పునర్వివాహంపై డిజిటల్ ​దాడి

పునర్వివాహంపై డిజిటల్ ​దాడి

సతీసహగమనం గతంలో సామాజికంగా ఆమోదించిన హింసాత్మక ఆచారం. అది స్త్రీల స్వయం ప్రతిపత్తిని, జీవనాధికారాన్ని, జీవితాన్ని హరించే దారుణమైన ఆచారంగా కొనసాగింది. ఆధునిక కాలంలోనూ సరిగ్గా అలాంటి లక్షణాలు డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లలో కనిపిస్తున్నాయి. ఒంటరి మహిళలను సమాజం చిన్నచూపు చూడటం, వారి స్వేచ్ఛను హరించే వైఖరి అనేక సమాజాల్లో ఉన్నట్టే ఇప్పుడు డిజిటల్ ట్రోలింగ్, సైబర్ బుల్లియింగ్, సైబర్​ స్టాకింగ్​, మాబ్​ అటాక్స్ రూపంలో ఆధునిక వికృతరూపం దాల్చింది. ఇది క్షణాల్లో అది విస్తృతం అవుతూ ప్రమాదకరంగా మారింది. ఇవి సతీసహగమనంతో సమానం కాకపోయినా.. స్త్రీలను వారి భర్త మరణం తర్వాత లేదా దూరమైన తర్వాత సామాజికంగా, మానసికంగా, శారీరకంగా వేధించే లక్షణాలను కలిగి ఉంది. 

సతీసహగమనం ఒక నిర్దిష్ట చారిత్రక,సాంస్కృతిక సందర్భంలో ఉన్న దురాచారమైతే..  సోషల్​ మీడియాలో  డిజిటల్​ రూపంలో ఈ వివక్ష మరింత విస్తృతమైంది.  వితంతువులను సమాజంలో రెండోతరగతి పౌరులుగా చూడడం, వారి హక్కులను, స్వాతంత్ర్యాన్ని ప్రశ్నించడం, వారు పునర్వివాహం చేసుకున్నప్పుడు లేదా ఒంటరి మహిళలు కెరీర్​లో ముందుకు వెళ్తున్నప్పుడు వారి ఐడెంటిటీ మీద సోషల్​మీడియా దాడులు ఆందోళనకరంగా మారాయి. ఇది సతీసహగమనానికి మూల కారణమైన పితృస్వామ్య ధోరణి, స్త్రీ వ్యతిరేక ధోరణుల కొనసాగింపుగా చూడవచ్చు. 

సమాజంలో ఒక వితంతువు తన జీవితాన్ని ఎలా మల్చుకోవాలి, మళ్లీ వివాహం చేసుకోవాలా, ఒంటరిగా ఉండాలా అన్నది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆమె ఆలోచనలు, జీవన లక్ష్యాలపై ఆమెకు మాత్రమే నిర్ణయాధికారం ఉండాలి. కానీ, ఈ సంప్రదాయ సమాజాల్లో.. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వితంతువులు తమ భర్త మరణం తర్వాత ‘శాశ్వతంగా వితంతువులుగా’ ఉండాలని, మళ్లీ వివాహం చేసుకోకూడదని లేదా కొన్ని సామాజిక ఆంక్షలను పాటించాలని అనేక అభిప్రాయాలు, హింసాత్మక కామెంట్లు పాతకాలపు స్టీరియోటైప్స్​ సోషల్​ మీడియాలో  పునరావృతం అవుతున్నాయి.పునర్వివాహంపై నిర్ణయం సమాజానిదా? 

సతిని రద్దు చేసి, వితంతు పునర్వివాహాలపై స్వాతంత్య్ర పోరాట కాలంలోనే ఉద్యమాలను చూసిందీ భారత భూమి. రాజారామ్ మోహన్ రాయ్, కలకత్తా సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ పండిత్​ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి కృషి చేశారు. ఫలితంగా భారత దేశంలో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. ఈ హక్కు ద్వారా 1856 నుంచే వితంతు పునర్వివాహాలు   జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ స్త్రీలపై పలు రూపాల్లో సామాజిక వివక్ష కొనసాగేది. 

వెలివేతలు, ఈసడింపులు, చిన్నచూపులకు గురయ్యేవారు. ఇప్పుడు సోషల్​ మీడియా విస్తృతమై.. స్త్రీలపై అదే వివక్ష డిజిటల్​రూపం తీసుకుంది. ట్రోలింగ్ దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. వితంతువులు ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో లేదా బహిరంగ వేదికలపై తమ జీవితాన్ని, వారి లైఫ్ స్టయిల్ ను షేర్ చేసుకున్నప్పుడు వారు తరచూ ఆన్‌‌‌‌లైన్ ట్రోలింగ్‌‌‌‌కు గురవుతారు. ఒక వితంతువు మళ్లీ వివాహం చేసుకుంటే ఆ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ, వివాదాలు జరుగుతున్నాయి. ఆమె దుస్తులు, జీవనశైలి, సంబంధాల గురించి అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు, అవమానకరమైన మాటల దాడి పెరుగుతోంది.   సంప్రదాయ సమాజంలో జరిగే చిన్నచూపు, స్త్రీల చుట్టూ పెరుగుతున్న గాసిప్​లకు ఈ డిజిటల్ మాధ్యమం వేదకవుతోంది. 

