నా కొడుకు ఆచూకీ కనుక్కోండి .. బయ్యక్కపేట సర్పంచ్ ​సమ్మిరెడ్డి వేడుకోలు

నా కొడుకు ఆచూకీ కనుక్కోండి .. బయ్యక్కపేట సర్పంచ్ ​సమ్మిరెడ్డి వేడుకోలు
  • కువైట్ పోతుంటే ప్రమాదం జరిగిందంటున్రు  
  • తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలి

ములుగు, వెలుగు : బీటెక్ చదివిన నా కొడుకు ఉద్యోగరీత్యా రాజస్థాన్​లోని ఓ కన్సల్టెన్సీ నుంచి ఇరాన్ వెళ్లిండు. అక్కడి నుంచి కువైట్ కు సముద్రమార్గంలో వెళ్తుంటే షిప్​గల్లంతయిందని ప్రచారం జరుగుతోంది. దయచేసి నా కొడుకు ఆచూకీ కనిపెట్టండి’ అంటూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్క గ్రామానికి చెందిన గుర్రం రమ,- సమ్మిరెడ్డి దంపతులు వేడుకుంటున్నారు. 

మంగళవారం ములుగులో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. బయ్యక్కపేటకు చెందిన సర్పంచ్ ​గుర్రం సమ్మిరెడ్డి, రమ దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు శ్రీమాన్ బీటెక్ ​పూర్తి చేసిరాజస్థాన్​లోని జైపూర్ లో ఉన్న రుద్రాక్ష కన్సల్టెన్సీ ద్వారా జాబ్ కోసం అప్లై చేసుకున్నాడు. జాబ్ కన్ఫర్మ్ కావడంతో నవంబర్ 22న జైపూర్ నుంచి ఇరాన్ వెళ్లి ఉద్యోగంలో జాయినయ్యాడు. 

రెండు రోజుల క్రితం డ్యూటీలో భాగంగా ఇరాన్ నుంచి కువైట్​కు మరికొంతమందితో కలిసి షిప్​లో బయలుదేరాడు. రోజు తమతో ఫోన్​లో మాట్లాడే కొడుకు కాల్ చేయకపోవడంతో గాబరా పడిన సమ్మిరెడ్డి కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేశాడు. శ్రీమాన్ తోటి ఉద్యోగులతో కలిసి ఇరాన్ నుంచి కువైట్ వెళుతుండగా ఓడ ప్రమాదం జరిగిందని చెప్పారు. శ్రీమాన్ తో పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన యువకుడి డెడ్​బాడీ దొరికిందని చెబుతున్నారని సమ్మిరెడ్డి కంటతడి పెట్టుకున్నాడు. తన కొడుకు ఆచూకీ మాత్రం చెప్పడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్పందించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.