
- రాజ్‌భవన్‌కు లీగల్ టీమ్‌ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్
- గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపిన రాజ్‌భవన్
- ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
- రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు, లోకల్‌బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్
- లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్లే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలని యోచన
హైదరాబాద్, వెలుగు: ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ఆమోదించి పంపిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుల విషయంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. గురు, శుక్రవారాల్లో లీగల్ టీమ్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించుకొని మంత నాలు సాగించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నిర్ణయం మాత్రం వెల్లడించలేదు. -గతంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపిన గవర్నర్, తాజా బిల్లులను ఆమోదిస్తారా? లేదంటే రాష్ట్రపతికి పంపుతారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశముందని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. పంచాయతీరాజ్, మున్సిపల్చట్ట సవరణ బిల్లులకు గత ఆది, సోమవారాల్లో అసెంబ్లీ , కౌన్సిల్ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన ‘పంచాయతీరాజ్ చట్టం-2018’లోని సెక్షన్ 285 (ఏ)కు, మున్సిపల్చట్టం-2019లోని సెక్షన్29కు సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.
బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రులతోపాటు ప్రతిపక్ష నేతలు.. మారిన పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల సభ అభిప్రాయాన్ని గవర్నర్ సైతం గౌరవించి, బిల్లులకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్లు సీఎం, మంత్రులు సహా సభ్యులు పేర్కొన్నారు. మరుసటి రోజే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆల్‌పార్టీ టీమ్ రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ టీమ్‌లో బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు బిల్లు ప్రాధాన్యతను గవర్నర్‌కు వివరించారు. ఈ చట్టం వెనుకబడిన వర్గాలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఆయనకు తెలియజేశారు. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందితేనే స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని, అందువల్ల ఆలస్యం చేయకుండా ఆమోదించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
జీవోపై సర్కారు కసరత్తు
మరోవైపు గవర్నర్ నిర్ణయంతో సంబంధం లేకుండా జీవో జారీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అంటే.. రాష్ట్రంలో 64 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతంలో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించగా, గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. అక్కడ ఆమోదం లభించకపోయినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జీవో ఇచ్చింది. ఇపుడు సైతం అలాగే చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం జనాభాకు తగ్గట్టుగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేలా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా 342(ఎ) ఆర్టికల్‌లో మార్పు చేశారు. రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోకు కేంద్రం ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. దీంతో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో అలా జరగకపోవచ్చనే వాదనలున్నాయి.
లీగల్ ఒపీనియన్ తీసుకున్న గవర్నర్
తన వద్దకు చేరిన ఈ రెండు బిల్లులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గవర్నర్ న్యాయ నిపుణులను గురు, శుక్రవారాల్లో రాజ్‌భవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ఈ బిల్లులోని అంశాలు, వాటి అమలులో తలెత్తే న్యాయపరమైన సమస్యల గురించి ఆరా తీశారు. కొన్ని అంశాలపై ఆయన ఓ అంచనాకు రాలేకపోయారనే చర్చ జరుగుతున్నది. దీంతో బిల్లులను ఆమోదిస్తారా? రాష్ట్రపతికి పంపుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ నిర్ణయంపైనే బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారపడి ఉన్నాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఇంకా చెప్పాలంటే సోమవారం కల్లా క్లారిటీ వస్తుందని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పాలిత తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలైతే.. దీని ప్రభావం ఆ ఎన్నికల్లో ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందువల్ల కేంద్రం ఆదేశాల మేరకే బిల్లులపై గవర్నర్ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.