మనఊరి ఛానెళ్లు..వీళ్లే టాప్

మనఊరి ఛానెళ్లు..వీళ్లే టాప్

యూట్యూబ్​... ఇదొక వీడియోల పుట్ట. టాలెంట్​ ఉన్నోళ్లని నెత్తినపెట్టుకొనే పోటీ  ప్లాట్​ఫామ్. అంతేనా, డబ్బు సంపాదించి పెట్టే కార్ఖానా. ఇంకా చెప్పాలంటే కొత్తతరానికి అచ్చొచ్చిన ఆయుధం కూడా. విలేజ్ కామెడీతో ఫేమస్​ అయినోళ్లు, పల్లెపదాల్ని పాటగా అల్లి పాపులర్​ అయినోళ్లు, కమ్మని వంట వీడియోలతో స్టార్స్ అయినోళ్లు, యాక్టింగ్​ స్కిల్స్​తో సినిమా ఛాన్స్ కొట్టేసినోళ్లు చాలామందే ఉన్నారు. ముచ్చటగొలిపే మాటలతో జనం మెచ్చిన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు...

యూట్యూబ్​లో ఇన్ఫర్మేషన్​  వీడియోలే కాకుండా కామెడీ, రియలిస్టిక్​, సెటైరికల్​ వీడియోలు బోలెడు. టాలెంట్​కి కేరాఫ్​గా మారిన యూట్యూబ్​లో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్​లోడ్​ అవుతుంటాయి. వీటిలో ప్రాంక్​ వీడియోలు, ఫన్నీ వీడియోలు, పేరడీ కామెడీ, సినిమా ప్రమోషన్​ వీడియోలే ఎక్కువ. అయితే, ఈమధ్య పల్లెదనం, మట్టివాసన ఉన్న వీడియోలు బాగా పాపులర్​ అవుతున్నాయి. జనం ఎక్కువగా విలేజ్​ ఓరియెంటెడ్​ కంటెంట్​ చూసేందుకు ఇష్టపడుతున్నారు. జనాల టేస్ట్​కి తగ్గట్టే కొత్తకొత్త కంటెంట్​ రైటర్స్​ పుట్టుకొస్తున్నారు. ఫోక్​ పాటల్లోనే కాకుండా వీడియోల్లోనూ కనిపించే కొత్త ముఖాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె కామెడీ, ఫోక్​ సాంగ్స్​ వీడియోలు లక్షల్లో వ్యూస్​ సాధిస్తున్నాయి.   

స్మార్ట్ ఫోన్​ రాకతో.. 

ఇప్పుడు ఇంటర్నెట్​ అంటే తెలియనోళ్లు లేరు. టెక్నాలజీ డెవలప్​ అయినంక ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్​ఫోన్ ఉంటోంది. దీనికి తోడు అన్​లిమిటెడ్​ డేటా ఆఫర్లతో ఆన్​లైన్​ మీద ఉండే టైమింగ్​ పెరిగింది.  పిల్లల నుంచి పెద్దల దాకా ఏ డౌట్​ వచ్చినా, ఏదన్నా కొత్త విషయం గురించి అయినా గూగుల్​ కానీ, యూట్యూబ్​ కానీ ఓపెన్​ చేస్తున్నారు. లాక్​డౌన్​ టైంలో రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో టైం పాస్​ కోసం జనం యూట్యూబ్​ వీడియోల్ని తెగ చూశారు. ముఖ్యంగా విలేజ్​ బ్యాక్​డ్రాప్​ వీడియోలు, కామెడీ, ఫోక్​ సాంగ్​, కరోనా అవేర్​నెస్​, కరోనా జాగ్రత్తలు సూచించే వీడియోల్ని లెక్కలేనంత మంది చూశారంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసి చూసి, మేము సైతం అంటూ సొంతంగా వీడియోలు తీసి అప్​లోడ్​ చేస్తున్నారు కొందరు.  

ఇన్ఫర్మేషన్​తో మొదలై..

ఒకప్పుడు  టైం పాస్​ కోసం యూట్యూబ్​ వీడియోలు చూసేటోళ్లు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్​ కోసం యూట్యూబ్ చూడడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. యూట్యూబ్​నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు చాలామంది. తమ టాలెంట్​, క్రియేటివిటీతో యూట్యూబ్​లో పాపులర్​ అవుతున్నారు. వీళ్లలో చదువుకున్నోళ్లు, అక్షరం ముక్క రానోళ్లు కూడా ఉన్నారు. అర్థం కాని విషయాన్ని కూడా అరటిపండు ఒలిచి తినిపించినట్టు చెబుతారు. అది కూడా అందరికీ అర్థమయ్యే పల్లె భాషలో. ఇంతకన్నా ఏం కావాలి? ఒక విషయం జనాల్లోకి వెళ్లడానికి.యూట్యూబ్​... ఇదొక వీడియోల పుట్ట. టాలెంట్​ ఉన్నోళ్లని నెత్తినపెట్టుకొనే పోటీ  ప్లాట్​ఫామ్. అంతేనా, డబ్బు సంపాదించి పెట్టే కార్ఖానా. ఇంకా చెప్పాలంటే కొత్తతరానికి అచ్చొచ్చిన ఆయుధం కూడా. విలేజ్ కామెడీతో ఫేమస్​ అయినోళ్లు, పల్లెపదాల్ని పాటగా అల్లి పాపులర్​ అయినోళ్లు, కమ్మని వంట వీడియోలతో స్టార్స్ అయినోళ్లు, యాక్టింగ్​ స్కిల్స్​తో సినిమా ఛాన్స్ కొట్టేసినోళ్లు చాలామందే ఉన్నారు. ముచ్చటగొలిపే మాటలతో జనం మెచ్చిన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు...
యూట్యూబ్​లో ఇన్ఫర్మేషన్​  వీడియోలే కాకుండా కామెడీ, రియలిస్టిక్​, సెటైరికల్​ వీడియోలు బోలెడు. టాలెంట్​కి కేరాఫ్​గా మారిన యూట్యూబ్​లో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్​లోడ్​ అవుతుంటాయి. వీటిలో ప్రాంక్​ వీడియోలు, ఫన్నీ వీడియోలు, పేరడీ కామెడీ, సినిమా ప్రమోషన్​ వీడియోలే ఎక్కువ. అయితే, ఈమధ్య పల్లెదనం, మట్టివాసన ఉన్న వీడియోలు బాగా పాపులర్​ అవుతున్నాయి. జనం ఎక్కువగా విలేజ్​ ఓరియెంటెడ్​ కంటెంట్​ చూసేందుకు ఇష్టపడుతున్నారు. జనాల టేస్ట్​కి తగ్గట్టే కొత్తకొత్త కంటెంట్​ రైటర్స్​ పుట్టుకొస్తున్నారు. ఫోక్​ పాటల్లోనే కాకుండా వీడియోల్లోనూ కనిపించే కొత్త ముఖాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె కామెడీ, ఫోక్​ సాంగ్స్​ వీడియోలు లక్షల్లో వ్యూస్​ సాధిస్తున్నాయి.   

