
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల15వ తేదీకి వాయిదా పడ్డ లీగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి లేదు. అలాగని రద్దు చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఐపీఎల్ ఫ్యూచర్‌పై ఒక నిర్ణయానికి వచ్చే పొజిషన్‌లో బీసీసీఐ లేదని బోర్డు ట్రెజరర్ అరుణ్ ధుమల్ సోమవారం పేర్కొన్నారు. అలాగే, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ చేసిన అక్టోబర్–నవంబర్ స్లాట్‌లో లీగ్‌ను నిర్వహిస్తామని చెప్పడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా మాకు తెలియనప్పుడు మేం అర్థవంతమైన నిర్ణయానికి ఎలా రాగలం? ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మేం కూర్చొని చర్చిస్తాం. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటిదాకా లీగ్ ఫ్యూచర్‌పై ఏం మాట్లాడినా తొందరపాటే అవుతుంది. అందరూ ఐపీఎల్ జరగాలని కోరుకుంటున్నారు. కానీ, ముందుగా కొంత క్లారిటీ రానివ్వండి’ అని చెప్పారు. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య సోమవారం ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించాలని షెడ్యూల్ చేయలేదని అరుణ్ తెలిపారు. ‘మా ఆఫీస్ బేరర్లమంతా టచ్‌లోనే ఉన్నాం. ఒక్క ఐపీఎల్ మాత్రమే కాదు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉంది. కొన్ని లీగల్ ఇష్యూస్‌ను అధ్యయనం చేయాలి. అయినా ఈ రోజు (సోమవారం) ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్ జరపాలని నిర్ణయించలేదు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేం చర్చించడానికి ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.
చాలా అంశాలను పరిగణించాలి
అక్టోబర్–నవంబర్ విండోలో ఐపీఎల్‌ను రీషెడ్యూల్ చేస్తారన్న ఊహాగానాలపై అరుణ్ స్పందించారు. టోర్నీ గురించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ‘ఫస్ట్.. ఒకవేళ ఆస్ట్రేలియాలో ఆరు నెలల లాక్‌డౌన్ ఉంటే అది ముగిసిన తర్వాతి నెలలోనే తమ ప్లేయర్లు ట్రావెల్ చేసేందుకు ఆ దేశం అనుమతిస్తుందని మనం ఎలా నిర్ణయానికి వస్తాం? తమ సిటిజన్స్‌కు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్‌ను ఆ దేశం కొనసాగిస్తే పరిస్థితి ఏంటి? వాళ్లు ఇండియాకు ఎలా వస్తారు? అదే సమయంలో మిగతా బోర్డులు కూడా దీనికి అంగీకరించాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. రెండోది, ఒకవేళ ఇండియాలో లాక్‌డౌన్ ముగిసినా కొన్ని మేజర్ సిటీల్లో కొవిడ్–19 హాట్‌స్పాట్స్ ఉంటే ఏం జరుగుతుంది? మన స్పోర్ట్స్ పర్సన్ల లైఫ్‌ను రిస్క్‌లో పెడదామా? మూడోది, ప్లేయర్లు కొన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ మనం టోర్నీని నిర్వహించే స్థితిలో ఉన్నప్పటికీ అది మొదలవడానికి ముందు ప్రాక్టీస్ కోసం ఇంటర్నేషనల్ ప్లేయర్లకు కొంత సమయం ఇవ్వాల్సిందే. మేం టోర్నీ గురించి మాట్లాడే పొజిషన్‌కు వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ క్లియర్ చేయాల్సి ఉంటుంది’ అని ధుమల్
చెప్పుకొచ్చారు.