TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు

TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (టీఎస్ పీఎస్ సీ ) లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతోంది. దీనిపై టీఎస్ పీఎస్ సీ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు.  ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్ లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 

ప్రవీణ్‌ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్‌ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్‌ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్‌ లీక్‌ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్‌ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రవీణ్ OMR షీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో మాత్రం వైరల్ గా మారింది. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం నిందితుల కాంటాక్ట్ లిస్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. 

సీఎస్ రివ్యూ

పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలర్ట్ అయ్యారు. దీనిపై ఉన్నతాధికారులతో మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. పేపర్ ఎలా లీకేజీ అయ్యింది..? దీనికి అసలు కారకులు ఎవరు..? ఇప్పటి వరకు దర్యాప్తు ఎంత వరకూ వచ్చింది..? ఎంతమందిని అరెస్ట్ చేశారు..? వంటి కీలక విషయాలపై ఆరా తీయనున్నారు.