వరగా టికెట్ ఇస్తారనుకున్నా 2018 సీన్  రిపీట్‌‌ అవుతుండడంతో క్యాడర్ ఆందోళన చెందుతోంది.  

కాంగ్రెస్‌‌ నేతలను గాలం వేస్తున్న ఇతర పార్టీలు..

నామినేషన్‌‌కు రెండు రోజులే గడువు ఉన్నా..  టికెట్లపై ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే అదునుగా తీసుకుంటున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ, బీఎస్పీ నేతలు.. కాంగ్రెస్‌‌ నేతలు, క్యాడర్‌‌‌‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆఫర్లు ప్రకటిస్తూ తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్‌‌ రెడ్డిలో ఎవరికి టికెట్‌‌ వచ్చినా.. ప్రత్యర్థి వర్గాన్ని తమవైపు తప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

తుంగతుర్తిలో మోత్కుపల్లి నర్సింహులు, అద్దంకి దయాకర్, మందుల సామెల్ టికెట్లు ఆశిస్తుండగా.. ఇక్కడా ఇలాంటి పరిస్థితే ఉంది.  మిర్యాలగూడ టికెట్‌‌ పొత్తులో భాగంగా సీపీఎం ఆశించింది. కానీ, కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తుండడం, ఈయనకు ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేస్తుండడంతో హైకమాంట్ ఎటూ తేల్చడం లేదు.  పొత్తులు కన్ఫాం కాకపోవడంతో సీపీఎం తమ అభ్యర్థిగా జూలకంటి రంగారెడ్డిని ప్రకటించింది. 

పోటాపోటీగా నామినేషన్లు 

సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా.. ఆశావహులు మాత్రం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్న గుడిపాటి నర్సయ్య మంగళవారం నామినేషన్ వేయగా.. గురువారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి సైతం నామినేషన్లు వేసేందుకు  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు బల ప్రదర్శన చేసేందుకు ఇద్దరు నేతలు భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించుకున్నారు. టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌‌గా అయిన బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.