కేంద్రం తీసుకువచ్చిన NRC, CAA లపై దేశ వ్యాప్తంగా భయాందోళనలు ఉన్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మట్లాడుతూ.. చాలా రాష్ట్రాల సీఎంలు పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయమన్నారని, సీఎం కేసీఆర్ మాత్రం స్పందించడంలేదన్నారు.
బీజేపీ లాంటి ప్రభుత్వం ఏర్పడడానికి MIM లాంటి పార్టీలు పరోక్షంగా కారణమని భట్టి అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో MIM పోటీ చేసి లౌకిక పార్టీల ఓట్లు చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చే లాగా చేస్తుందని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు రహస్య మిత్రులని అన్నారు. ఇన్ని రోజులు లౌకిక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దేశం సుభిక్షంగా ఉందని భట్టి అన్నారు. ఇకనైనా మైనార్టీ సోదరులు MIM, బీజేపీ ల గురించి ఆలోచన చేసి లౌకిక పార్టీలకు అండగా ఉండాలన్నారు.
లౌకికవాద శక్తులను దూరంగా పెట్టడంతోనే దేశానికి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, వీటిపై సీఎం స్పందించాలన్నారు భట్టి. ఇది ఒక్క ముస్లింల సమస్య కాదని, అందరి సమస్య అని తెలిపారు.
“భారతీయ జాతి బిడ్డలమని మన జాతి బిడ్డలు నిరూపించుకోవాలా! ఇప్పుడున్న వారికే బర్త్ సర్టిఫికేట్లే లేవు…వారి తల్లిదండ్రులకు బర్త్ సర్టిఫికెట్లు ఏలా ఉంటాయి? తాతల సర్టిఫికెట్లు తెమ్మంటే ఎక్కడి నుండి తెస్తారు? ఇలాంటి బిల్లుల ద్వారా దేశం పెనుప్రమాదంలో పడుతుంది” అని భట్టి విక్రమార్క అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న గాందీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

