ముహూర్తం ఎప్పుడు.?..కేటీఆర్ పట్టాభిషేకంపై చర్చలు

ముహూర్తం ఎప్పుడు.?..కేటీఆర్ పట్టాభిషేకంపై చర్చలు
  • బడ్జెట్​ సమావేశాల్లోపా..మూఢాలు ముగిసినంకనా..
  • మంచిరోజులపై ఆరా తీస్తున్న లీడర్లు 
  • రేపు టీఆర్​ఎస్​ కార్యవర్గ భేటీలో కేసీఆర్​
  • సంకేతాలు ఇవ్వొచ్చని కేడర్​ అంచనా
  • లేకపోతే సీఎం కేసీఆర్​ పుట్టినరోజున ప్రకటన చేయొచ్చని ప్రచారం 

హైదరాబాద్, వెలుగుమంత్రి కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడుతారన్న దానిపై టీఆర్​ఎస్​లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ముహూర్తం ఎప్పుడు..? మంచి రోజులున్నాయా..? అని లీడర్లు ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే  సీఎం సీట్లో కేటీఆర్​ కూర్చుంటారా? లేక మే నెల చివరలో బాధ్యతలు తీసుకుంటారా..? అనేది హాట్​టాపిక్ గా మారింది. ఇదే టైమ్​లో టీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధ్యక్ష హోదాలో కేసీఆర్ ఈ మీటింగ్​లో ఎలాంటి సంకేతాలు ఇస్తారనేది కేడర్​లో ఆసక్తిగా మారింది. లేదా ఈ నెల 17 సీఎం కేసీఆర్​ పుట్టినరోజునైనా ప్రకటన ఉండొచ్చని లీడర్లు భావిస్తున్నారు. పైగా రోజురోజుకు ‘కేటీఆర్​ సీఎం’ డిమాండ్  పెరుగుతున్నా పార్టీ పెద్దలు వారించే ప్రయత్నం చేయకపోవడంతో కేడర్​ కూడా నిర్ణయం జరిగి పోయిందని, ముహూర్తం ప్రకటించడమే తరువాయి అని నమ్ముతున్నారు.

రేపటి మీటింగ్ కీలకం.. ఫుల్​ సెక్యూరిటీ!

ఆదివారం తెలంగాణ భవన్ లో టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. భవన్​ వద్ద ఈసారి మరింత ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్టీ కార్యాలయం నుంచి విజ్ఞప్తులువెళ్లినట్లు తెలిసింది. కేటీఆర్​ను కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేటీఆర్​ను  సీఎం చేయాలని వస్తున్న డిమాండ్ పై కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని కేడర్​ ఎదురుచూస్తోంది. మీటింగ్​కు  వస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. కేటీఆర్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉందని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. అధికార మార్పిడి అనే అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి  కేటీఆర్ ను కలిసేందుకు చాన్స్ దొరకని లీడర్లు కూడా ఇప్పుడు తెలంగాణ భవన్​లో  ఆయనను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆదివారం మీటింగ్ లో పార్టీ  మెంబర్​షిప్​ రెన్యూవల్​, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న జరిగే వార్షిక మహాసభపై చర్చ ఉంటుందని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్పాయి.

ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు

ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్​డే  వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు  టీఆర్​ఎస్​ లీడర్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎల్బీ స్డేడియాన్ని బుక్​ చేసుకున్నారు. ఆ రోజు స్టేడియంలో యాగాలు, బ్లడ్ క్యాంపులు, అన్నదానం, ఆటల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కాకపోతే.. ఈ  బర్త్​డే వేడుకల్లోనైనా కేటీఆర్​ పట్టాభిషేకంపై కేసీఆర్​ ప్రకటన చేయొచ్చని లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

నెలరోజుల్లో లేదా.. మేలో..?

కేటీఆర్​ను సీఎం చేయడం పక్కా అయితే.. మరి ముహూర్తం ఎప్పుడు? దీనిపై టీఆర్​ఎస్​ లీడర్లు రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలకు ముందే సీఎం సీటును కేటీఆర్​కు అప్పగించవచ్చని కొందరు అంటున్నారు. మార్చి ఫస్ట్​ లేదా సెకండ్​ వీక్​లో బడ్జెట్​ సమావేశాలు జరగనున్నాయి. అంటే నెలరోజుల్లో ఎప్పుడైనా కేటీఆర్​కు బాధ్యతలు అప్పగించవచ్చని కొందరు అంచనా వేస్తుంటే.. మరో రెండు మూడు నెలలు పట్టొచ్చని ఇంకొందరు చెప్తున్నారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేవని, మే మూడో వారం వరకు మూఢాలు ఉన్నాయని, ఆ తర్వాతే కేటీఆర్​కు బాధ్యతలు అప్పగించవచ్చంటున్నారు.

కేటీఆర్కోసం లీడర్ల క్యూ

మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఏ చిన్న అవకాశం వచ్చినా కేటీఆర్​ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్నారు. కేటీఆర్​ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అడ్వాన్స్​గా అభినందనలు చెప్తున్నారు. ఇంకొందరు.. కేటీఆర్ ఎక్కడున్నాడని ఆయన పీఏ, పీఎస్ లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ప్రగతిభవన్ లోని క్యాంపు ఆఫీసులో ఉంటే అక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్​లో అధికారిక ప్రోగ్రామ్​లకు  వెళ్తే అక్కడికీ పరుగులు తీస్తున్నారు. దీంతో లీడర్ల తాకిడి పెరిగిందని గ్రహించిన కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్న వారిని మాత్రమే కలుస్తున్నట్టు టీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఓ ప్రైవేటు పనిమీద బెంగుళూరుకు వెళ్తే కొందరు లీడర్లు అక్కడికి వెళ్లి కూడా కలిసినట్టు చెప్తున్నారు