
- యువతకు స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- స్టూడెంట్లలో నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సిటీ
- టామ్‌కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు పొందిన 13 మందికి సర్టిఫికెట్లు అందజేసిన కార్మిక శాఖ మంత్రి
హైదరాబాద్, వెలుగు: వచ్చే రెండేండ్లలో విదేశాల్లో 10 వేల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ( టామ్‌కామ్ ) ఇందుకోసం పని చేస్తున్నదని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గత పదేండ్లలో రాష్ట్రం నుంచి కేవలం 12 వేల మందికి మాత్రమే విదేశాల్లో ఉద్యోగాలు లభించాయని అన్నారు. ప్లంబర్లు, టెక్నీషియన్లు, నర్సులు, తదితర స్కిల్స్ ఉన్న వారికి విదేశాల్లోని మెర్సిడెస్ బెంజ్, బాష్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయని చెప్పారు. అందుకే అక్కడి కంపెనీల అవసరాలకు తగ్గట్టు యువతకు స్కిల్స్ నేర్పించేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
టామ్‌కామ్ ద్వారా జర్మనీ భాష నేర్చుకొని అక్కడ ఉద్యోగాలు పొందిన 13 మందికి మంగళవారం సెక్రటేరియెట్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ నెలలో 12 మంది, వచ్చే నెలలో మరో ఆరుగురు జర్మనీలో ఉద్యోగాల్లో జాయిన్ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇంటర్, టెన్త్ పూర్తి చేసి ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో ట్రైనింగ్ తీసుకున్న వారికి టామ్ కామ్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి.. విదేశాలకు పంపిస్తున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఏటీసీల్లో 98 శాతం అడ్మిషన్లు
ఐటీఐలను ఆధునీకరించి టాటా సంస్థ సహకారంతో 65 చోట్ల అడ్వాన్స్డ్టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకూ 46 ఏటీసీలు ఓపెన్ అయ్యాయని చెప్పారు. ఈ ఏడాది ఏటీసీల్లో 98 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని, ఇది ఒక రికార్డ్ అని పేర్కొన్నారు. ఏటీసీల్లో 550 మంది ఫ్యాకల్టీని మంజూరు చేయాలని ఇటీవల సీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. మంచి ఫ్యాకల్టీ ఉంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎంతో చెప్పానన్నారు. కాగా, తెలంగాణకు చెందిన నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు టామ్‌కామ్ కృషి చేస్తున్నదని దాన కిశోర్ తెలిపారు. జర్మనీ భాష నేర్పించి.. ఆ దేశానికి పంపిస్తున్నామని, అక్కడ వారికి ఒక్కొక్కరికీ రూ. 2.8 లక్షల(2,800 యూరోలు) జీతం లభిస్తుందని వివరించారు. టామ్ కామ్ , ఐఈఎస్ తో అగ్రిమెంట్ చేసుకుందని, ఇందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చి జర్మనీకి పంపుతున్నట్టు తెలిపారు.
కాళేశ్వరంతో రాష్ట్ర ప్రజలపై భారం
కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని తాను మొదటినుంచీ చెబుతున్నానని, దీనివల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సెక్రటేరియెట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు కోసం తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించారని గుర్తు చేశారు. కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేసేందుకు కరెంట్ బిల్లులే రూ. 9 వేల కోట్లు అయ్యాయన్నారు. మల్లన్నసాగర్ కూడా పెద్ద స్కామేనని తెలిపారు. “కేసీఆర్ ఫాంహౌజ్ కోసమే మల్లన్న సాగర్ నిర్మించారు. ఇక్కడ 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ప్లాన్‌లో భాగంగానే హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం 20 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
గత పదేండ్లలో కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారు. మేడిగడ్డ నిర్మించింది.. కూలింది.. బీఆర్ఎస్పాలనలోనే. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డ నిర్మించిన కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి మంచి అవకాశం. పీసీ ఘోష్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ విచారణ అని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నందువల్ల సీబీఐకి అప్పగించాం ” అని మంత్రి వివేక్ వివరించారు. కేటీఆర్‌కు ఒక్క విషయంలో కూడా అవగాహన లేదని, విదేశాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తెస్తుంటే కాళేశ్వరం నుంచి అంటూ బీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే..
జూబ్లీహిల్స్ బై పోల్‌లో గెలుపు తమదేనని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గెలిచే అభ్యర్థులకే పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందని స్పష్టం చేశారు. సెక్రటేరియెట్‌లో ప్రెస్‌మీట్ అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేశారు. “కొద్ది కాలం క్రితం ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ఎడ్జ్ ఉండేది. మంత్రులం పర్యటించిన తర్వాత పరిస్థితి మారింది. సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. సానుభూతి ఉంటే కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ ఎందుకు గెలవలేదు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి. దీనిని బట్టి ఎంఐఎం ఎవరివైపు ఉందో అర్థమవుతుంది” అని అన్నారు. ఢిల్లీలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా చేస్తూ రాష్ట్రంలో యూరియా కోసం ధర్నాలు చేస్తున్నదని మండిపడ్డారు.