కాకతీయలో కలవరం..పీహెచ్‍డీ అక్రమాలపై త్రిసభ్య కమిటీ వేసిన సర్కార్‍

కాకతీయలో కలవరం..పీహెచ్‍డీ అక్రమాలపై త్రిసభ్య కమిటీ వేసిన సర్కార్‍
  •     వర్సిటీలో రేపట్నుంచి మొదలుకానున్న విచారణ
  •      వీసీ నుంచి స్టూడెంట్ల వరకు అందరితో ఇంటరాక్ట్​అవనున్న కమిటీ సభ్యులు 
  •     యూజీసీ గైడ్​లైన్స్ ఫాలో కాకపోవడంపై డీన్లు ఆందోళన
  •     ఎవరి బండారం బయటపడుతుందోనని టెన్షన్‍

వరంగల్‍, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు ఈ నెల 17 నుంచి వర్సిటీలో విచారణ జరపనున్నారు. వీసీ నుంచి స్టూడెంట్ల వరకు అందరితో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో కేయూ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఎంక్వైరీని షురూ చేసేందుకు కమిటీ సభ్యులు నాలుగైదు రోజులుగా వీసీ తాటికొండ రమేశ్​ను కాంటాక్ట్​చేస్తున్నా.. సహకరించడం లేదని, అందుబాటులో లేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. 

గాడ్​ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు వర్సిటీలోని డీన్లు ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమై విచారణ నుంచి ఎలా బయటపడాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ కౌన్సిల్‍ వైస్‍ చైర్మన్‍ ప్రొఫెసర్‍ వెంకటరమణ నేతృత్వంలో కమిటీ సభ్యులు ఇప్పటికే పలువురు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పీహెచ్‍డీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రైమరీ డేటాను కలెక్ట్ చేశారు. శనివారం కేయూ వీసీ రమేశ్‍తోపాటు వివిధ డిపార్టుమెంట్లకు చెందిన డీన్లను విచారించనున్నారు. అనంతరం స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్ల నుంచి వినతి పత్రాల రూపంలో సమాచారం తీసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నారు.

నచ్చినవారికి ఇచ్చారనే ఆరోపణలు

కేయూ పరిధిలో 2017లో పీహెచ్‍డీ నోటిఫికేషన్‍ విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత ఆరేండ్లు పట్టించుకోలేదు. స్టూడెంట్ల ఆందోళనతో తర్వాత అడ్మిషన్లకు షెడ్యూల్‍ ప్రకటించారు. యూనివర్సిటీలోని 28 సబ్జెక్టుల్లో దాదాపు 212 ఖాళీలు ఉండగా.. కేటగిరి–1, కేటగిరి–2లో అర్హత ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంది. కేటగిరి–1లో 50 శాతం సీట్లను యూజీసీ నెట్‍, జేఆర్‍ఎఫ్‍, ఎంఫిల్‍ అర్హత ఆధారంగా, కేటగిరి –2లో ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేయాలి. 2022 మే నెలలో కేటగిరీ –1 నోటిఫికేషన్‍ ఇచ్చి వర్సిటీ అధికారులు ప్రక్రియ చేపట్టారు. 

పార్ట్ టైం క్యాండేట్లకు సీట్లు కట్టబెట్టేందుకు రూల్స్ బ్రేక్‍ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కేటగిరి–2 భర్తీ కోసం 2023 మార్చి 21న నోటిఫికేషన్‍ ఇచ్చారు. ఇంటర్వ్యూలు ముగిశాక, అదే ఏడాది ఆగస్ట్ 29న ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇంటర్వ్యూల్లో ఆఫీసర్లు నిబంధనలు పాటించలేదని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అడ్మిషన్‍ కమిటీలో డిపార్ట్​మెంట్ సూపర్‍వైజర్లను కాకుండా ఇతర డిపార్టుమెంట్ల ప్రొఫెసర్లను నియమించి పీహెచ్‍డీ సీట్లు తమకు నచ్చివారికి ఇచ్చేలా కుట్ర చేశారని స్టూడెంట్లు ఆందోళనలకు దిగారు. 

క్యాటగిరీ–2 అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని, కొందరు ప్రొఫెసర్లు సీట్లు అమ్ముకున్నారని గతేడాది సెప్టెంబర్​లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. విద్యార్థి నాయకులు వీసీ చాంబర్ లోకి దూసుకెళ్లారు. వీసీ రమేశ్‍, రిజిస్ట్రార్‍ శ్రీనివాస్‍రావుతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు 10 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని జైలుకు పంపారు. ఆ తర్వాత ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పోలీసులు కొట్టడంతో గాయపడిన కొందరు స్టూడెంట్లు గవర్నర్‍ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు. కేయూలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‍ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు స్టూడెంట్లకు సారీ కూడా చెప్పారు.   

అంతా సక్రమమేనంటున్న అధికారులు

కేయూ పీహెచ్‍డీ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వీసీ రమేశ్‍తోపాటు అధికారులు సర్టిఫికేట్​ఇచ్చారు. స్టూడెంట్‍ యూనియన్‍ లీడర్లలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని..ఆర్ట్స్, ఫార్మసీ, సైన్స్, కామర్స్ అండ్‍ బిజినెస్‍ మెనేజ్‍మెంట్‍, లా, ఇంజనీరింగ్‍, ఎడ్యుకేషన్‍, సోషల్‍ సైన్స్ డీన్లుగా ఉన్న ప్రొఫెసర్లు బన్న అయిలయ్య, వై.నరసింహారెడ్డి, పి.మల్లారెడ్డి, పి.అమరవేణి, విజయలక్ష్మి, టి.శ్రీనివాసులు, ఎస్‍.రామనాథ కిషన్‍, టి.మనోహర్‍ సంయుక్తంగా గతంలో ఓ ప్రకటన రిలీజ్‍ చేశారు. ఆందోళన చేస్తున్నవారిలో కొందరికి తక్కువ మార్కులు వచ్చాయన్నారు. కనీసం రూల్‍ ఆఫ్‍ రిజర్వేషన్‍లో కూడా వారు ఫిట్‍ కాలేదని చెప్పారు. ఆఫీసర్ల ముందు ఒత్తిడి తీసుకురావడంతో సీట్లు సంపాదించాలని చూస్తున్నట్లు డీన్లు వివరించారు. అయితే అడ్మిషన్లు కేటాయింపులో యూజీసీ గైడ్‍లైన్స్–2016ను ఫాలో కాలేదని తెలుస్తోంది. 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్‍రెడ్డి

పీహెచ్‍డీ అడ్మిషన్ల విషయమై గతేడాది సెప్టెంబర్​13న దీక్షకు దిగిన స్టూడెంట్లను రేవంత్​రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‍ సర్కారు వచ్చాక అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలపై  ఎంక్వైరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వారం కింద కేయూలో ఎంక్వైరీ కోసం త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‍ చైర్మన్‍ ప్రొఫెసర్‍ వెంకటరమణ, సీపీ గేట్‍ కన్వీనర్‍, ఓయూ ప్రొఫెసర్‍ పాండురంగారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్‍ జాయింట్‍ సెక్రటరీ వెంకటేశ్వర్లును సభ్యులుగా నియమించింది.