లాక్​డౌన్​లో ఇంకింత

లాక్​డౌన్​ మొదట్లో కొంత కష్టంగా అనిపించింది. రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో బోర్​కొట్టేది. అప్పుడు  చాలామంది ఆన్​లైన్​లో వీడియోలతో టైం పాస్​ చేశారు. ఆ టైంని కొంతమంది కంటెంట్​ క్రియేటర్స్​ గొప్ప అవకాశంగా మలుచుకున్నారు. క్రియేటివిటీకి రెక్కలు తొడిగారు. ఎలాంటి వీడియోలు   ట్రెండ్​ అవుతాయో? ఏ వీడియోలకి క్రేజ్​ ఎక్కువ? అనేది తెలుసుకున్నారు. అప్పటిదాకా యూట్యూబ్​ వీడియోలు చూసి నవ్వుకునే వాళ్లలో చాలామంది మొదటిసారి వీడియోలు తీయడం స్టార్ట్​ చేశారు. ఎక్కువమందికి రీచ్​ అయ్యేలా  జనం భాషలో కరోనా అవేర్​నెస్​ వీడియోలు, ప్రాంక్​ వీడియోలు చేశారు. వాటికి మంచి రెస్పాన్స్​ రావడంతో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ఉన్న వీడియోలు చేసే పనిలో పడ్డారంతా.  

కామెడీ వీడియోలతో  

యూట్యూబ్​లో జబర్దస్త్​ వీడియోలకి ఉన్నంత పాపులారిటీ ఉంది కొందరికి. అయిదేళ్ల పిలగాండ్ల నుంచి అరవై యేండ్ల అవ్వ వరకు యూట్యూబ్​ వీడియోలతో నవ్విస్తున్నారు. 5 స్టార్​ జున్ను, మిల్కూరి గంగవ్వ  వంటి వాళ్ల కామెడీ వీడియోలకి చాలా క్రేజ్​ ఉంది. గంగవ్వది జగిత్యాల మండలం లంబాడిపల్లి. అదే ఊరికి చెందిన శ్రీరామ్​ శ్రీకాంత్​ ఐడియా అయిన ‘మై విలేజ్​ షో’ అనే విలేజ్​ కామెడీ  షోతో చాలా పాపులర్​ అయింది. ఆ షో అంతగా క్లిక్​ అవ్వడంలో గంగవ్వ రోల్ చాలానే​ ఉంది. ఆమె మాటలు, ఎక్స్​ప్రెషన్స్ స్పెషల్​గా అనిపిస్తాయి. ఆమెని చూసినా, ఆమె మాటలు విన్నా చాలామందికి వాళ్ల అమ్మమ్మ, నాయనమ్మలు యాదికొస్తరు. ఒకప్పుడు పొలం పనులకి వెళ్లి,  బీడీలు చుట్టి బతుకు వెళ్లదీసిన గంగవ్వ ఇప్పుడు  సినిమా ప్రమోషన్​ వీడియోలు చేసే స్థాయికి ఎదిగింది. కొత్త సినిమా రిలీజ్​ అవుతుందంటే చాలు ఆ సినిమా ప్రమోషన్​ టీంకి గంగవ్వ గుర్తుకొస్తుంది. ఆమెకి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ‘మల్లేశం’, ‘ఇస్మార్ట్​ శంకర్’  సినిమాల్లో నటించింది. ‘రాజరాజచోర’ సినిమా ట్రైలర్​కి వాయిస్​ ఓవర్​ కూడా ఇచ్చింది. 
యూట్యూబ్​ ఛానెల్​: My Village Show

ఫోక్​ సాంగ్స్​తో పాపులర్​

యూట్యూబ్​లో  ఫోక్​సాంగ్స్​ని లక్షల్లో చూస్తున్నారు. ఎమోషనల్, మోటివేషనల్​, లవ్​ఫెయిల్యూర్​ సాంగ్స్ వీడియోలు చేసేవాళ్లే ఎక్కువ. యంగ్​స్టర్స్​ మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా ఈ పాటల్ని బాగా రిసీవ్​ చేసుకుంటున్నారు. పల్లెపదాల్ని పొదిగిన ప్రతి పాటని గుండెల్లో పెట్టుకుంటున్నారు. రాసేవాళ్లు ప్రాణం పెట్టి రాస్తున్నారు. పాడేవాళ్లు కూడా ప్రాణం పెట్టి పాడుతున్నారు. జానపద గీతాలతో ఫేమస్​ అయిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు... 
తెలంగాణ పల్లెపల్లెలో అడుగడుగునా జానపదం జాడలు కనిపిస్తాయి. ఎవరిని కదిలించినా వాళ్ల నోట ఎన్కటి పాటలు, తమ అమ్మమ్మలు, నానమ్మల నుంచి నేర్చుకున్న పాటలు వినిపిస్తాయి. అలాంటిదే సరికొత్త జానపదం బంతిపూల వాసన. ఫోక్​ సింగర్ ముక్కపల్లి శ్రీనివాస్​ రాసి, పాడిన ఈ పాట యూట్యూబ్​లో పెద్ద హిట్​. ఆ తర్వాత రిలీజ్​ చేసిన ‘పోంగా పోంగా పొట్ల చెరువు’, ‘చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు’ పాటలకి  కూడా లక్షల్లో వ్యూస్​ ఉన్నాయి. 

కుకింగ్​ వీడియోలతో

వంటతో ఎవరినైనా మెప్పించవచ్చు. ఇంటిల్లిపాది హెల్దీగా ఉండాలన్నా, పిల్లలు  మారాం చేయకుండా తినాలన్నా ఫుడ్ టేస్టీగా, కలర్​ఫుల్​గా ఉండాలి. అదే ఫార్ములా లాక్​డౌన్​ ఎంతోమందిని చెఫ్​లుగా మార్చింది. అంతేకాదు కుకింగ్​ మీద ప్యాషన్​ ఉన్నోళ్లని యూట్యూబర్స్​ని చేసింది కూడా. వాళ్లలో ఫేమస్​ అయిన కొందరి జర్నీ గురించి...

జీవితాన్ని మార్చిన రొట్టెల వీడియో   

హర్యానాలోని నౌరంగాబాద్​కి చెందిన బబితా పర్మర్​ ఇప్పుడు యూట్యూబ్​ సెన్సేషన్​. ఆమె భర్త సరదాగా తీసిన ఒక్క వీడియో వాళ్ల లైఫ్​ని మార్చేసింది. రోజూ లెక్కనే ఆ రోజు కూడా ఇంట్లోవాళ్ల కోసం రొట్టెలు చేస్తోంది బబిత.  భర్త  రంజిత్​ ఆమె రొట్టెలు చేస్తున్న వీడియో తీసి నెట్​లో పోస్ట్​ చేశాడు. రెండు రోజుల్లోనే ఆ వీడియోని పదిలక్షలమంది చూశారు. అప్పటి నుంచి వారానికి రెండు వీడియోలు పోస్ట్​ చేసేవాళ్లు. యూట్యూబ్​ వాళ్ల నుంచి నెల సంపాదనగా పదమూడు వేలు అందుకుంది బబిత. ఇంట్లో వైఫై ఏర్పాటు చేసుకొని సొంతంగా ‘బబితా రాజ్​పుత్’ యూట్యూబ్​ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానెల్​కి నాలుగున్నర లక్షల మంది సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. అలాగని బబిత కష్టమైన వంటకాలు చేయదు. ఆమె టీ పెడుతున్న వీడియోని కూడా వేలల్లో చూశారంటే ఆమెకున్న క్రేజ్​అర్థమవుతుంది. ఇప్పుడు వంటల యూట్యూబ్​ వీడియోలతో బబితా నెలకి డెబ్భై వేల దాకా సంపాదిస్తోంది. 
యూట్యూబ్​ ఛానెల్: Babita Rajput

లేబర్​ నుంచి యూట్యూబర్​ దాకా

ఇజాక్​ ముండా.. ఒడిశాలోని సాంబల్​పూర్​ జిల్లాలో ఉన్న బాబుపలి ఊరికి చెందిన గిరిజన యువకుడు. రోజూ కూలీ పనికి పోయొటోడు. లాక్​డౌన్​ టైంలో పని లేదు. అప్పుడే అతడికి యూట్యూబ్ వీడియోలు చేయాలనే ఐడియా వచ్చింది. ఫ్రెండ్ దగ్గర మూడు వేల రూపాయలు అప్పు తీసుకొని ఫోన్​ కొన్నాడు. ప్లేట్​ నిండా అన్నం పెట్టుకొని, ఉన్న కొంచెం కూరతోనే ప్లేట్​ ఖాళీ చేశాడు. ఆ వీడియోని ఒక్కరోజులోనే వేల మంది చూశారు. ఆ ఒక్క వీడియోతో మనోడి దశ తిరిగింది. ఫుడ్​ వీడియోలతో బిజీ అయిపోయాడు. తన పేరు మీద ‘ఇజాక్ ముండా ఈటింగ్’ యూట్యూబ్​ ఛానెల్​ ఓపెన్​ చేశాడు. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ‘‘నేను సెవెన్త్​ క్లాస్​ వరకే చదివాను. మా కమ్యూనిటీ, కల్చర్​, జీవన విధానాన్ని అందరికీ తెలియజేసేలా వీడియోలు చేయాలి అనుకున్నా. మేము ఎంత సింపుల్​గా బతుకుతామో వీడియోల ద్వారా చెబుతున్నా” అంటాడు ఈ యూట్యూబర్​.
యూట్యూబ్​ ఛానెల్: Isak Munda Eating

విలేజ్​ కుకింగ్​ ఛానెల్​

తమిళనాడుకి చెందిన ‘విలేజ్​ కుకింగ్​ ఛానెల్’ ఈ మధ్యే కోటి సబ్​స్ర్కయిబర్స్​ అచీవ్​మెంట్​ని సాధించింది. యూట్యూబ్​ వాళ్లు అభినందిస్తూ ‘డైమండ్​ ప్లే బటన్​’ అవార్డ్ కూడా ఇచ్చారు. ఎక్కువ మంది చూసిన ఇండియన్​ యూట్యూబ్​ ఛానెల్​  కూడా ఇదే. పుదుక్కొట్టై​ జిల్లాలోని ‘చిన్న వీరమంగళం’కి చెందిన సుబ్రమణ్యన్​, మురుగేశన్, అయ్యనార్​, తమిళ్​సెల్వన్​, ముతుమక్కం అనే  ఐదుగురు ఈ ఛానెల్​ని నడిపిస్తున్నారు. రాహుల్​గాంధీ వీళ్లతో మాట్లాడి, గంటె తిప్పి, కలిసి భోజనం చేయడంతో వీళ్ల ఛానెల్​ మరింత పాపులర్​ అయింది. ‘ఎల్లరుమ్​ వంగో’  (అంటే తెలుగులో ‘అందరికీ వెల్​కమ్​’ అని అర్థం) అంటూ ఆ రోజు వంటకం వీడియో తీస్తారు. 

