భూస్వాములు లేరు..బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల వద్దే 95శాతం భూములు

భూస్వాములు లేరు..బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల వద్దే 95శాతం భూములు

 

  • అనుభవదారు ముచ్చట్నే ఉండదు
  • రిజిస్ట్రేషన్​ కాగానే ఆటోలాక్
  • ధరణి వెబ్​సైట్​ ఇంకా రెడీ కాలేదు
  • ఏడాది లోపు భూ సర్వే పూర్తి.. కన్​క్లూజివ్‌ టైటిల్‌ తెస్తం
  • భూసమస్యలపై సలహాలుఇచ్చేందుకు కాల్‌ సెంటర్‌
  • ప్రభుత్వం ఇకపై భూములు పంచబోదు: సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో భూస్వాములెవరూ లేరని.. 98.38 శాతం మంది రైతులకు పదెకరాల్లోపు భూమి ఉందని సీఎం కేసీఆర్​ చెప్పారు. గతంలో ఆరు వేల మంది భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు.. ఇప్పుడు 60.95 లక్షల మంది రైతుల ఆధీనంలోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం 95 శాతం భూములు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వద్దే ఉన్నాయని.. కేవలం ఐదు శాతం భూములే ఇతర కులాల వారి వద్ద ఉన్నాయని తెలిపారు. సోమవారం శాసన మండలిలో కొత్త రెవెన్యూ యాక్ట్‌‌పై చర్చకు సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పారు. బడా భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు.. కౌలుదారుల రక్షణ కోసం రికార్డుల్లో అనుభవదారు కాలమ్‌‌ పెట్టారన్నారు. ‘‘ఇప్పుడు బంగ్లాస్వామి.. కారుస్వామి.. భూస్వామి.. అంటూ ఎవరూ లేరు. గుంట భూమి ఉన్నోళ్లు కూడా భూస్వాములే.. వాళ్లు కాక ఇంకా చాలామంది స్వాములు ఉన్నరు. వాళ్ల కత ఏందో మనకు తెలుసు. అనుభవదారు కాలమ్‌‌తో కొందరు గద్దల్లా భూములు తన్నుకుపోతున్నరు. ఇష్టమొచ్చినట్టు ఇంజెంక్షన్‌‌ ఆర్డర్లు తెస్తే చిన్న రైతులు ఎటు పోవాలే.. భూమి ఉన్నందుకే వాళ్లు శాపగ్రస్తులు కావాల్నా, ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారులు.. భూ ప్రాపర్టీకే ఎందుకు’’ అని పేర్కొన్నారు. ప్రతి రైతును రక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తమ పార్టీ విధానం కూడా అదేనని చెప్పారు.

కొత్త చట్టం, ధరణి పోర్టల్‌‌‌‌తో పది నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం కేసీఆర్​ చెప్పారు. రిజిస్ట్రేషన్‌‌‌‌ ఆఫీసుల్లో ఇంతకుముందులా అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. తహసీల్దార్లు, సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం కల్పించలేదని.. పోర్టల్‌‌‌‌లో రికార్డులను మార్చే అధికారం ఎవరికీ లేదని వివరించారు. ధరణి పోర్టల్‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ కాగానే మ్యూటేషన్‌‌‌‌, అప్‌‌‌‌డేషన్‌‌‌‌ కాపీలు వస్తాయన్నారు. బయోమెట్రిక్‌‌‌‌, ఐరిస్‌‌‌‌, ఆధార్‌‌‌‌, ఫొటోతో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తారని, ఈ వివరాల్లేకుండా తహసీల్దార్లు కూడా పోర్టల్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసే చాన్స్​ ఉండదని చెప్పారు. కొత్త చట్టంతో రైతులు, ప్రజలు లంచాలు ఇచ్చే బాధ తప్పుతుందని తెలిపారు.

కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ తెస్తం

సమగ్ర భూసర్వేతో భూసంబంధ సమస్యలన్నింటికీ ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పడుతుందని కేసీఆర్​ అన్నారు. ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేయబోతున్నామన్నారు. భూసర్వే పూర్తి ట్రాన్స్​పరెంట్​గా ఉంటుందని, అతి తక్కువ సమయంలోనే సర్వే పూర్తి చేసే ఆస్కారముందని వివరించారు. గరిష్టంగా ఏడాదిలోపు భూసర్వే ప్రక్రియ పూర్తవుతుందని.. ఒక్కో జిల్లాలో ఒక్కో ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి సర్వే చేయిస్తామని తెలిపారు. సమగ్ర సర్వే పూర్తి చేసి రైతులకు కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఇవ్వాలనేదే ప్రభుత్వ ప్రయత్నమన్నారు. కన్‌‌‌‌క్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఇస్తే భూమిపై ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని, ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వమే సంబంధిత రైతుకు పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.

