
- జోగులాంబగద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం
- తనగల గ్రామంలో విషాదం
అయిజ, వెలుగు: మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో విషాదం నెలకొంది. అయిజ మండలం వెంకటాపురం, కిష్టాపురం గ్రామాల మధ్య బుధవారం రాత్రి వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన త్రివేణ్, అదే గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామనాయుడు(28) బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో త్రివేణ్ అక్కడికక్కడే చనిపోయాడు. పెళ్లి పనుల కోసం స్వగ్రామానికి వస్తున్న రామానాయుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కుటుంబసభ్యులు రామానాయుడును చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా గురువారం తెల్లవారుజామున మార్గమధ్యలో చనిపోయాడు. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రామానాయుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయిజ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.