
తెలంగాణలోని పట్టణాలు, గ్రామాలలో క్రికెట్ ఆడాలనే కలతో పెరుగుతున్న యువకుడికి, ఒక ప్రాథమిక ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది. రాష్ట్రంలో ఆటకు సంరక్షకుడిగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. క్రీడాపరంగా వారికి సహాయపడటానికి ఏ మార్గాన్ని సృష్టించింది? క్రికెట్ పట్ల దశాబ్దాలుగా ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నప్పటికీ, యువ ఆశావహులు తెలంగాణ జిల్లాల్లోని దుమ్ముతో నిండిన మైదానాలు, ఇరుకైన సందులలో చిక్కుకుపోయారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, నిర్మాణాత్మక కోచింగ్ కార్యక్రమాలు లేకపోవడం, పోటీ క్రికెట్ క్రమం తప్పకుండా లేకపోవడంతో, జిల్లా ఆటగాళ్ళు హైదరాబాద్ నగరంలోని తమ సహచరుల తో సమానంగా నైపుణ్యాలు, అవకాశాలు లేదా వనరులను పొందలేకపోతున్నారు. పరిస్థితి చాలా దిగులుగా ఉంది. క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఒక్క టర్ఫ్ గ్రౌండ్ కూడా లేదు.
ఆ టను వృత్తిగా పరిగణించాలనుకునేవారు ఇల్లు వదిలి, హైదరాబాద్‌కు వలస వెళ్లి ప్రైవేట్ అకాడమీలలో భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది. - ఇది చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో లేని ఎంపిక. గత 50 సంవత్సరాలలో పురుషులు, మహిళల విభాగాలలో కలిపి అన్ని జిల్లాల నుంచి పది కంటే తక్కువ మంది ఆటగాళ్ళు బీసీసీఐ టోర్నమెంట్‌లో హెచ్‌సీఐకి ప్రాతినిధ్యం వహించారు. పది పూర్వ జిల్లాలు మారి ఇప్పుడు 33 పరిపాలనా జిల్లాలు ఉన్న రాష్ట్రానికి ఆ సంఖ్య నిరాశపరచడమే కాదు, ఇది సిగ్గుచేటు. డబ్బు ఎక్కడికి పోతోంది?
హెచ్‌సీఏ నిర్లక్ష్యం
ప్రతి సంవత్సరం బీసీసీఐ ప్రతి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి గణనీయమైన నిధులను కేటాయిస్తోంది. కానీ, తెలంగాణ విషయానికి వస్తే ప్రయోజనాలు హైదరాబాద్ దాటి ఎప్పుడూ రావు. తెలంగాణ జనాభాలో దాదాపు 70% మంది హైదరాబాద్ వెలుపల నివసిస్తున్నప్పటికీ, ఈ నిధులలో 5% కంటే తక్కువ మాత్రమే జిల్లా క్రికెట్ కోసం ఖర్చు చేస్తారు. హెచ్‌సీఐ వార్షిక సర్వసభ్య సమావేశాలలో పదేపదే తీర్మానాలు చేసి- 25% నిధులను జిల్లా మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించడం అనంతరం - నిర్మొహమాటంగా విస్మరించటం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ నిర్లక్ష్యం బీసీసీఐ, హెచ్‌సీఐ రెండింటి ఉప-చట్టాలను, అలాగే సంవత్సరాలుగా బీసీసీఐ, కోర్టుల నుంచి వచ్చిన అనేక ఆదేశాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడం. హెచ్‌సీఐ వ్యవహారాల నిర్వహణలో కూడా అసమతుల్యత ఉంది. హెచ్‌సీఐ ఓటింగ్ సభ్యత్వంలో జిల్లా సంఘాలు కేవలం 4% మాత్రమే ఉన్నాయి, అయితే, నగర క్లబ్‌లు మిగిలిన 96%ని నియంత్రిస్తాయి. ఈ రోజువరకు హెచ్‌సీఐ పాలక సంస్థ అయిన అపెక్స్ కౌన్సిల్‌కు ఒక్క జిల్లా ప్రతినిధి కూడా ఎన్నిక కాలేదు.
జిల్లా క్రికెట్ సంఘాలకు ప్రాధాన్యమివ్వాలి
జిల్లా క్రికెట్ సంఘాల నుంచి పదేపదే ప్రతిపాదనలు, రిప్రజెంటేషన్స్ ఉన్నప్పటికీ, వారికి అత్యంత ప్రాథమిక పరిపాలనా మద్దతు, కోచింగ్, ఆట సౌకర్యాలు కూడా నిరంతరం నిరాకరించడం జరుగుతోంది. ఫలితంగా హెచ్‌సీఐ గుండె హైదరాబాద్ నగర పరిమితుల్లోనే కొట్టుకుంటోంది. హెచ్‌సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వనరుల కొరత కాదు. 2010, 2011లో అసోసియేషన్ నిజామాబాద్‌లో 5.5 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఆ భూములు బంజరుగా ఉపయోగించకుండా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే మహబూబ్‌నగర్‌లో టర్ఫ్ వికెట్లను సిద్ధం చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. ఈ రెండు ప్లాట్‌లకు మించి క్రికెట్‌ను ప్రోత్సహించడానికి హెచ్‌సీఐ మరే ఇతర జిల్లాల్లోనూ ఒక్క మైదానాన్ని కలిగి లేదు లేదా లీజుకు తీసుకోలేదు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే.. ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, చిన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. వారు టర్ఫ్ వికెట్లను నిర్మించారు, అకాడమీలను స్థాపించారు. గ్రామీణ ప్రతిభను నేరుగా రాష్ట్ర జట్లలోకి తీసుకువచ్చే బలమైన ఫీడర్ వ్యవస్థలను సృష్టించారు. విషాదం ఏమిటంటే.. తెలంగాణకు హైదరాబాద్ నగర పరిమితులకు మించి చూపించడానికి ఏమీ లేదు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ఈ అసమతుల్యత కొనసాగడానికి వీల్లేదు.
తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం.
1. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. అకాడమీలకు ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలి. ప్రాక్టీస్ చేయడానికి నెట్లను ఏర్పాటు చేయాలి. టోర్నమెంట్‌లను ఆడటానికి ప్రతి జిల్లాలో భూమిని కొనుగోలు చేయాలి. లేదా లీజుకు తీసుకోవాలి.
2. లీగ్ నిర్మాణాన్ని సమగ్రపరచి, జిల్లా జట్లను హెచ్‌సీఐ లీగ్‌లలో విలీనం చేయాలి. గ్రామీణ ఆటగాళ్లకు పోటీ క్రికెట్‌కు అవకాశం కల్పించడానికి ప్రస్తుత లీగ్ ఫార్మాట్‌ను పునర్నిర్మించాలి.
3. రెగ్యులర్ డిస్ట్రిక్ట్ -లెవల్ లీగ్‌లను నిర్వహించాలి. సీనియర్, అండర్– 23, అండర్–19, అండర్–16, అండర్–14 - వయసులవారీగా పురుషులు, మహిళలకు టోర్నమెంట్‌లను ఏటా జిల్లాలలో నిర్వహించాలి. ఉత్తమ జిల్లా ప్రతిభ రాష్ట్ర స్థాయికి చేరుకునేలా వీటిని హెచ్‌సీఐ లీగ్‌లకు ముందే పూర్తి చేయాలి.
4. కోచింగ్ అకాడమీలను ఏర్పాటు చేయాలి. హెచ్‌సీఐ అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో అర్హత కలిగిన కోచ్‌లతో సొంత అకాడమీలను ఏర్పాటు చేయాలి. బాల బాలికలకు ఏడాది పొడవునా శిబిరాలను ఏర్పాటుచేసి. టాలెంట్ హంట్ నిర్వహించి వారికి హెచ్సీఐలో కఠినమైన సమగ్ర శిక్షణ అందించాలి.
5. రాష్ట్రంకోసం షార్ట్‌లిస్ట్ చేసే ఆటగాళ్లలో కనీసం 50% మంది జిల్లాల నుంచి రావాలి. సమతుల్యత, అవకాశాన్ని నిర్ధారించడానికి ఇదే ఏకైక మార్గం.
6. జిల్లా క్రికెట్ కోసం నిధులు కేటాయించాలి. జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాలకు 25% కేటాయింపు ఏజీఎం తీర్మానాన్ని ఎటువంటి సాకులు లేకుండా అమలు చేయాలి.
7. హెచ్‌సీఐ పాలనాపరమైన కీలక నిర్ణయం తీసుకోవడంలో మొత్తం 31 జిల్లాలకు (హైదరాబాద్, రంగారెడ్డి మినహా) ఓటింగ్ హక్కులతో పూర్తి అనుబంధం ఇవ్వాలి.
8. రాష్ట్ర ప్రాతినిధ్యం: బీసీసీఐ, ఇతర టోర్నమెంట్లలో హెచ్సీఐకు ప్రాతినిధ్యం వహించే జట్లు కేవలం ‘హెచ్‌సీఐ జట్టు’ లేదా ‘హైదరాబాద్ జట్టు’ పేరుతో కాకుండా ‘తెలంగాణ జట్టు’ పేరుతో ఆడాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ ఇంకా ప్రారంభం కాలేదనేది వాస్తవం. గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడం, సమాన స్థాయిని సృష్టించడం అనే విధిలో హెచ్‌సీఐ విఫలమైంది. తెలంగాణ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించే సంస్థగా తనను తాను పిలుచుకోవాలనుకుంటే, హెచ్‌సీఐ తన మాటలకు చర్యలు, ఉద్దేశం, జవాబుదారీతనంతో మద్దతు ఇవ్వాలి.
ఈ ఆటను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రత్యేక హక్కుగా మాత్రమే ఉండనివ్వకూడదు. ఇది కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు కూడా సమానంగా చెందాలి. వేలాది మంది పిల్లలు ఏదోక రోజు తాముకూడా రాష్ట్ర, జాతీయ జట్టులకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటారు. అది నెరవేరితే తెలంగాణ క్రికెట్ దశాబ్దాల నిర్లక్ష్యం నుంచి బయటపడి దాని పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది.
- వి. అగం రావు,
కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు