ట్రిపుల్‌‌ ఆర్ నార్త్ అలైన్‌‌మెంట్‌‌లో నో చేంజ్! 6 లేన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..జనవరి నుంచి వర్క్ స్టార్ట్

ట్రిపుల్‌‌ ఆర్ నార్త్ అలైన్‌‌మెంట్‌‌లో నో చేంజ్!  6 లేన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..జనవరి నుంచి వర్క్ స్టార్ట్
  • రోడ్డు పొడవు అంతే..వెడల్పు మాత్రమే పెరుగుతున్నది
  • 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్పు.. కేంద్రం నుంచి గ్రీన్ ​సిగ్నల్​
  • జనవరి నుంచి వర్క్​ స్టార్ట్ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధం
  • 90 శాతం భూసేకరణ కంప్లీట్.. బీఆర్ఎస్ హయాంలో  కేవలం 6 శాతమే 
  • రాష్ట్ర వాటా నిధుల కోసం రూ.3 వేల కోట్ల హడ్కో రుణం తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్ ఆర్‌‌‌‌​) నార్త్​ పార్ట్‌‌ను  161.5 కిలో మీటర్ల దూరం ఎలాంటి అలైన్‌‌మెంట్​ మార్చకుండానే పనులు చేపట్టడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అలైన్‌‌మెంట్​ మార్చుతారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. ఒక్క కిలో మీటర్​ దూరం కూడా రోడ్డు పొడవు పెంచబోమని ప్రకటించింది. కాగా, 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చింది. దీంతో నార్త్​ పార్ట్​ పనులకు డిసెంబర్‌‌‌‌లోపు టెండర్లు కంప్లీట్​ చేసి.. వచ్చే ఏడాది జనవరిలో వర్క్స్​ స్టార్ట్​ చేయడానికి రాష్ట్ర సర్కారు ప్లాన్​ సిద్ధం చేసుకున్నది. నార్త్​ పార్ట్​ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర వాటా కింద రూ.3 వేల కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకొని, ఖర్చు చేస్తున్నది.  

రూ.6 వేల కోట్లతో 90 శాతం భూసేకరణ కంప్లీట్​ 

ట్రిపుల్​ఆర్‌‌‌‌ నిర్మాణానికి కేంద్రం నుంచి 2017–18 లో అన్ని అనుమతులు వచ్చాయి. నార్త్,  సౌత్  పార్ట్‌‌లుగా విభజించి పనులు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఫస్ట్​ సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగ్‌‌దేవ్‌‌పూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలో మీటర్ల నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇందులో 72.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. గత కేసీఆర్​ సర్కారు ఐదేండ్లలో కేవలం 6 శాతం భూసేకరణ మాత్రమే చేపట్టింది. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్​​ సర్కారు 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 4 వరుసలుగా ఉన్న ఈ రోడ్డును 6 లేన్లుగా మార్చింది. దీంతోపాటు రైతులను ఒప్పించి రూ.6 వేల కోట్లతో కేవలం రెండేండ్లలో 90 శాతానికిపైగా భూసేకరణ కంప్లీట్​ చేసింది. దీనికోసం రాష్ట్ర వాటాగా రూ.3 వేల కోట్ల నిధులను హడ్కో నుంచి రుణంగా తీసుకొని, ఖర్చుచేస్తున్నది. 

తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట!

ట్రిపుల్‌‌ ఆర్​ నార్త్​ పార్ట్​ నిర్మాణం విషయంలో అలైన్‌‌మెంట్​ మార్చుతున్నారని.. పెద్దల భూములను కాపాడుతూ పేద రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. ‘‘ఒక్క కిలో మీటర్‌‌‌‌ కూడా అలైన్‌‌మెంట్​ మార్చడం లేదు. పాత అలైన్‌‌మెంట్​ ప్రకారమే రోడ్డు నిర్మాణ పనులను స్టార్ట్​ చేస్తాం’’ అని శనివారం స్వయంగా ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటన చేశారు. అదంతా బీఆర్ఎస్​ లీడర్ల  గోబెల్స్​​ ప్రచారం అని మండిపడ్డారు. దీనిని రైతులు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. దీంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లయ్యింది.