కౌంటింగ్ పై కమలం పార్టీలో ఉత్కంఠ

కౌంటింగ్ పై కమలం పార్టీలో ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కమలం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఆదివారం కౌంటింగ్ జరగనుండటంతో ఫలితాలపై ఆ పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. మొత్తం111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో కనీసం 20 సీట్లకు పైగా గెలుచుకుంటుందనే ధీమాతో ఉన్నది. ఓటింగ్ శాతం కూడా 20 శాతం వరకు రావచ్చని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా వస్తున్న వివిధ సర్వేల ఫలితాలకు భిన్నంగా బీజేపీ ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

“రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం మేము చేయాల్సింది అంతా చేశాం.. ఇక ప్రజా తీర్పు కోసం వేచి చూస్తున్నాం”  అని ఆయన శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ లో స్పష్టం చేశారు. బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణ హామీ, ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా టూర్లు, మంద కృష్ణ మాదిగ ప్రచారం ఇవన్నీ బీజేపీకి పూర్తి సానుకూల అంశాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే బీజేపీకి కనీసం 20కి తగ్గకుండా సీట్లు, 20 శాతం వరకు ఓట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది. 

శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున మందకృష్ణ ప్రచారం చేయడం, ప్రజల నుంచి వచ్చిన స్పందన, మాదిగలు, దాని ఉప కులాలు బీజేపీకి ఏ మేరకు ఓటు వేశారనేది ఈ సందర్భంగా ఆయన కిషన్ రెడ్డికి వివరించారు. కిషన్ రెడ్డిని పలువురు బీజేపీ అభ్యర్థులు కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు ఉన్న అవకాశాలను పార్టీ అభ్యర్థులు ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి వివరించారు. ఆదివారం కౌంటింగ్ సందర్భంగా పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు.