రైతుబంధు కమిటీలతో రైతులకు ఫాయిదా లేదు

రైతుబంధు కమిటీలతో రైతులకు ఫాయిదా లేదు
  • ఫండ్స్​లేవు.. పనుల్లేవు
  • గైడ్ లైన్స్ ఇవ్వక పనిచేయని మెంబర్లు
  • 700 కోట్ల రివాల్వింగ్ ఫండ్, షేర్ కాపిటల్ ఉత్తిదే
  • వందల కోట్లతో నిర్మించిన రైతు వేదికలదీ సేమ్ సీన్

నల్గొండ, వెలుగు: మూడేండ్ల కింద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతుబంధు కమిటీల ఉనికి కనిపించడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న  స్కీమ్​లు రైతులకు సరిగా అందేట్టు చూస్తాయని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయో లేదో చూడడం దగ్గర నుంచి వారి పంటలకు మార్కెట్​లో మద్దతు ధర వచ్చేలా చేయడం వరకు ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయని గవర్నమెంట్​గొప్పగా చెప్పినా.. కమిటీల విధివిధానాలేమిటో ప్రకటించకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. లాభాపేక్ష లేని సంస్థగా ప్రభుత్వం రైతు సమన్వయ సమితి కార్పొరేషన్​ను 2018 మార్చిలో ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుంచి కమిటీలను వేసింది. రూ. 200 కోట్లు క్యాపిటల్​ కింద సమకూరుస్తామని, రైతులకు మద్దతు ధర కోసం రూ. 500 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇవేవీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. 

చైర్మన్లు మారారు...పేరు మారింది
గ్రామ కమిటీల్లో 15 మంది, మండల, జిల్లా స్థాయి కమిటీల్లో 24 మంది చొప్పున, స్టేట్​ కమిటీలో 15 మంది మెంబర్లను నియమించారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్​గా మొదట గుత్తా సుఖేందర్​రెడ్డి ఉండగా, ఆయన కౌన్సిల్​చైర్మన్​అయిన తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని నియమించారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలకు  కోఆర్డినేటర్లను కూడా నియమించారు. ఏడాది తర్వాత కార్పొరేషన్​పేరు మార్చారు. ప్రస్తుతం వీటిని రైతుబంధు కమిటీలుగా పిలుస్తున్నారు. కమిటీలు ఎలా పని చేయాలన్న గైడ్​లైన్స్​లేకపోవడంతో ఫీల్డ్ లెవల్​లో కమిటీల ఉనికి కనిపించడం లేదు. తమ విధివిధానాలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారామని కోఆర్డినేటర్లు వాపోతున్నారు. 

ఫీల్డ్​లో కనిపించని మెంబర్లు
రైతు బంధు కమిటీల గురించి గొప్పలు చెప్పడమేకానీ అసలవి పని చేస్తున్నాయో లేదో ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాల్లో అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​నిర్వహించే కార్యక్రమాలకు కూడా కమిటీ మెంబర్లను పిలవడం లేదు. కొత్త గ్రామ పంచాయతీల పరిధిలో రైతుబంధు కమిటీలనే వేయలేదు. రెండేళ్లుగా వరదల వల్ల రైతులు నష్టపోయారు. వేల ఎకరాల పంట నీట మునిగింది. వడ్లు, పత్తికి మద్దతు ధర దొరకలేదు. సూర్యాపేట, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు చెల్లించవలసిన పైసల్లో కోత పెట్టారు. ఈ విషయాల్లో ఎక్కడా రైతుబంధు కమిటీలు జోక్యం చేసుకోలేదు. రైతులతో నిలబడి వారికి న్యాయం జరిగేలా చూడలేదు. కమిటీలకు అధికారిక హోదా లేకపోవడంతో తమనెవరూ ఖాతరు చేయడం లేదని మెంబర్లు చెప్తున్నారు. 

ఏఈఓల అడ్డాగా రైతు వేదికలు
క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతువేదికలు కూడా రైతులకు ఉపయోగపడడం లేదు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద రైతులకు అవగాహన పెంచేందుకు సైంటిస్టులతో, ఆదర్శ రైతులతో సెమినార్ల కోసం, సాగుకు సంబంధించిన ఇష్యూల మీద చర్చల కోసం రైతులకు వీలుగా ఉంటుందని వేదికలను నిర్మించారు. ఇంతవరకు ఎక్కడా అలాంటి కార్యక్రమాలు జరగలేదు. అగ్రికల్చర్​ఎక్స్​టెన్షన్​ఆఫీసర్లు ఈ వేదికల నుంచే పనులు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల వేదికలు ఏఈఓ ఆఫీసులుగా మారిపోయాయి. రూ. లక్షలు ఖర్చుచేసి కట్టిన బిల్డింగులకు ఇంకా చాలాచోట్ల తాళాలు వేసి ఉన్నాయి.