ఈ వైరస్ లకు వ్యాక్సిన్లు లేవ్​..

ఈ వైరస్ లకు వ్యాక్సిన్లు లేవ్​..

‘నాలుగైదు నెలల్లోనే వ్యాక్సిన్​ తెచ్చేస్తాం. కరోనా పనిపడతాం’.. ఓ యూనివర్సిటీ హామీ.

‘అంత తొందరగానా? కష్టం. ఏడాదిన్నర పడతది’ ..కొందరు సైంటిస్టుల స్టేట్​మెంట్​.

‘జంతువులపై సక్సెస్​ అయింది. మేం దాన్ని తయారు చేసేస్తాం. సెప్టెంబర్​ నాటికి మార్కెట్లో విడుదల చేస్తాం’ .. ఓ కంపెనీ హామీ.

…ఏదైతేనేం.. అందరి నోట వినిపిస్తున్న మాట వ్యాక్సిన్​. ఆ మాటలు ఎలా ఉన్నా కరోనా వైరస్​ పనిపట్టేందుకు ప్రపంచంలోని సైంటిస్టులు వ్యాక్సిన్​ కోసం రాత్రి, పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నరు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొన్ని ప్రాణాంతక వైరస్​లకు వ్యాక్సిన్లే రాలేదు. అలాగని వాటి మీద ట్రయల్స్​ జరగట్లేవా అంటే.. జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కటీ ఎఫెక్ట్​ చూపించట్లేదు. మరి, వ్యాక్సిన్​ లేని ఆ వైరస్​లేంటి? వ్యాక్సిన్లు లేవు సరే.. మరి, వాటి పనిపట్టడానికి ఉన్న వేరే దార్లేంటి?.. ఓ లుక్కేద్దాం.

ఎక్కువ స్ట్రెయిన్లు, మ్యుటేషన్ల వల్లే..

వ్యాక్సిన్లు లేని వైరస్​లు చాలానే ఉన్నాయి. ముఖ్యమైంది హెచ్​ఐవీ. చికున్​గున్యా, డెంగ్యూ, సైటోమెగాలోవైరస్​, రెస్పిరేటరీ సిన్సైటియల్​ వైరస్​, షిస్టోసోమియాసిస్​, సార్స్​, మెర్స్​, అడినోవైరస్​, రైనోవైరస్​ వంటి వాటికి ఇప్పటిదాకా వ్యాక్సిన్లు కనిపెట్టలేదు. అందులో కొన్నింటికీ వ్యాక్సిన్లు కనిపెట్టినా వాటికి ఇప్పటిదాకా లైసెన్స్​ అన్నది లేదు. వైరస్​లు రూపు మార్చుకోవడం, కొన్ని వైరస్​లలో స్ట్రెయిన్లు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో వ్యాక్సిన్​ అభివృద్ధి, తయారీ అన్నది కష్టంగా మారుతోంది. కొన్నింటికీ కనిపెట్టినా ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి.

హెచ్​ఐవీ

అత్యంత ప్రమాదకరమైన వైరస్​ హెచ్​ఐవీ (హ్యూమన్​ ఇమ్యునోవైరస్​). ఇమ్యూనిటీపై దెబ్బ కొట్టే ఈ వైరస్​కు ఇప్పటిదాకా వ్యాక్సిన్​ను కనిపెట్టలేదు. అది ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవడమే కారణం. ఇప్పటిదాకా కొన్ని వ్యాక్సిన్​ క్యాండిడేట్లను ట్రై చేసినా అవి ప్రభావం చూపించలేకపోయాయి. అయితే ఎయిడ్స్ ప్రభావాన్ని తగ్గించే మందులు మాత్రం మార్కెట్​లో ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆఫ్రికా కోతుల్లో పుట్టిందని సైంటిస్టులు చెబుతుంటారు. తొలిసారి మనిషికి సోకింది మాత్రం 1959లోనే. కాంగోకు చెందిన ఓ వ్యక్తి దానికి ఇన్​ఫెక్ట్​ అయ్యాడు. అయితే క్లినికల్​గా తొలిసారి 1981లో అమెరికాలో గుర్తించారు. అప్పటి నుంచి ఎన్నెన్నో వ్యాక్సిన్లపై ట్రయల్స్​ జరుగుతున్నా వాటి ఎఫెక్ట్​ అంతంతే. సీడీ4 టీ సెల్స్​, డెండ్రైటిక్​ సెల్స్​ ఆధారంగా వ్యాక్సిన్ల తయారీపై సైంటిస్టులు దృష్టి పెట్టారు. 3.2 కోట్ల మందికిపైగా దాని బారిన పడి చనిపోయినట్టు అంచనా.

చికున్ ​గున్యా

కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధించే చికున్​గున్యాకు వ్యాక్సిన్​ లేదు. దీనికి వ్యాక్సిన్ల కోసం ఎప్పటి నుచో సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నెన్నో క్యాండిడేట్లను తయారు చేశారుగానీ ఏవీ ఎఫెక్ట్​గా పనిచేయలేదు. తొలిసారి 1960లో దాని ప్రభావం మొదలయ్యాక వ్యాక్సిన్‌‌పై సైంటిస్టులు దృష్టి పెట్టారు. వ్యాక్సిన్​ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే రెండు వ్యాక్సిన్​ క్యాండిడేట్లు ట్రయల్స్​ దశకు వచ్చాయి. ఈ2 ప్రొటీన్​ బేస్డ్​ వ్యాక్సిన్​, ఇనాక్టివ్​ వ్యాక్సిన్​. ఏటా దీని వల్ల ఎఫెక్ట్​ అయ్యే వారి సంఖ్య తక్కువే.

సైటో మెగాలో వైరస్​ (సీఎంవీ)

ఇదీ ఇమ్యూన్​ సిస్టమ్​పై దాడి చేసే వైరస్సే. ఒక్కసారి బాడీలోకి ఎంటరైతే జీవితాంతం పోదు. ఆ వైరస్​ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆరోగ్యవంతులపై ఎఫెక్ట్​ ఉండదు. కానీ, వేరే జబ్బులున్నోళ్లు, గర్భిణులకు మాత్రం డేంజరే. దీని వల్ల కండరాల నొప్పులు, నరాల వీక్​నెస్​, కంటిచూపు పోవడం, వినికిడి లోపం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో గుండెకూ ముప్పు తెస్తుంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్​ లేదు. కొన్నింటిపై ట్రయల్స్​ నడుస్తున్నాయి. జీబీ సబ్​యూనట్​ సీఎంవీ వ్యాక్సిన్​, సీఎంవీ డీఆక్సీరైబోన్యూక్లియిక్​యాసిడ్​ డీఎన్​ఏ వ్యాక్సిన్​ ఏఎస్​పీ0113, వీబీఐ, సీఎంబీ ఎంవీఏ వంటి వ్యాక్సిన్​ క్యాండిడేట్లు ట్రయల్స్​ దశలో ఉన్నాయి.

వ్యాక్సిన్​ అంటే..

బయటి నుంచి ఏదైనా బ్యాక్టీరియాగానీ, వైరస్​గానీ ఒంట్లోకి ఎంటరైనప్పుడు వాటిపై దాడి చేసేందుకు రక్తంలో యాంటీ బాడీలు తయారవుతాయి. తెల్లరక్తకణాల్లోని బీ సెల్స్​ వాటిని పుట్టిస్తాయి. కొన్ని మైక్రోబ్స్​ (సూక్ష్మజీవులు)కు సహజంగానే మన ఒంట్లో యాంటీ బాడీలు తయారవుతాయి. కొన్నింటికి తయారు కావు. శరీరంలోకి ఎంటరైన ఆ శత్రువులను మన ఇమ్యూన్​ సిస్టమ్​ గుర్తించలేకపోవడమే కారణం. అలాంటి సందర్భంలో ఇమ్యూన్​సిస్టమ్​ను యాక్టివేట్​ చేసేవే ఈ వ్యాక్సిన్లు. బలహీన లేదా చచ్చిన మైక్రోబ్​కు రూపమే ఈ మందు. మన ఒంట్లోకి ఎక్కించినప్పుడు ఇమ్యూన్​ సిస్టమ్​ యాక్టివేట్​ అయి యాంటీ బాడీలు పుడతాయి.

డెంగ్యూ

ప్రాణాంతక వైరస్​లలో డెంగ్యూ ఒకటి. దోమ కుట్టడం వల్ల ఒంట్లోకి వచ్చే ఈ వైరస్​తో ప్లేట్​లెట్లు పడిపోతాయి. ప్లేట్​లెట్లు ఎక్కించకపోతే అది ప్రాణాంతకమవుతుంది. దీనికి వ్యాక్సిన్​ ఉన్నా, అందరికీ దాన్ని ఇవ్వరు. సీవైడీటీడీవీ అనే వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను డెంగ్​వ్యాక్సియా పేరిట ఓ కంపెనీ అమ్ముతోంది. అయితే ఒక్కసారి కూడా డెంగ్యూ సోకని వాళ్లకు ఈ వ్యాక్సిన్​ను ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ప్రాణాలు పోయే ముప్పు ఉంటుంది. 19 దేశాల్లోనే ఆ వ్యాక్సిన్​ అందుబాటులో ఉంది. కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్స్​ దశలో ఉన్నాయి.

రైనో వైరస్​

మామూలు జలుబుకు కారణమవుతుంది ఈ రైనోవైరస్​. వీటిలో 160 రకాల వైరస్​లున్నట్టు అంచనా. చలికాలం, వర్షాకాలంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్​ లేదు. మనిషికి దాదాపు 99 రకాల రైనోవైరస్​లతో ఇన్​ఫెక్షన్​ వస్తుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ స్ట్రెయిన్లన్నింటికీ వ్యాక్సిన్​ అంటే అయ్యే పని కాదంటున్నారు. ఇటీవల వీపీ4 అనే ప్రొటీన్​ బేస్డ్​ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను గుర్తించారు. ఎలుకలపై చేసిన స్టడీ మంచి ఫలితాలనిచ్చింది. మనుషులపై ట్రయల్స్​ చేయాల్సి ఉంది.

రెస్పిరేటరీ సిన్షియల్​ వైరస్​ (ఆర్​ఎస్​వీ)

శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపించే ఈ వైరస్​కూ వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. జలుబు వంటి లక్షణాలతో ఇది ఎఫెక్ట్​ చూపిస్తుంది. మామూలుగా అంత డేంజర్​ కాకున్నా, చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రాణాంతకంగా మారే ముప్పు ఉంటుంది. డీఎస్​సీఏవీ1 అనే క్యాండిడేట్​పై అమెరికాలో ట్రయల్స్​ నడుస్తున్నాయి. ఏటా దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షా 20 వేల మంది దాకా చనిపోతున్నారు.

సార్స్​

సివియర్​ అక్యూట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​ (సార్స్) 2003లో చైనాలో పుట్టింది. శ్వాస వ్యవస్థను ఎఫెక్ట్​ చేస్తుంది. న్యుమోనియాకు కారణమవుతుంది. ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. 26 దేశాల్లో దాని ప్రభావం చూపింది. ప్రస్తుతానికి మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్సే దీనికి మందు.

మెర్స్​

మిడిల్​ ఈస్ట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​(మెర్స్) 2012లో ఒంటెల నుంచి సౌదీ అరేబియాలో పుట్టింది. 2015లో సౌత్​కొరియాకూ పాకింది. ఇదీ సార్స్​ ఫ్యామిలీకి చెందిన వైరస్సే. దీనికీ ఎలాంటి ట్రీట్​మెంట్ లేదు. సార్స్​ లాగానే మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్సే మందు.