ఉద్రిక్తత వేళ..‘సోషల్​’ ఉన్మాదం!

ఉద్రిక్తత వేళ..‘సోషల్​’ ఉన్మాదం!

నలుగురు టెర్రరిస్టులు.. ఇరవయ్యారు అమాయక ప్రాణాలు.. చంపింది ముస్లింలు.. వారికి సాయం చేసింది ముస్లింలు.. ఆపద నుంచి అనేకమందిని కాపాడినోళ్లూ ముస్లింలే! ఒకప్పుడు సైన్యం మీదకు రాళ్లు  విసురుతూ  పాకిస్తాన్ జిందాబాద్ అన్న కాశ్మీరీ ముస్లింలే ఇప్పుడు ర్యాలీలు తీస్తూ పాకిస్తాన్ ముర్దాబాద్ అని కూడా అంటున్నరు! కానీ మొదట పహల్గాం నరమేధం, ఆ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సిందూర్​తో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక వర్గాలుగా చీలిపోయిన్రు. 

లెఫ్టిస్టులు, రైటిస్టులు, సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు, మతోన్మాదులు, కులోన్మాదులు, ఆ పార్టీ వాళ్లు, ఈ పార్టీ వాళ్లు అంటూ.. మాటల యుద్ధంతో మానసిక దాడులు చేసుకుంటున్నరు. దాయాది దేశంతో ఉద్రిక్తతల వేళ.. కులం, మతం, పార్టీ ఏదైనా కానీ.. దేశంలోని 140 కోట్ల మందీ టెర్రరిజంపై పోరులో ఏకతాటిపైకి రావాల్సిన ప్రస్తుత తరుణంలో అసలు సంగతి గాలికి వదిలేసి ఈ కుల, మత, రాజకీయ ఉన్మాదంలో ఊగిపోవడమే పెను విషాదం!  

ఇది సోషల్ మీడియా యుగం. ఒక వీడియో లేదా ఒక ఫొటో లేదా ఒక రాత.. క్షణాల్లో వైరల్ అయ్యే కాలం. పహల్గాంలో ఉగ్రమూకల నరమేధం, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలూ అలాగే వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మామూలుగా అయితే మనమంతా ఏం చేయాలి? మన దేశం మీద టెర్రరిస్టులు చేసిన దాడిగా దీనిని చూడాలి. ఆ ఉగ్రమూకలు, వారి వెనకున్న దాయాది దేశం భరతం పట్టాలి. కానీ, మనం మాత్రం ఏం చేస్తున్నాం? మత, కుల, రాజకీయ ఉన్మాదంతో సోషల్ మీడియా వేదికలపై మనలో మనమే మాటలయుద్ధం చేసుకుంటున్నాం. నిజానికి ఈ మూడు రకాల ఉన్మాదాలు, వాటిని వ్యాపింపజేసే వ్యక్తులను అర్థం చేసుకోవాలంటే.. సోషల్ మీడియాలో సాగుతున్న గుంపుల గలాటాను ముందుగా తెలుసుకోవాలి.

ఎజెండాను బట్టి.. గుంపులు కట్టి..

ఇక్కడ ఎవరి ఎజెండా వారిదే. ఒకరు లెఫ్టిస్టు. ఒకరు రైటిస్టు. ఇంకొకరు సెక్యులరిస్టు. మరొకరు సూడో సెక్యులరిస్టు. వేరొకరు అర్బన్ నక్సలైటు. ఇంతేనా?. కాదు.. ఒకరు అగ్రవర్ణం, ఒకరు నిమ్నవర్ణం. ఒకరు మెజారిటీ, మరొకరు మైనారిటీ. ఇంతేనా..? కానేకాదు.. ఒకరు ఆ పార్టీ, మరొకరు ఈ పార్టీ. ఇంకేం.. కనీసం ముఖ పరిచయం కూడా లేకపోయినా వారికి వీరు.. వీరికి వారు.. ఆగర్భ శత్రువులు అయిపోతారు! శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఎజెండాను బట్టి గుంపులు కడతారు. 