సేకరించిన భూములకు రైతుబంధు ఇచ్చి ఉండొచ్చు

ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములకు రైతుబంధు ఇచ్చి ఉండొచ్చని, సమగ్ర సర్వేతో అలాంటివి సరి చేస్తామని కేసీఆర్​ తెలిపారు. కేవలం అలాంటి వాటి కోసం బిల్లును సెలక్ట్‌‌‌‌ కమిటీకి, హౌస్‌‌‌‌ కమిటీకి పంపాలని కోరడం సరికాదన్నారు. హౌస్‌‌‌‌ కమిటీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆదేశిస్తుందని తెలిపారు. తాను గతంలో ఎన్నో హౌస్‌‌‌‌ కమిటీల్లో మెంబర్‌‌‌‌గా ఉన్నానని, అప్పుడు సాధించిందేమీ లేదని చెప్పారు.

ధరణి ఇంకా అందుబాటులోకి రాలే..

రాష్ట్రంలో 60 లక్షల 95 వేల 134 మంది పట్టాదారులకు చెందిన కోటీ 50 లక్షల 12 వేల 603 ఎకరాల భూములు ఆటోమేటిగ్గా ధరణి పోర్టల్‌‌‌‌లోకి వచ్చేస్తాయని కేసీఆర్​ చెప్పారు. ఆ రైతులకు ప్రభుత్వం రైతు బంధు ఇస్తోందని, ఆ భూముల్లో పెద్దగా చికాకులేమీ లేవని తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాం కాబట్టే రైతుబంధు ఇవ్వగలిగామని, ఇప్పుడు సర్వేకు పోవడానికి అదే కారణమని చెప్పారు. ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే సమగ్ర సర్వేలో బయటపడతాయన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ కంఠం భూములు, ఇతర ఆస్తులు 89.46 లక్షలు ఉన్నాయని, అవి సైతం ధరణి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లోకి వచ్చేస్తాయని తెలిపారు. చాలా మంది నిపుణులతో మాట్లాడాకే కొత్త చట్టం రూపొందించామన్నారు. ధరణి వెబ్​సైట్ అందుబాటులోకి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ పోర్టల్‌‌‌‌ ఇంకా రెడీకాలేదని కేసీఆర్​ తెలిపారు. ఒకసారి ధరణి అందుబాటులోకి వచ్చాక భూరికార్డుల్లో ఎలాంటి గందరగోళం ఉండదని, అన్ని వివరాలు పబ్లిక్‌‌‌‌ డొమైన్‌‌‌‌లోకి వస్తాయన్నారు.

సర్వేతోనే పరిష్కారం

గ్రామాల్లోని భూముల్లో 99 శాతం క్లియర్‌‌‌‌గా ఉన్నాయని, కేవలం ఒక్క శాతమే వివాదాస్పదంగా ఉన్నాయని కేసీఆర్​ తెలిపారు. వాటిని పక్కనపెట్టి క్లియర్‌‌‌‌గా ఉన్నవి ముందు పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్‌‌‌‌లో ఏవైనా సమస్యలు వస్తాయనుకుంటే.. కలెక్టర్ల స్థాయిలో ఎవరికైనా అధికారం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

ఫ్రీడం ఫైటర్ల పేరుతో దందా

రాష్ట్రంలో ఫ్రీడం ఫైటర్ల పేరుతో మీద దందాలు జరిగాయని కేసీఆర్​ అన్నారు. వాళ్లు ఎక్కడున్నరో, ఏమోగానీ.. నిజమైన వారు ఉంటే వారి భూములు రక్షిస్తామన్నారు. వక్ఫ్‌‌‌‌, దేవాదాయ భూములను ఇప్పటికే ఆటో లాక్‌‌‌‌ చేశామని.. సర్వే పూర్తయ్యే వరకు ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు కావని చెప్పారు. క్రిస్టియన్ల భూములకు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్నారు. వక్ఫ్‌‌‌‌, ఎండోమెంట్‌‌‌‌ భూములకు చట్టాలు, పద్ధతులు ఉన్నాయన్నరు. క్రిస్టియన్‌‌‌‌ మత పెద్దలందరూ మాట్లాడుకొని వక్ఫ్‌‌‌‌ బోర్డు తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలని కోరితే పరిశీలిస్తామన్నారు.

ఒకసారి రిజిస్ట్రేషన్‌‌‌‌ అయితే ఆటోలాక్‌‌‌‌

వ్యవసాయేతర భూములను ఇష్టారాజ్యంగా అమ్మి అమాయకులను మోసం చేస్తున్నారని, దానికి చెక్‌‌‌‌ పెట్టేందుకే ఆ భూములకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నామని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఒకసారి ఒకరి పేరుతో భూమి రిజిస్ట్రేషన్‌‌‌‌ అయితే ఆటోలాక్‌‌‌‌ అవుతుందని, మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయడానికి ప్రయత్నిస్తే కంప్యూటరే తీసుకోదని, అట్లాంటి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ తయారు చేస్తున్నామని చెప్పారు. తాను ఉద్యమం నడుపుతున్న టైంలో మియాపూర్‌‌‌‌లో భూములుకొన్న చిరుద్యోగులు ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారన్నారు.