ఈ ఐదుగురు ఆరు నెలలు పొలం పనుల్లో బిజీగా ఉంటారు. మిగతా టైంలో కుకింగ్​ వీడియోలు చేస్తారు. ఈ టీంలోని పెరియాతంబి చేయి తిరిగిన వంటవాడు. పాతికేళ్ల వయసులోనే అతను కుకింగ్​ జర్నీ స్టార్ట్​ చేశాడు. ఈ కుకింగ్​ ఛానెల్​ అంతగా ఫేమస్​ అవడానికి కారణం పచ్చని చెట్లు, కాల్వ గట్లు పొంటి వంట చేస్తారు. కుకింగ్​ వీడియో కంప్లీట్​ అయినంక వండినదాన్ని మెంటల్లీ ఛాలెంజ్డ్​, పిల్లల ఆదరణకి నోచుకోని తల్లిదండ్రులకి పంచుతారు. వంట సామాను కోసమే నెలకి దాదాపు 2 – 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. యూట్యూబ్​ ద్వారా నెలకి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వచ్చిన డబ్బుల్ని అందరూ సమానంగా తీసుకుంటారు. ఈ టీంలోని నలుగురు ఒకప్పుడు ‘విదేశాలకి వెళ్లి డబ్బు సంపాదించాలి’ అనుకున్నారు. ఇప్పుడు ‘వంట చేయడం కోసం ఫారెన్​ వెళ్లాలి’ అనుకుంటున్నారు. 
యూట్యూబ్​ ఛానెల్: Village Cooking 

ఈ ఛానెళ్లు సూపర్​ హిట్​

రీజినల్​ యూట్యూబ్​ ఛానెళ్లు ఈ మధ్య బాగా పాపులర్​ అవుతున్నాయి. కంటెంట్​ క్రియేటర్స్​ కూడా లోకల్​ కంటెంట్​, సంస్కృతి, సంప్రదాయాలకి చాలా ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. మన దగ్గరకు వస్తే...  తెలంగాణ ఊళ్లోని ముచ్చట్లు, సుద్దులు, పండుగలు, పబ్బాలు.... వీటన్నింటిని అచ్చమైన పల్లె భాషలో వింటుంటే థ్రిల్లింగ్​ అనిపిస్తుంది. చాలామంది కంటెంట్​ రైటర్స్​ తెలంగాణ పల్లెల్ని, తెలంగాణ యాసని, భాషని, కట్టుబొట్టుని ప్రతిబింబించే  పాటలు, వీడియోలు చేస్తున్నారు. అందుకేనేమో ఆ పాటల్ని జనం అంతగా ఆదరిస్తున్నారు. ఫుల్​ కామెడీగా ఉండే ‘క్రియేటివ్​ థింక్స్’, ‘మన ఊరి ముచ్చట్లు’, ‘మన పల్లె ముచ్చట్లు’, ‘మన తెలంగాణ టాకీస్​’ వంటి యూట్యూబ్​ ఛానెళ్లు చూస్తుంటే పొద్దే తెలియదు. జనం ఎక్కువగా చూస్తున్న లోకల్​ యూట్యూబ్​ ఛానళ్లలో ఇవీ ఉన్నాయి. ఇవి కాకుండా... ప్రాంక్​ వీడియోలు, డెయిలీ లైఫ్, జ్యువెల్లరీ, షాపింగ్​ ఎట్లా చేయాలి? న్యూస్​ క్లిప్స్​ని వివరించే యూట్యూబ్​ ఛానెళ్లు చూసేటోళ్లు కూడా ఎక్కువే.  

కుకింగ్​ మీద ప్యాషన్​తో...

మాది నల్లొండ. నాకు కుకింగ్​ అంటే ప్యాషన్. నెలన్నర రోజుల పాటు నేనే సొంతంగా కుకింగ్​ వీడియోలు చేశాను. ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంటే దారిలో మిర్చీ బండి కనిపించింది. ఇంట్లోనే బండి మీద వేసినట్టుగా మిర్చీబజ్జీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండేది. వెంటనే కారు ఆపి, ఆ బండి దగ్గరికి వెళ్లి ‘మిర్చీబజ్జీ కుకింగ్​ వీడియో చేద్దాం’ అని అడిగాను. అప్పటికే నా ‘కిచెన్​ టూర్​’ వీడియో వైరల్​ అయింది. మిర్చీబజ్జీ వీడియో చేసే టైంకి 25 వీడియోలు రెడీగా ఉన్నాయి. తర్వాత బండి మీద చేసే ఇడ్లీ, దోశ చట్నీ వీడియోలు చేశాను. నేను ట్రై చేసిన ప్రతి వంటకం బాగా కుదిరింది. నా కుకింగ్​ వీడియోల్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి, అమ్మమ్మ చేసినవి, ట్రెడిషనల్ రెసిపీలు ఉంటాయి. ‘శైలాస్​ కిచెన్​’​ ఛానెల్​ స్టార్ట్​ చేసిన ఐదు నెలల్లోనే రెండు లక్షలపైగా సబ్​స్క్రయిబర్స్​ అయ్యారు. వారానికి మూడు కుకింగ్​ వీడియోలు చేస్తాను. వ్యూయర్స్​లో నమ్మకం పెంచేందుకు ఇప్పుడు మాస్టర్స్​ని పెట్టి కుకింగ్​ వీడియోలు చేయిస్తున్నా.  వ్యూవర్స్​ డిమాండ్​ని బట్టి వీడియోలు చేస్తాం. తెలంగాణ వంటకాలు, ఫ్యూజన్​ పుడ్​తో పాటు అన్ని జోన్​లని టచ్ చేయాలి అనుకుంటున్నా. నా ఇంటెన్షన్​ ఏమంటే...  అందరిలో వంట మీద ఇంట్రెస్ట్ పెంచాలి. అలాగైతే, ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
శైలజ, ‘శైలాస్​ కిచెన్​’ ఫౌండర్, యూట్యూబ్​ ఛానెల్: Sailaws Kitchen

ఊపిరి ఉన్నంత వరకు పాటతోనే...

మాది సిద్దిపేట జిల్లాలోని పద్మనాభునిపల్లి. నాలుగో క్లాసు నుంచే పాటలు పాడేటోడ్ని. మా తాతకి బాగోతం, యక్షగానం వచ్చు. మా అమ్మ కూడా బాగా పాడుతుంది. చిన్నప్పట్నించి  కల్చరల్​ ప్రోగ్రామ్స్​కి మా బంధువు​ డప్పు బాబుతో కలిసి వెళ్లేటోడ్ని. ఒకరకంగా ఆయన నాకు గురువు. మా ఊళ్లోని ముక్కపల్లి మల్లేశం పాడిన ‘వరకట్నం’ పాట జానపదాల మీద ఇష్టాన్ని పెంచింది. నేను పాడిన మొదటి ఫోక్​ సాంగ్​ కూడా అదే. ఇంటర్మీడియెట్​లో ఎన్​ఎస్​ఎస్​ క్యాంప్​లో సింగింగ్​లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డిగ్రీ సెకండ్​ ఇయర్​లో మాటీవీ ‘రేలా రె రేలా’కి సెలక్ట్ అయ్యా. మెదక్​ జిల్లా జానపదాల మీద పీహెచ్​డీ కూడా​ చేశాను. పాటలు పాడాలనే జిజ్ఞాస అలాగే ఉండిపోయింది. ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటున్న టైంలోనే యూట్యూబ్​ ప్లాట్​ఫామ్​ గురించి తెలిసింది. నా భార్య భార్గవి (రేలా రె రేలా ఫేం) కూడా సింగరే. ఇద్దరం కలిసి మా పాప ఆధ్యశ్రీ  పేరుతో మ్యూజిక్​ ఛానెల్​ పెట్టి,ఈఈ ‘బంతిపూల వాసన’ సాంగ్​ రిలీజ్​ చేశాం. ఆ  పాటకి, తర్వాతి రెండు పాటలకి  కూడా మంచి రెస్పాన్స్​ వచ్చింది. పాటంటే నాకు ఎంత ఇష్టమంటే... ఊపిరి ఉన్నంత వరకూ పాటతోనే నా ప్రయాణం. 
- ముక్కపల్లి శ్రీనివాస్, ఫోక్​ సింగర్​, యూట్యూబ్​ ఛానెల్: Aadhya Sri Music

యూట్యూబ్​ జర్నీ ఇది

గూగుల్​ తర్వాత ఎక్కువమంది చూసేది యూట్యూబ్​. ఇది అమెరికాకి చెందిన​ ఆన్​లైన్​ వీడియో షేరింగ్​, సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్. దీన్ని 2005లో స్టీవ్​ చెన్​, చాడ్​ హర్లే, జావేద్​ కరీం మొదలుపెట్టారు.2006 గూగుల్​ చేతికి వచ్చినంకనే యూట్యూబ్​ అందరికీ తెలిసింది.  మొత్తంగా మూడుకోట్ల డెబ్బై లక్షలకుపైనే యూట్యూబ్​ ఛానెళ్లు ఉన్నాయి. వీటిలో మ్యూజిక్ వీడియోలు, వీడియో క్లిప్స్, షార్ట్​ ఫిల్మ్స్​, డాక్యుమెంటరీలు, లైవ్​ స్ట్రీమింగ్​, వ్లాగ్స్ వంటివి ఎక్కువ అప్​లోడ్​ చేస్తున్నారు. గూగుల్ అకౌంట్​ ఉంటే చాలు పద్దెనిమిదేళ్లు నిండిన ఎవరైనా వీడియోలు పోస్ట్ చేయొచ్చు. లైవ్​ స్ట్రీమింగ్​కి కూడా ఛాన్స్​ ఉంది.  

5 స్టార్​ జున్ను

యూట్యూబ్​ వీడియోలు చూసేవాళ్లలో ‘జున్ను’ పేరు తెలియని వాళ్లు ఉండరు. ముద్దు ముద్దు మాటలతో చిన్నారి జున్ను చేసే అల్లరి అంతాఇంతా కాదు. జున్నుది జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలంలోని కొండాపూర్​.  విలేజ్​ కామెడీ బేస్​ చేసుకున్న ఆన్​లైన్​ క్లాసులు, పండుగల వీడియోల్లో లీడ్​ రోల్​గా జున్ను ఎంతగానో నవ్విస్తుంది. జున్ను నటిస్తున్న‘5స్టార్​ జున్ను’ ఛానెల్​ ​కి నలభై లక్షల మందికి పైగా సబ్​స్ర్కయిబర్స్​ ఉన్నారు. ‘అక్వేరియం, మేడారం పార్క్, పిట్టగూళ్ల’ మీద జున్ను చేసిన వ్లాగ్స్​ని లక్షల మంది చూశారు. అంతేకాకుండా ‘తెలంగాణ విలేజ్​ కామెడీ’ ఛానెల్లో కూడా జున్ను అదరగొడుతోంది. ఒకపక్క చదువుకుంటూనే యూట్యూబర్​గా పాపులర్​ అయింది ఈ చిన్నారి. 
యూట్యూబ్​ ఛానెల్​: 5 Star Junnu

డెబ్భై య్యేళ్ల కుక్​  

అహ్మద్​నగర్​కి చెందిన సుమన్​ ధమనె అనే పెద్దావిడకి కుకింగ్​ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఆప్లి ఆజీ’ (అవర్​ గ్రాండ్​మదర్​) పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టింది. కెమెరా అంటే భయంతో వీడియోలు తీస్తున్న మొదట్లో నెర్వస్​గా ఫీలయ్యేది. అప్పుడు ఆమె పదిహేడేళ్ల మనవడు యష్​ ధమనె ధైర్యం చెప్పాడు. అతనే వంట వీడియోల్ని యూట్యూబ్​లో పోస్ట్ చేస్తుండేవాడు. ఈ పెద్దావిడ  మహారాష్ట్ర ప్రత్యేక వంటకాల్ని చాలా టేస్టీగా వండుతుంది.140కి పైగా స్పెషల్​ రెసిపీల వీడియోల్ని పెట్టింది. ఒక్కో వీడియోని లక్షల మందిపైనే చూశారు. మొదట్లోనే దాదాపు అయిదువేల మంది సబ్​స్ర్కయిబ్​ చేసుకున్నారు. దాంతో ఆర్నెల్లలోనే ‘ఆప్లి ఆజీ’ ఛానెల్​ చాలా పాపులర్​ అయింది. ‘‘నాకు యూట్యూబ్​ అంటే తెలియదు. వంట వీడియోల్ని సోషల్​మీడియాలో పెడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు యూట్యూబ్​లో రెసిపీ వీడియోల్ని పోస్ట్​ చేయకుండా ఉండలేకపోతున్నా”అని చెప్పింది సుమన్​ ధమనె. ఇప్పుడీ ఛానెల్​ని పదిలక్షల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. యూట్యూబ్​ ఛానెల్: Aapli Aaji