సోషల్ మీడియాలో ఎదుటి గుంపుపై మూక దాడులు చేసి తృప్తి పడతారు. సందర్భం ఏదయినా సరే.. సబ్జెక్టు ఏదయినా సరే.. శత్రువర్గాన్ని టార్గెట్ చేయడమే పని. ఫొటోతోనో, వీడియోతోనో లేదా రాతతోనో అవతలి టార్గెట్ గుంపు గుండెల్లో ముండ్లు గుచ్చి లోలోపల వికటాట్టహాసం చేయడమే కిం కర్తవ్యం. చివరకు ఇలాంటి 'మానసిక ఉన్మాద' సమస్యల రూట్ కాజ్ ను బయటకు తీసి.. సమస్యను, పరిష్కారాలను వివరించి.. కొందరు ఉన్మాదులనైనా మార్చేందుకు ప్రయత్నించాల్సిన పేరు గొప్ప సైకాలజిస్టులు, మేధావులు, జర్నలిస్టులు, హ్యూమనిస్టులు కూడా ఏదో ఒక గుంపు కట్టి.. శత్రు గుంపులపై వెటకారాలతో  పోస్టులు పెడుతుండటం మరో రకమైన ఉన్మాదం! 

అసలు బాధంతా న్యూట్రలిస్టులదే..‌‌‌‌‌‌‌‌

సోషల్ మీడియాలో రకరకాల గుంపుల మధ్య నలిగిపోతూ మనశ్శాంతి కోల్పోతున్న వర్గం కూడా ఒకటి ఉంది. అదే న్యూట్రలిస్టు వర్గం. నిజానికి వీళ్లకు ప్రత్యేకంగా ఒక ఎజెండా అంటూ ఏదీ ఉండదు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకే గుంపులు కట్టుకుని మూక దాడులకు దిగే అవకాశమే వీరికి ఉండదు. వీళ్ళు మధ్యలో ఉంటారు. గీతకు అటూ ఇటూ చూసి తప్పొప్పులు బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, రైటిస్టును తప్పంటే లెఫ్టిస్ట్ అంటరేమోనని.. లెఫ్టిస్టును తప్పంటే రైటిస్టు అంటరేమోనని.. ఎక్కువగా స్పందించకుండా, రెండు వైపులా ఉన్మాదాలను చూస్తూ లోలోపలే కుమిలిపోతుంటరు. రెండు వైపులా తప్పులను సరి చేసుకోవాలన్నదే వీరి ఎజెండా. అయితే, దీనికి ఆకర్షితులై గుంపులు కట్టే మూకలు మాత్రం కరువు! 

రాజకీయ ఉన్మాదులదీ ఇదే దారి.. 

అన్ని కులాలు, మతాల్లో మంచీ చెడూ ఉన్నట్టే.. అన్ని రాజకీయ పార్టీలు, నాయకుల్లోనూ మంచీ, చెడు రెండూ ఉంటాయి. కానీ మా నాయకుడే ఆణిముత్యం, మా పార్టీయే శ్రీరామ రక్ష అని ఆయా పార్టీలు, నాయకులకు కట్టు బానిసలుగా మారినవారు నమ్ముతుంటరు. తమ నాయకుడు, పార్టీ ఏం చేసినా రైటే అని కట్టప్పల్లా  కాచుకొస్తుంటరు. అందుకే సందర్భం ఏదైనా సరే.. అవతలి టార్గెట్ గుంపును విమర్శించేందుకు దొరికే ఏ అవకాశాన్నీ వదులుకోరు. ఫేకా? రియలా? అని కూడా ఆలోచించకుండా ఏది పడితే అది షేర్ చేస్తుంటరు. ఇక్కడా మానసిక క్షోభకు గురయ్యేది న్యూట్రలిస్టులే!

అందరూ గురివిందలే.. 

సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన గుంపులను వెక్కిరించేందుకు ప్రత్యేకమైన పదజాలాలనూ సృష్టించుకుంటున్నరు కొందరు ప్రబుద్ధులు. వాట్సాప్ యూనివర్సిటీ, బత్తాయిలు, మరకలు, గొర్రె బిడ్డలు, అర్బన్ నక్సలైట్లు, మేతావులు, సూడో సెక్యులరిస్టుల వంటి పద ప్రయోగాలతో ఎదుటి వారి మనసులు విరిచేసి వికృతానందం పొందుతుంటరు. ఈ క్రమంలో అందరూ గురివింజ గింజల్లా తమ నలుపును మాత్రం ఎరుగరు. చివరకు సోషల్ మీడియా పోరాటంలో వీర లెవెల్లో పోరాడుతూ.. ఏండ్ల తరబడి సాగుతూ వస్తున్న బంధాలు, స్నేహాలు, పరిచయాలనూ తెంచేసుకుంటున్నరు!

ఆఖరి ముచ్చట.. 

కుల, మత, రాజకీయ మూకలు గీతకు అటు లేదా ఇటు ఉంటుండటంతోనే ఉన్మాదులుగా మారుతున్నరు. ఏ నాణేనికైనా బొమ్మ, బొరుసు రెండూ ఉంటాయన్న సోయే వారికి కరువైపోతోంది. గీత మీద ఉండి అటూ ఇటూ చూసి వాస్తవాలు వివరించి, ఈ సామాజిక జాఢ్యాన్ని నివారించాల్సిన మేధావులు కూడా ఏదో ఒకవైపు మొగ్గి.. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా దబాయిస్తుండటం, అవతలి గుంపు తెలివి తక్కువదనేలా పోస్టులు పెడుతూ శాడిజంతో తన్మయత్వం చెందుతుండటం మరో రకమైన ఉన్మాదం. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికలన్నీ ఉన్మాదుల అడ్డాలుగా మారిపోయాయి. ఉన్మాదులు, ఉన్మాదులు కొట్టుకు చస్తే పీడ విరగడైతది. కానీ ఎటొచ్చీ ఈ ఉన్మాద గుంపుల నడుమ న్యూట్రలిస్టులే ఎక్కువగా మానసిక క్షోభకు గురి కావడం అనేది అసలు విషాదం! 

జనరలైజేషన్ తో మొదలై.. 

ఒక మతంలో కొందరు టెర్రరిస్టులు ఉంటే, ఆ మతం వాళ్లంతా టెర్రరిస్టులేనని.. ఒక మతంలో కొందరు ఉన్మాదులుంటే ఆ మతం వాళ్లంతా ఉన్మాదులేనని.. ఒక కులంలో కొందరు దురహంకారులు ఉంటే ఆ కులం వాళ్లంతా దురహంకారులేనని చాలామంది జనరలైజ్ చేసేస్తారు. నిజానికి వాళ్లు దీనిని బలంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని బలపర్చేలా తమ జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలు, పొందిన సమాచారం ఆధారంగానే వారు ఒక జనరలైజేషన్ కు వస్తారు. 

ఒకసారి జనరలైజ్ చేసుకున్న తర్వాత ఆ నమ్మకం బలపడుతూ పోతుంది. ఒక దశ  దాటిపోయిన తర్వాత ఇక.. అన్ని కులాలు, అన్ని మతాల్లోనూ మంచీ, చెడు రెండూ ఉంటాయన్న విషయాన్నే గుర్తించలేని స్థితికి చేరుకుంటారు. చివరకు ఉన్మాదం ముదురుతుంది. దాంతో టార్గెట్ చేసిన కులం లేదా మతం లేదా సమూహాలపై విరుచుకుపడేందుకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరు. తాము చేస్తున్నదే న్యాయమని, సమాజానికి అదే మంచిదనీ బలంగా నమ్ముతారు. ఉన్మాదం ముదిరిన తర్వాత సొంత కులం, సొంత మతాల్లో తప్పులే కనిపించవు. ఎవరైనా ఎత్తి చూపినా.. సమర్థించుకోవడం, ఎదురుదాడి చేయడం తప్ప వేరే ఆలోచనే ఉండదు.

- హన్మిరెడ్డి యెద్దుల , సీనియర్ జర్నలిస్ట్-