భూమి రేటుతోపాటే మాఫియా పెరిగింది

తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కొందరు విష ప్రచారం చేశారని కేసీఆర్​ గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఎకరం రూ.10 లక్షలకు తక్కువ లేదన్నారు. రోడ్ల పక్కన రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు, హైవేల పక్కన రెండు మూడు కోట్ల దాకా రేటు ఉందని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌ చుట్టుపక్కల భూముల ధరలు కోట్లకు చేరాయని, కొత్త జిల్లా కేంద్రాల్లోనూ భారీగా పెరిగాయన్నారు. భూముల రేట్లతోపాటు ల్యాండ్‌‌‌‌ మాఫియా, నకిలీ స్టాంప్‌‌‌‌ పేపర్లు, లిటిగేషన్లు పెరిగాయని, వాటి నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే కొత్త చట్టం తెచ్చామని చెప్పారు. సీఎం సమాధానం అనంతరం మండలి కొత్త రెవెన్యూ యాక్ట్‌‌‌‌, వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు, మున్సిపల్‌‌‌‌, పంచాయతీ రాజ్‌‌‌‌ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.

అసెంబ్లీ రద్దుకు ముందే తేవాలనుకున్నం

గతంలో రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలతోపాటు వీఆర్వో వ్యవస్థ రద్దు చేశాకే ఎన్నికలకు పోవాలని అనుకున్నామని సీఎం చెప్పారు. అప్పటికే అసెంబ్లీ రద్దు కావడంతో ఆగిపోయిందని, ఇప్పుడు ముందు కు తెచ్చామన్నారు. ఈ బిల్లు రూపొందించడానికి మూడేండ్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఒకప్పుడు భూమి శిస్తు ఉండేది కాబట్టి వీఆర్వోలతో పని ఉండేదని.. ఎన్టీఆర్​ హయాంలోనే భూమి శిస్తు రద్దు చేశారని, తమ సర్కారు అయితే రైతులకు ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తోందని.. ఇలాంటప్పుడు వీఆర్వోలతో అవసరం ఏముందని ప్రశ్నించారు. వీఆర్వోలు చాలా దుర్మార్గాలు చేశారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరి భూమినో ఇంకెవరికో రాసి ఇచ్చారని విమర్శించారు. అందుకే ఆ వ్యవస్థను రద్దు చేశామన్నారు. మొత్తం రికార్డులన్నీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అయిన తర్వాత పెద్దగా వివాదాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ఎవరికైనా సంతృప్తి ఉండకపోతే కోర్టులకు పోవచ్చన్నారు.

అసైన్డ్​ భూములు కొన్న రైతులపై సానుభూతి చూపిస్తం

అసైన్డ్‌‌ భూములు కొన్న పేద రైతులకు హక్కులు కల్పించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాంటి భూములు కొన్నవారిపై ఇప్పటివరకు పీవోటీ కేసులు పెడుతున్నాం. వారిపై సానుభూతితో పరిష్కారానికి కృషి చేస్తాం.

పాస్​బుక్కులు తీసుకోవద్దని బ్యాంకులకు చెప్తం

రైతుల భూముల ఈసీ వివరాలను ధరణిలో నమోదు చేస్తాం. రిజర్వు బ్యాంకు రూల్స్​ ప్రకారం బ్యాంకులు క్రాప్‌‌ లోన్ల కోసం పాస్‌‌బుక్‌‌లు పెట్టుకోవద్దు. టర్మ్‌‌ లోన్లకు మాత్రమే మార్టిగేజ్‌‌ చేసుకోవాలి. బ్యాంకర్లతో నేను సమావేశం పెట్టి దీనిపై స్పష్టమైన ఆదేశాలిస్తాం.

ఎన్నారైల భూములకు రక్షణ

ధరణి పోర్టల్‌‌లో ల్యాండ్‌‌ రికార్డులు చేర్చడానికి ఎన్నారైలకు ఆధార్‌‌ కార్డుకు బదులు పాస్‌‌ పోర్ట్‌‌ లేదా ఇంకేదైనా గుర్తింపుకార్డును పరిగణనలోకి తీసుకోవాలన్న సూచనను పరిశీలిస్తాం. ఎన్నారైల భూములకు రక్షణ కల్పిస్తాం. అవసరమైన మెకానిజం తెస్తాం.

ఇకపై భూములు పంచం

ఇకపై ప్రభుత్వం భూములు పంచేది లేదని కేసీఆర్​ మరోసారి తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ హయాంలో పదెకరాలు భూమి ఉంటే వంద మందికి సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు.