ఈ చిన్ని గుహల్లో దేవకన్యలు ఉంటారట. అందుకే వీటిని ఫెయిరీ హౌజ్‌లు అని పిలుస్తారు. ఇవి చాలా పవిత్రమైనవని నమ్ముతారు కొందరు. ఇది చదువుతుంటే ఈ ప్లేస్ మన దేశంలోనే ఉందనిపిస్తుంది. కానీ.. ఈ గుహలు ఇటలీలోని సార్డినియాలో ఉన్నాయి. వీటి గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు వీటిని సమాధులని, మరికొందరు సంపద దాచుకునే గనులని అంటుంటారు. వాస్తవానికి అవేంటనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.
సార్డినియాలో ఎక్కడికి వెళ్లినా పురాతన ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తుంటాయి. పూర్వకాలానికి చెందిన సంపద ఇప్పటికీ అక్కడ పదిలంగా ఉంది. ఈ ఐల్యాండ్ ఒక రహస్యమైన నురాజిక్ నాగరికతకు నిలయం. ఇక్కడ కొన్ని వేల రాతి బురుజులు ఉన్నాయి. అవి మూడు నుంచి మూడువేల ఐదొందల ఏండ్ల నాటివి. వీటితోపాటు దేవకన్యల నివాసాలుగా చెప్పుకునే కొన్ని రాతి గుహలు కూడా సార్డినియాలో ఉన్నాయి. అవి క్రీస్తుపూర్వం ఐదు వేల ఏండ్ల నుండి నాలుగువేల ఏండ్ల నాటివని చరిత్రకారులు చెప్తారు. ప్రస్తుతం అలాంటి దేవకన్యల ఇండ్లు 50కి పైగా ఉన్నాయి. వీటినే ‘‘హౌజ్ ఆఫ్ ది ఫెయిరీస్” అని పిలుస్తుంటారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. వీటిలో కొన్నింటి ద్వారాలు మనుషులు అడుగుపెట్టే వీలు కూడా ఉండదు. అలాంటి వాటిలోకి దేవకన్యలు మాత్రమే వెళ్లగలరనేది అక్కడి వాళ్ల నమ్మకం. ఇంకొందరేమో ఒకప్పుడు ఈ ప్రాంతంలో దేవకన్యలు ఉండేవాళ్లని, అప్పుడు వాళ్లు కట్టుకున్న ఇండ్లే ఈ గుహలని చెప్తుంటారు.
సమాధులు
వీటిని దేవకన్యల ఇండ్లని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నా.. కాదనేవాళ్లు కూడా ఉన్నారు. ‘‘ఇవి సమాధులు. వాటిలో ఆత్మలు ఉంటాయ’’ని అంటారు వాళ్లు. ఈజిప్ట్‌తోపాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో సమాధులు బయటపడ్డాయి. అలాగే ఇవి కూడా సమాధులే అయినప్పటికీ సరైన ఆధారాలు లేవనే వాదన ఉంది. వీటిలో కొన్ని పూర్వం సార్డినియాలో కట్టే ఇండ్లలా ఉన్నాయి. దీన్ని బట్టి అప్పటివాళ్లు సమాధులు కూడా ఇండ్లలాగే కట్టేవాళ్లని, కాకపోతే ఇండ్లతో పోలిస్తే ఇవి చాలా చిన్న సైజులో ఉన్నాయనేది చరిత్రకారుల అభిప్రాయం. ఒక్కో చోట వందకిపైగా శవాలను సమాధి చేసేవాళ్లట. పురావస్తు శాస్త్రవేత్త గియోవన్నీ లిల్లియు కూడా.. వీటిలో శవాలను ఉంచేవాళ్లనే చెప్పాడు. పైగా వాళ్లు ఉపయోగించే వస్తువులను కూడా శవాలతోపాటే పెట్టేవాళ్లు. ఆభరణాలు, బాణాలు, కత్తులు, రాతి గొడ్డళ్లు, నెక్లెస్‌లు, కంకణాలు, రాగి తీగ ఉంగరాలు కూడా ఇందులో పెట్టేవాళ్లు. కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా దొరక్కపోవడంతో ఇవి ఫెయిరీ హౌజెస్ అని నమ్మేవాళ్లే ఎక్కువ. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మనకంటే చాలా చిన్నగా, పొట్టిగా ఉండే మనుషులు ఉండొచ్చనే అనుమానం కూడా కొందరిలో ఉంది. ఎందుకంటే.. సార్డినియాలో ఉన్న గుహలు అచ్చం ఇండ్లలాగే ఉన్నాయి. వాటిలో ఇదివరకు ఆ పొట్టి మనుషులు ఉన్నారేమో అనిపిస్తుంది.
దాచుకునే గదులా?
సార్డినియన్ పురాణాలు, ఇతిహాసాల్లో నిధుల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటి ఆధారంగా.. గినో అనే వ్యక్తి ‘‘లెజెండ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ సార్డినియా” అనే పుస్తకం రాశాడు. అందులో చెప్పిన దాని ప్రకారం.. కొన్ని శతాబ్దాలుగా ఎంతోమంది ఆక్రమణదారులు సార్డినియాపై దండయాత్ర చేశారు. ఆ దండయాత్రల టైంలో తమ సంపదను కాపాడుకోవడానికి అక్కడి ప్రజలు ఇలాంటి రహస్య గుహలను ఏర్పాటుచేసుకున్నారు. దండయాత్రలు జరిగినప్పుడు ప్రజలు ఇండ్లలోని డబ్బు, విలువైన వస్తువులను తీసుకొచ్చి ఈ గుహల్లో పెట్టేవాళ్లు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ తీసుకునేవాళ్లు. అయితే.. ఆ సంపదకు కాపలాగా కొన్ని అదృశ్యశక్తులు ఉండేవని కూడా కొందరు చెప్తుంటారు.
మరణానంతర జీవితం
మనిషి చనిపోయాక కూడా ఒక జీవితం ఉంటుందని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లే ఈ గుహలను చెక్కారనే నమ్మకం ఉంది. నురాజిక్ ప్రజలు చనిపోయాక, కొత్త జీవితం మొదలు కావడానికి మధ్య కొంత టైం ఆత్మలు భూగర్భంలో ఉంటాయని నమ్మేవాళ్లు. అక్కడినుంచి వాళ్లు కొత్త ప్రయాణం కోసం ఎదురు చూసేవాళ్లట. అలాంటివాళ్ల కోసమే ఈ గుహలను తవ్వి అందంగా అలంకరించేవాళ్లని నమ్ముతారు కూడా.