యూట్యూబ్ క్రియేటర్​ అవార్డ్స్​ 

యూట్యూబ్​లో పెట్టే ప్రతి వీడియో కోసం క్రియేటర్స్​ ఎంతగానే కష్టపడతారు. అందుకే వాళ్ల కష్టాన్ని గుర్తించాలి అనుకుంది యూట్యూబ్​. పాపులర్​ అయిన ఛానెళ్లకి అవార్డులు ఇస్తోంది​. ఈ అవార్డులని ‘యూట్యూబ్​ క్రియేటర్​ అవార్డ్స్’, ‘యూట్యూబ్​ ప్లే బటన్స్’ అని పిలుస్తారు. ఒక ఛానెల్​కి ఎంతమంది సబ్​స్ర్కయిబర్స్​ ఉన్నారు? ఆయా ఛానెళ్లు యూట్యూబ్​ గైడ్​లైన్స్​ ఫాలో అవుతున్నాయా? లేదా? అనేది రివ్యూ చేస్తారు. అన్ని అర్హతలు ఉన్న ఛానెల్​కి యూట్యూబ్​ ప్లే బటన్​ గుర్తు ఉన్న ఫ్లాట్​ ట్రోఫీని గిఫ్ట్​గా ఇస్తారు. అయితే, సబ్​స్ర్కయిబర్స్​ సంఖ్యని బట్టి ఇచ్చే ట్రోఫీ సైజ్​, కేటగిరీ మారుతుంది. యూట్యూబ్​ ప్లే బటన్స్​ని న్యూయార్క్​లోని ‘సొసైటీ అవార్డ్స్​’ కంపెనీ తయారుచేస్తుంది. హారర్​, టెర్రరిజాన్ని హైలైట్​ చేసే పొలిటికల్​ కంటెంట్​ చూపించే ఛానెళ్లని అవార్డుల లెక్కలోకి తీసుకోరు. 

  • గ్రాఫైట్​ అవార్డ్ – వెయ్యిలోపు సబ్​స్ర్కయిబర్స్​ ఉన్న ఛానెళ్లకి గ్రాఫైట్​ అవార్డ్ ఇస్తారు. వందమంది, ఆ పైన సబ్​స్ర్కయిబర్స్​ ఉన్నవాళ్లు ‘కస్టమ్​ యూఆర్​ఎల్’ (యూనిఫామ్ రిసోర్స్​ లొకేటర్​)కి అప్లై చేయొచ్చు.
  • ఒపెల్​ – వెయ్యి నుంచి పదివేల్లోపు మంది సబ్​స్ర్కయిబర్స్​ ఉన్న ఛానెళ్లకి ఈ​ అవార్డ్ వస్తుంది. ఒక చానెల్​‘యూట్యూబ్​ పార్ట్​నర్​ ప్రోగ్రాం’ కి ఎలిజిబుల్​ అవ్వడానికి కనీసం ఇంతమంది సబ్​స్ర్కయిబర్స్ ఉండాలి.  
  • బ్రాంజ్​ – పది వేల నుంచి లక్ష మంది సబ్​స్ర్కయిబర్స్​ ఉంటే బ్రాంజ్​ అవార్డ్ వచ్చినట్టే. 
  • సిల్వర్​ క్రియేటర్​ అవార్డ్– సబ్​స్ర్కయిబర్స్​ లక్ష దాటిన ఛానెళ్లు ఈ అవార్డుకి ఎలిజిబుల్. ఈ మార్క్​ దాటిన చానళ్లు ‘డిజిటల్​ వెరిఫికేషన్​ బ్యాడ్జి’కి అప్లై చేసుకొనే వీలుంది. 
  • గోల్డ్ క్రియేటర్​ – పదిలక్షల మంది సబ్​స్ర్కయిబర్స్ ఉన్న ఛానెళ్లకి ఈ అవార్డ్​ దక్కుతుంది. 
  • డైమండ్ క్రియేటర్​ – ఈ అవార్డ్ రావాలంటే ​సబ్​స్ర్కయిబర్స్​ సంఖ్య కోటి దాకా ఉండాలి. ఇప్పటివరకూ 911 ఛానెళ్లు డైమండ్​ క్రియేటర్​ అవార్డ్ గెలుచుకున్నాయి. 
  • రూబీ​ క్రియేటర్​ అవార్డ్ – అయిదు కోట్ల మంది సబ్​స్ర్కయిబర్స్​ కావాలి.  25 ఛానెళ్లు మాత్రమే ఈ అవార్డ్ దక్కించుకున్నాయి. వాటిలో పిల్లల ఛానెల్​ ‘చుచు టీవీ’ కూడా ఉంది. 
  • రెడ్ డైమండ్ క్రియేటర్​ అవార్డ్‌‌‌‌ ‌‌‌‌– పది కోట్ల సబ్​స్ర్కిప్షన్​ ఉన్న ఛానెళ్లకి ఈ అవార్డ్​ ఇస్తారు. ఇప్పటివరకూ ఈ అవార్డ్ అందుకున్న ఛానెళ్లు నాలుగే నాలుగు. అవేమిటంటే... బాలీవుడ్​ పాటలకి ఫేమస్​ అయిన ‘టీ–సిరీస్’​, స్వీడన్​ యూట్యూబర్​ ‘ప్యూడైపై’(2019), ఎడ్యుకేషన్​, నర్సరీ రైమ్స్​తో పాపులర్​ అయిన ‘కొకోమెలన్’​ (2020),  సోని ఎంటర్​టైన్​మెంట్​ టెలివిజన్​ ‘సెట్​ ఇండియా’(2021).

సబ్​స్క్రయిబర్స్​ పెరగాలంటే...

యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టి, వీడియోలు పోస్ట్ చేయగానే డబ్బు రాదు. ముందుగా అకౌంట్​ సెట్టింగ్​లో మానిటైజేషన్​ ఆఫ్షన్​ ఎనేబుల్​ చేయాలి. అన్ని ఛానెళ్లకి సబ్​స్ర్కయిబర్స్​ లక్షల్లో ఉండరు. మనీ రావాలంటే యూట్యూబ్​ పార్ట్​నర్​ ప్రోగ్రాంలో చేరాలి. అప్పుడే యాడ్స్​ రూపంలో మనీ వస్తుంది. మంచి కంటెంట్​ ఉన్నా సరే కొన్నిసార్లు వ్యూస్​ రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే...  ముందుగా ఛానెల్​ని సబ్​స్ర్కయిబ్​ చేసుకోవాల్సిందిగా తెలిసిన వాళ్లందరికీ రిక్వెస్ట్​ పెట్టాలి. వీడియోని చూసి షేర్​ చేసేది వాళ్లే. అప్పుడే  సబ్​స్ర్కయిబర్స్​ సంఖ్య పెరుగుతుంది.  ఎక్కువ మందికి రీచ్​ అయ్యే కంటెంట్​ తీసుకోవాలి. ఆన్​లైన్​ కమ్యూనిటీల్లో వీడియోల్ని షేర్​ చేస్తూ ఉండాలి. అట్రాక్ట్​ చేసే థంబ్​నెయిల్స్ వాడాలి. ఛానెల్​ని ప్రమోట్​ చేయడం కోసం  ఛానెల్​ ట్రైలర్​ లేదా టీజర్​ వీడియో క్రియేట్​ చేయాలి. ఇవన్నీ చేస్తే ఛానల్​ పాపులర్​ అవుతుంది.  

యాక్టింగ్,​ డైరెక్షన్​ రెండూ.. 

‘కాలా కాలాల కాడ నాయిదొరో..  ఏటి కాలాల కాడ నాయిదొరో’,  ‘ఓ పిల్లో ఓ జనమ్మ’, ‘మనసు గల్ల మహేష్​’...  ఈ సాంగ్స్​ యూట్యూబ్​లో ఒక సెన్సేషన్. ఈ పాటలు రాసింది పార్వతి మహేష్​. జానపదాల మీద ఇష్టంతో తన పేరుతోనే ‘పీఎం క్రియేషన్ టీవీ’  అనే యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టాడు. ఫోక్​ సాంగ్స్ రాయడమే కాదు చక్కగా యాక్ట్ చేస్తాడు. డైరక్షన్​ కూడా చేస్తాడు. కెమెరాలో పల్లెటూరుని గొప్పగా చూపించగల స్కిల్​ మనోడి సొంతం. ‘నాయిదొరో ’ పాటతో మహేష్​ ఛానెల్​ చాలా ఫేమస్​ అయింది. ఇప్పుడు అతడి ఛానెల్​ సబ్​స్ర్కయిబ్​ చేసుకున్నోళ్ల సంఖ్య రెండు లక్షలు​ దాటింది. 

యూట్యూబ్​ ఛానెల్: PM Creation tv

యూట్యూబ్​లో ఎక్కువమంది చూసే తెలుగు న్యూస్​  ఛానెల్​ V6 . ఈ ఛానెల్​కి ఐదొందల కోట్ల పైగా వ్యూస్​ ఉన్నాయి. అంతేకాకుండా సబ్​స్క్రయిబర్స్​ చేసుకున్నోళ్ల సంఖ్య అరవై లక్షల పైనే. దాంతో, యూట్యూబ్​ ‘గోల్డ్​ క్రియేటర్​ అవార్డ్’ కూడా వచ్చింది. 

యూట్యూబ్​ ఫ్యాక్ట్స్​

  • మొదట్లో యూట్యూబ్​ని డేటింగ్​ సైట్​గా డిజైన్​ చేశారు. 
  • రోజుకి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గంటల సేపు యూట్యూబ్​ వీడియోలు చూస్తున్నారు. ఇది నెట్​ఫ్లిక్స్, ఫేస్​బుక్​ చూసే టైం కంటే చాలా ఎక్కువ.
  • యూట్యూబ్​ చూసేందుకు డెబ్భై శాతం మంది మొబైల్​ ఫోన్​ వాడుతున్నారు. 
  • రోజూ మొబైల్​లో యూట్యూబ్​ వీడియోలు చూసేవాళ్లు వంద కోట్ల పైనే. 
  • ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్​లో నిమిషానికి ఐదొందల గంటల నిడివి ఉన్న వీడియోలు అప్​లోడ్​ అవుతున్నాయి. 
  • ఇప్పటివరకూ యూట్యూబ్​లో ఎక్కువమంది చూసింది ‘డెస్పాసిటో’ అనే మ్యూజిక్​ వీడియోని. ఇదొక లాటిన్​ పాప్​ సాంగ్​.
  • యూట్యూబ్​లో వంద కోట్ల వ్యూస్​ సాధించిన మొదటి వీడియో – గంగ్నమ్​ స్టయిల్​. 
  • జూన్​ 2007లో యూట్యూబ్​ లోకలైజ్డ్​ వెర్షన్​ తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు 98 దేశాలు సొంత యూట్యూబ్​ వెర్షన్​ డెవలప్​ చేసుకున్నాయి.

మన దగ్గర

  •     మనదేశంలో ఎక్కువమంది చూసిన మొదటి వీడియో లాంగ్​ లాచీ (పంజాబీ పాట). ఈ పాటకి  వంద కోట్లకి పైగా వ్యూస్​ ఉన్నాయి. 
  •     యూట్యూబ్​లో కోట్లలో వ్యూస్​ సంపాదిస్తున్న వాటిల్లో కిడ్స్​ రైమ్స్​ ఛానెళ్లే ఎక్కువ. 

 వీళ్లే టాప్​

చాలామందికి యూట్యూబ్ అనేది ఎంటర్​టైన్​మెంట్​. కానీ కంటెంట్​ క్రియేటర్స్​కి మాత్రం వాళ్ల టాలెంట్​ ప్రూవ్​ చేసుకునేందుకు మంచి ప్లాట్​ఫామ్​ అయ్యింది.​ దాంతో జనం మెచ్చే కంటెంట్​ ఇచ్చి టాప్​ యూట్యూబర్స్ అయ్యారు. మనదేశంలోని ఫేమస్​ యూట్యూబర్స్​లో​ కొందరి గురించి...


ఆశిష్​ చంచ్​లానీ

 ఇంజనీరింగ్​ చదివిన అశిష్​ ‘హౌ టు ఎన్నాయ్​ పీపుల్​ వూ సే– తే మేరే బాప్​ కో జాన్తా హై’ అనే వీడియోతో యూట్యూబ్​ సెన్సేషన్ అయ్యాడు. ఇండియా పెళ్లిళ్లు, తోబుట్టువుల మధ్య వచ్చే క్యూట్​ ఫైటింగ్స్, వాళ్ల మధ్య ఉండే అనుబంధానికి సంబంధించిన వీడియోలు చేస్తాడు. ఇతని ‘అశిష్​ చంచ్​లానీ వైన్స్​​’ని రెండుకోట్ల నలభై లక్షల మంది సబ్​స్ర్కయిబ్​ చేసుకున్నారు. 
యూట్యూబ్  ఛానెల్​: Ashish Chanchlani Vines

క్యారీ మినాటి అజయ్​

మనదేశంలో టాప్​ యూట్యూబర్ అయిన​ అజయ్ నాగర్ సొంతూరు హర్యానాలోని ఫరీదాబాద్​​. సొంత పేరు కంటే యూట్యూబ్​ ఛానెల్​ పేరుతోనే బాగా పాపులర్​ అయ్యాడు. ఇతడి యూట్యూబ్​ ఛానెల్​ని రెండు కోట్లతొంభై లక్షల మందిపైనే సబ్​స్ర్కయిబ్​ చేసుకున్నారు. పదేళ్ల వయసులో మొదటి వీడియో పోస్ట్​ చేశాడు. యూట్యూబ్​ కెరీర్​ కోసం మధ్యలోనే చదువు ఆపేశాడు. ఎక్కువగా లైవ్​ గేమింగ్, సెటైరికల్​ పేరడీలు, కామెడీ స్కిట్స్ వీడియోలు పోస్ట్​ చేస్తుంటాడు. యూజర్ల  ఆలోచనల్ని చక్కని కంటెంట్​గా మలిచి వీడియోలు తీయడంలో ఎక్స్​పర్ట్. ఇతడి మరో యూట్యూబ్​ ఛానెల్​ ‘క్యారీస్​ లైవ్​’కి కూడా ఎనభై రెండు లక్షలకు పైగా సబ్​స్ర్కయిబర్స్ ఉన్నారు. 
యూట్యూబ్  ఛానెల్​: Carry Minati

అమిత్​ భదాన

రెండు కోట్ల సబ్​స్ర్కయిబర్స్​ మార్క్​ దాటిన మొదటి ఇండియన్​ యూట్యూబర్​ ఇతను. కమెడియన్​ అయిన అమిత్​ భదాన మధ్య తరగతి ప్రజల రోజూవారీ లైఫ్​కు సంబంధించిన కంటెంట్​ తీసుకుంటాడు. బాలీవుడ్​ స్టార్స్​ అక్షయ్​ కుమార్​, అజయ్​దేవ్​గన్​ వంటి వాళ్లతో కంటెంట్​ క్రియేట్​ చేశాడు. హిందీలో ఇతను చేసే డబ్బింగ్​, ప్రాంక్​ వీడియోలు చాలా ఫేమస్​. కాలేజ్​, యూనివర్సిటీ ఫంక్షన్లలో స్టేజ్​ షోలు కూడా చేస్తాడు. ఇతని ఛానెల్​కి రెండుకోట్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. 
యూట్యూబ్  ఛానెల్​: Amit Bhadana

భువన్ బమ్​

ఇండియన్​ యూట్యూబర్స్​లో హయ్యెస్ట్ పెయిడ్​ కంటెంట్​ మేకర్​ అయిన భువన్​ది ఢిల్లీ​. ఇతడి యూట్యూబ్​ ఛానెల్​ ‘బీబీ కీ వైన్స్​​’కి కోటి ఎనభై లక్షల సబ్​స్ర్కయిబర్స్ ఉన్నారు. భువన్​ అప్​లోడ్​ చేసే క్రియేటివ్​, ఫన్నీ వీడియోలకి లక్షల్లో వ్యూస్​ ఉన్నాయి. మొదట్లో ఢిల్లీలోని బార్​లలో పాటలు పాడేవాడు. తన హ్యూమర్​, సొంత స్టయిల్​తో ఫేమస్​ యూట్యూబర్​ అయ్యాడు.  
యూట్యూబ్  ఛానెల్​: BB Ki Vines

గౌరవ్​ చౌధరీ

ఇతడిని అందరూ ‘టెక్నికల్​ గురూజీ’ అని పిలుస్తారు. అందుకు కారణం గౌరవ్ ఎక్కువగా టెక్నాలజీ వీడియోలు చేస్తాడు.  రాజస్తాన్​లోని అజ్మీర్​కి చెందిన గౌరవ్​ 2015లో ‘టెక్నికల్​ గురూజీ’ ఛానెల్​ మొదలుపెట్టాడు. ఇతడి ఛానెల్​ని ​సబ్​స్ర్కయిబ్​ చేసుకున్నోళ్ల సంఖ్య రెండు కోట్ల పైనే. 
యూట్యూబ్​ ఛానెల్​: 
Technical Guruji

సందీప్​ మహేశ్వరి

మోటివేషనల్​ స్పీకర్​, ఎంట్ర​ప్రెనూర్​ అయిన సందీప్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు.​ ఫ్రీలాన్స్​ ఫొటోగ్రాఫర్​గా కెరీర్​ మొదలుపెట్టి తర్వాత కొన్నాళ్లు ఒక మార్కెటింగ్​ కంపెనీలో పని చేశాడు. డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్​ వీడియోలు చేయడు.  తన వీడియోలతో ఒక లక్ష్యం అంటూ లేని వాళ్లకి జీవితంలో దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యూట్యూబర్​.   
యూట్యూబ్​ ఛానెల్​: Sandeep Maheshwari
 

::: సంతోష్​ బొందుగుల