
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. 2014 నుంచి 2018 వరకు కాలం సరిగా కాక వ్యవసాయం క్షీణదశలోనే కొనసాగింది. 2018 నుంచి వర్షాలు బాగా పడి, చెరువులు, కుంటలు నిండటం, భూగర్భజలాలు పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. కానీ ప్రకృతి విపత్తులు, మార్కెట్కష్టాలు మాత్రం అన్నదాతను వదలడం లేదు. పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి బీమా సౌకర్యం లేకపోగా, రాష్ట్ర సర్కారు కూడా పైసా పరిహారం ఇస్తలేదు. ఒక్క రైతు బంధు ఇవ్వడం తప్ప మిగతా వ్యవసాయ రంగ వృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన రుణ ప్రణాళిక ఆగస్టు దాటినా విడుదల కావడం లేదు. రాష్ట్ర అవసరాలు ఏమిటి? ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి? వాటికి కావాల్సిన విత్తనాలు లాంటి విషయాలు ప్రణాళికలో ఉండటం లేదు. రాష్ట్ర అవసరాలకు తగిన పంటలను ఉత్పత్తి చేసే ప్రణాళిక కూడా లేదు. సరిపోను నిధులు ఇయ్యక రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇతర పరిశోధన కేంద్రాలు నిరూపయోగంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో హార్టికల్చర్ సాగు 6.30 లక్షల ఎకరాలకు దాటడం లేదు. వ్యవసాయ ప్రణాళికలను రూపొందించేటప్పుడు రైతుల సలహాలను గాని, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సలహాలను గానీ తీసుకోవడం లేదు.
మూలకుపడ్డ పథకాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాల్లో రైతు బంధు, రైతు బీమా తప్పితే.. మిగతా ఏ పథకం సరిగా అమలు కావడం లేదు. రుణ మాఫీ కోసం ఇంకా వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. విత్తనాల, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ రావడం లేదు. కనీసం టార్ఫాలిన్లు, పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు కూడా సబ్సిడీ మీద రావడం ఆగిపోయింది. రాష్ట్రంలో మూడేండ్ల నుంచి పంటల బీమా అమలు కావడం లేదు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు. 2018 నుంచి 2023 ఆగస్టు వరకు వరదల వల్ల 30 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా రూ.12,700 కోట్లు. కాగా, కేంద్రం15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.1,787 కోట్లు సాయం చేసింది.
ఆగని ఆత్మహత్యలు
పథకాలు ఎన్ని వచ్చినా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఏటా 650 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో 700 మంది కరెంట్షాక్కొట్టి చనిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారు. రాష్ట్ర సర్కారు కౌలు రైతులను రైతులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి పథకాలు, భరోసా దక్కడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు చట్టానికి రైతు వ్యతిరేక సవరణలు తెచ్చారు. రైతుబంధు పెట్టుబడి సాయం కూడా చాలా మంది రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతు కమతాలు ఉండగా 52 లక్షల మందికి మాత్రమే రైతుబంధు వస్తున్నది. మరో13 లక్షల మందికి పాసు పుస్తకాలు సరిగా లేకపోవడంతో రైతుబంధు రావడం లేదు. ధరణిలో 20 తప్పులు ఉన్నట్లు రాష్ట్ర క్యాబినెట్ కమిటీయే గుర్తించింది. ధరణితో చాలా మంది రైతులు వారి భూమిపై హక్కులు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
మార్కెటింగ్వ్యవస్థ అధ్వానంగానే..
రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంట పండించి మార్కెట్కు తీసుకువెళ్తే అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. వ్యవసాయ మార్కెట్లలో దళారుల బెడదను ప్రభుత్వం కట్టడి చేయడం లేదు. ఐకేపీ మినహా మిగతా వ్యవసాయ మార్కెట్లలో మద్దతు ధరలు అమలు కావడం లేదు. మద్దతు ధరలు రాక రైతులు ఏటా రూ.6 వేల కోట్లు నష్టపోతున్నట్లు మా ఏఐకేఎస్ సర్వేలో తేలింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారినే మార్కెట్ కమిటీలుగా నామినేట్చేస్తున్నారు. వారు వ్యాపారులతో కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తున్నారు. మార్కెట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. రాష్ట్ర అవసరాలకు తగినంత మొత్తంలో పంటలు పండించకపోవడంతో ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూరగాయలను మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇక్కడి రైతులను కూరగాయలు, పప్పు పంటలు సాగు చేసుకునేలా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర అవసరాలకు దిగుమతులే దిక్కు అవుతున్నాయి. హార్టికల్చర్ ను అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తిని పెంచడానికి గల అవకాశాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. తెలంగాణ సమశీతోష్ణ వాతావరణం కలిగినది. ఇక్కడి పంటల్లో మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ పౌష్టికత్వం ఉంటుంది. మన పంటలకు బయట మంచి డిమాండ్ఉంది. దాన్ని గుర్తించి ఎగుమతులు పెంచే ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. మనది విత్తనోత్పత్తి రాష్ట్రమని సర్కారు చెబుతున్నా... రాష్ట్రంలో విత్తన కొరత, కల్తీ విత్తన వ్యాపారం మాత్రం యథేచ్ఛగా సాగుతున్నది. కలీ విత్తనాలు అమ్మినా, బ్యాంకులు రుణాలు ఇవ్వకున్నా, వానలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నా.. పట్టించుకునే వారు లేక రాష్ట్రంలో వ్యవసాయం ఆగమాగం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం శాస్త్రీయ విశ్లేషణ చేసి అన్ని పంటలను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. కౌలు రైతులను ఆదుకొని, రైతుల ఆత్మహత్యలను ఆపాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే వెంటనే పరిహారం ఇవ్వాలి.
లోన్లు ఇయ్యని బ్యాంకులు
రాష్ట్రంలో రుణ ప్రణాళిక కూడా సరిగా ఉండటం లేదు. రుణ ప్రణాళిక రూపకల్పనలో రిజర్వు బ్యాంకు సూచనలను పాటించడం లేదు. బ్యాంకుల వ్యాపార ధనంలో18 శాతం పంట రుణాలు ఇవ్వాలనే రూల్ఉన్నప్పటికీ10 శాతానికి దాటడం లేదు. 2022–-23 వానాకాలానికి రూ. 53 వేల కోట్లు పంట రుణాలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. వాటిలోనూ సర్దుబాటు, రెన్యువల్లోన్లే ఎక్కువ ఉన్నాయి. దీంతో రైతులు దాదాపు రూ.20 వేల కోట్లు ప్రైవేటు రుణాలు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. సహకార సంఘాల పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలో 906 సంఘాలు ఉండగా 799 సంఘాలే అప్పులు ఇస్తున్నాయి. మొత్తం సభ్యులు 31.08 లక్షలు కాగా, 10.62 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు అందుతున్నాయి. ప్రభుత్వం రైతుల క్రాప్లోన్లు మాఫీ చేయకపోవడంతో బ్యాంకులు వారిని డీఫాల్టర్లను చేసింది. దీంతో వాళ్లకి కొత్తగా లోన్లు రావడం లేదు.
- సారంపల్లి మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు, ఏఐకేఎస్