
- ప్రారంభానికి ముందే దెబ్బతింటున్న మెదక్ రైల్వే స్టేషన్
- ఎంపీ, ఎమ్మెల్యే హెచ్చరించినా అదే తీరు..
‘ఏం పనులివి.. గిట్లనే ఉంటయా.. క్వాలిటీగా చేస్తే చిన్న వర్షానికే కుంగిపోతయా.. మట్టికట్ట పటిష్టం చేయకుండానే సీసీ వేస్తారా.. కోట్ల రూపాయలతో చేపట్టే పనులపై ఇంత నిర్లక్ష్యమా’ 2019 ఆగస్టు 7న రైల్వే స్టేషన్ పనుల పరిశీలన సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్న మాటలివి..
‘డీపీఆర్, డిజైన్ ప్రకారం పనులు చేయాలి కానీ ఇలా ఇష్టారీతిగా చేస్తారా? నేనూ కాంట్రాక్టర్నే మట్టి రోలింగ్ చేసి పటిష్టం చేయకుండానే ఎవరైనా సిమెంట్ బెడ్ వేస్తారా? రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఇంత చెండాలంగా కడతారా.. డోర్లు క్వాలిటీగా లేవు, ఫ్లోరింగ్ సరిగా లేదు. రెయిలింగ్ చెత్తగా ఉంది. టోటల్ బిల్డింగ్ స్ట్రక్చరే ఏం బాగా లేదు’ 2019 ఆగస్టు 13న రైల్వే స్టేషన్ పనుల సమీక్ష సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంట్రాక్టర్‌పై మండిపడ్డారిలా.. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంత హెచ్చరించినా కాంట్రాక్టర్, రైల్వే అధికారుల తీరు ఏ మాత్రం మారలేదు.
మెదక్, వెలుగు: మెదక్ పట్టణ శివారులో నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ పను ల్లో క్వాలిటీ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏండ్ల పాటు మన్నికంగా ఉండాల్సిన కట్టడాలు ప్రారంభానికి ముందే దెబ్బతింటుండడం గమనార్హం.
రూ.196 కోట్లతో..
రూ.196 కోట్ల వ్యయంతో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం వరకు ( 17.2 కిలోమీటర్లు) కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా మెదక్ పట్టణ శివారులో రైల్వేస్టేషన్, ప్లాట్ ఫారాలు నిర్మిస్తున్నారు. ఈ పనులు 2015 నుంచి ఆగుతూ, సాగుతుండగా పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఇదివరకు జరిగిన పనుల్లో గతేడాది నాణ్యతలో పాలు వెలుగు చూశాయి. ప్లాట్ ఫాం నిర్మాణంలో భాగంగా వేసిన సిమెంట్ బెడ్ బీటలు వారి, పలుచోట్ల మట్టి కుంగిపోయింది. స్టేషన్ బిల్డింగ్‌కు పలుచోట్ల బీటలు ఏర్పడ్డాయి. ప్రారంభించకముందే గోడలు తేమ ఊరాయి. ఈ విషయం తెలిసి గతేడాది ఆగస్టులో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి, రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణంతో కలిసి మెదక్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పనులు ఇలా అధ్వానంగా జరుగుతున్నాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినా రైల్వే ఆఫీసర్లు, కాంట్రాక్టర్ తీరులో మాత్రం మార్పురాలేదు.
ఊడిన రాళ్లు.. పగిలిన అద్దాలు
రైల్వే స్టేషన్ బిల్డింగ్ పూర్తయినప్పటికీ ప్లాట్ ఫాం అసంపూర్తిగా ఉంది. కొంత గ్రానైట్ బండలు పరిచినప్పటికీ ఇన్ కంప్లీట్‌గా ఉండగా బండలు ఊడిపోతున్నాయి. కొన్ని పగిలి పోయాయి. ఇటీవల వర్షానికి స్టేషన్ బిల్డింగ్ సమీపంలో మట్టి కొట్టుకుపోయి పెద్ద కయ్య పడింది. పనులు పటిష్టంగా చేయకపోవడం, రివిట్మెంట్ లేకపోవడంతో ఇలా జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం, సెక్యూరిటీ కరువవడంతో ఎవరో బిల్డింగ్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. స్టేషన్లో ఇవతలి వైపు నుంచి రైల్వేలైన్ కింద నుంచి అవతలి వైపునకు వెళ్లేందుకు వీలుగా అండర్ పాస్ నిర్మించారు. అక్కడ పనులు క్వాలిటీగా చేయకపోవడంతో రెండు పక్కలా గోడలు తేమబారి అధ్వానంగా మారాయి. ఓ చోట పైకప్పు సీలింగ్ దెబ్బతింది. ప్లాట్ ఫాం అవతలి వైపు నిర్మించిన రాతిగోడ నాసిరకంగా ఉంది. పలుచోట్ల బీటలు ఏర్పడ్డాయి. గత కొన్ని నెలలుగా పనులు నిలిచిపోగా రైల్వే స్టేషన్ నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా ప్రారంభానికి ముందే రైల్వే స్టేషన్ పనుల్లో అనేక లోపాలు బయటపడడం చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.