డిజిటల్​ వేదికలపై పాతకాలపు ఆంక్షలు

పునర్వివాహం, స్త్రీ స్వేచ్ఛపై నాడు సామాజిక దాడులు జరిగినట్లే.. నేడు డిజిటల్ వేదికలుగా దాడులు కొనసాగుతున్నాయి. గతంలో స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం , స్వతంత్ర జీవనశైలిని ఎంచుకోవడం సామాజికంగా నిషేధంగా ఉండేది. అది ఆచారాల ద్వారా లేదా కఠినమైన సామాజిక ఆంక్షల ద్వారా వ్యక్తమయ్యేది. వారి వస్త్రధారణ, ప్రవర్తన, లేదా నిర్ణయాలను నిరంతరం సమాజం పరిశీలించేది. పునర్వివాహం చేసుకున్న స్త్రీలను ‘సంప్రదాయాన్ని ఉల్లంఘించినవారు’గా లేదా ‘నీతిలేనివారు’గా గాసిప్‌‌‌‌లు, ఆటంకాలు, సామాజిక బహిష్కరణ రూపంలో దాడులకు గురిచేసేవారు. 

నేడు డిజిటల్ యుగంలోనూ ఇలాంటి స్టీరియో టైప్స్ రిపీట్​అవుతున్నాయి. ఆధునిక ఈ కాలంలో చాలా మంది వితంతువులు సామాజిక ఆంక్షలను ధిక్కరిస్తూ, తమ జీవితాన్ని తాము ఎంచుకున్న విధంగా గడుపుతున్నారు. మళ్లీ వివాహం చేసుకోవడం, కెరీర్‌‌‌‌పై దృష్టి పెట్టడం, పిల్లలను పోషించుకోవడానికి ఉద్యోగం చేయడం, స్వతంత్రంగా జీవించే మార్గాలను వెతుకుతున్నారు. వారికి మద్దతు ఇవ్వడం మన సామాజిక బాధ్యత.

ఒంటరి స్త్రీలపై సైబర్‌‌‌‌ స్టాకింగ్ 

పునర్వివాహం చేసుకున్నా, లేదా ఒంటరిగా తన కెరీర్ ను  ఎంచుకున్నా..  వారిపై  సోషల్​ మీడియాలో డిజిటల్ వివక్ష, దాడి వేగంగా వ్యాపిస్తుంది. X వంటి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో వితంతువులు తమ జీవితంలో సానుకూల మార్పులను  షేర్​ చేసుకుంటున్నప్పుడు కొందరు వారిని నీతి, సంస్కృతి పేరుతో హేళన చేస్తున్నారు. ‘సమాజం ఏమనుకుంటుంది’ అనే పేరుతో విమర్శిస్తున్నారు. ఇది సామాజిక వివక్షలో డిజిటల్ వెర్షన్. మహిళలకు  తెలియకుండా నిత్యం వారి ఆక్టివిటీని సోషల్​ మీడియాలో ఫాలోఅవుతూ,  వారు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ ఇబ్బందులు పడేలా సైబర్​ స్టాకింగ్​కు గురి చేస్తున్నారు.  

ఈ సైబర్​ స్టాకింగ్​ వితంతువులను మానసికంగా దెబ్బతీస్తూ, వారి స్వేచ్ఛను పరోక్షంగా హరిస్తోంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌  హేళన ప్రమాదకర సవాళ్లను, స్త్రీ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా చేస్తుంది. ఈ ఆధునిక హింస, వివక్షలు స్త్రీల బతుకులను, వారి కుటుంబాలను అణచివేస్తాయి. ఒక వితంతువు ఎప్పటికీ ఆ స్థితిలోనే  ఉండాలనే ఆలోచన పితృస్వామ్య సమాజం నుంచి వచ్చిన వివక్షాపూరిత దృక్పథం. ఇలాంటి వివక్ష డిజిటల్ యుగంలోనూ  ట్రోలింగ్ రూపంలో కొనసాగుతోంది. 

దీనిని ఎదుర్కోవడానికి.. సమాజంలో స్త్రీల స్వయంప్రతిపత్తిని గౌరవించే సంస్కృతిని పెంపొందించడం, ఆన్‌‌‌‌లైన్ హింసను నియంత్రించే చట్టాలను బలోపేతం చేయడం అవసరం. సైబర్‌‌‌‌ బుల్లియింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాల అమలు, బాధితులకు రక్షణ కల్పించడం. సోషల్ మీడియాలో  హానికరమైన కంటెంట్‌‌‌‌ను తొలగించడానికి, ట్రోల్స్‌‌‌‌ను బ్లాక్ చేయడానికి   చర్యలు తీసుకోవాలి. స్త్రీల స్వయంప్రతిపత్తిని గౌరవించే సంస్కృతి ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

- వినోద్ మామిడాల,జర్నలిస్ట్​–