
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో భారత్ నిర్వహించిన సైనిక దాడుల కోడ్‌నేమ్ 'ఆపరేషన్ సిందూర్' పేరు కోసం దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ అప్లికేషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉపసంహరించుకుంది. ఒక జూనియర్ ఉద్యోగి అనుమతి లేకుండా అనుకోకుండా ఈ అప్లికేషన్ దాఖలు చేశాడని గురువారం క్లారిటీ ఇచ్చింది. "'ఆపరేషన్ సిందూర్'ను ట్రేడ్‌మార్క్ చేయాలనే ఉద్దేశం లేదు. ఈ పదం ఇప్పుడు భారతీయ ధైర్యానికి చిహ్నంగా ఉంది" అని రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
"రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో స్టూడియోస్‌లో పనిచేస్తున్న ఒక జూనియర్ ఉద్యోగి అనుకోకుండా ట్రేడ్‌మార్క్ కోసం అప్లికేషన్ పంపారు. దీనిని విత్‌డ్రా చేసుకుంటున్నాం" అని వివరించింది. కాగా, ఆడియో, వీడియో కంటెంట్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధిత సర్వీసెస్ కోసం 'ఆపరేషన్ సిందూర్' పదాన్ని ఉపయోగించడానికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఆఫీస్‌లో రిలయన్స్‌తో కలిపి నలుగురు అప్లికెంట్లు బుధవారం అప్లికేషన్లు దాఖలు చేశారు.
వీరు నైస్ క్లాసిఫికేషన్ క్లాస్ 41 కింద రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేశారు. ఈ క్లాస్‌లో ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఫిల్మ్, మీడియా ప్రొడక్షన్, లైవ్ పెర్ఫార్మెన్సెస్, ఈవెంట్స్, డిజిటల్ కంటెంట్ డెలివరీ, పబ్లిషింగ్, కల్చరల్, స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ కేటగిరీని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ప్రొడక్షన్ హౌసెస్, బ్రాడ్‌కాస్టర్స్, ఈవెంట్ కంపెనీలు తరచూ ఉపయోగిస్తాయి. ట్రేడ్‌మార్క్ పొందితే 'ఆపరేషన్ సిందూర్' పేరును ఒక సినిమా టైటిల్, వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీ బ్రాండ్‌గా వాడుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, పబ్లిషింగ్, లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసం రిలయన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది.