డీఎస్సీకి మందకొడిగా అప్లికేషన్లు

డీఎస్సీకి మందకొడిగా అప్లికేషన్లు
  • డీఎస్సీకి మందకొడిగా అప్లికేషన్లు
  • పదిరోజుల్లో వచ్చినవి 16,399 మాత్రమే 

హైదరాబాద్, వెలుగు : టీచర్ ​పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జారీచేసిన డీఎస్సీకి దరఖాస్తులు పెద్దగా రావడం లేదు. అప్లికేషన్ ​ప్రాసెస్ ​మొదలై పది రోజులైనా ఇప్పటి వరకు 16,399 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చేనెల 21వ తేదీ దాకా అప్లై చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై10 రోజులు అవుతున్నా శుక్రవారం సాయంత్రం వరకు16,399 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. రోజూ1,500 నుంచి -2 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. 

టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత అప్లై చేసే వారి సంఖ్య పెరుగుతుందని ఆఫీసర్లు భావించినా, అది కనిపించడం లేదు. అయితే, తక్కువ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్​వేయడంతో పాటు టెట్​లో క్వాలిఫై అయిన వారి సంఖ్య భారీగా తగ్గడం అప్లికేషన్లు రాకపోవడానికి కారణంగా కనిపిస్తున్నది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ పోస్టులే ఉంటే, పలు జిల్లాల్లో సామాజిక కేటగిరీలో పోస్టులే లేవు. అందుకే డీఎస్సీ రాసేందుకు అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉండటం, డీఎస్సీ దరఖాస్తు ఫీజు కూడా రూ.1000 ఉండటంతో డీఎస్సీ కోసం సీరియస్​గా ప్రిపేర్ అయ్యేవారే దరఖాస్తు చేస్తున్నారు.