టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​పై నో క్లారిటీ

టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​పై నో క్లారిటీ
  • కమిషన్ చైర్మన్, ముగ్గురు మెంబర్ల 
  • రాజీనామా.. ఆమోదించని గవర్నర్​
  • రిజైన్​ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు
  • కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్​మెంట్, రిజల్ట్స్​పై ముందుకు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) ఎగ్జామ్స్​పై క్లారిటీ రావడం లేదు. గ్రూప్​ 2 పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో కమిషన్​ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు వాటిని ఆ తేదీల్లో నిర్వహిస్తారా లేదా అన్నదీ డౌటే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్ తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఇంకో ఇద్దరు సభ్యులు మాత్రం ఎప్పటిలాగే విధుల్లో కొనసాగుతున్నారు. రాజీనామాలను గవర్నర్  ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే.. కమిషన్​ కార్యాచరణ, ఎగ్జామ్స్​ నిర్వహణపై స్పష్టత రానుంది. 


ఏడాది రెండేండ్లుగా టీఎస్​పీఎస్సీ తీరు వివాదాస్పదంగా మారింది. పలు పరీక్షలు లీకేజీతో రద్దు కావడంతో పాటు కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. టీఎస్​పీఎస్సీ అధికారుల తీరును, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఖరిని నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబట్టారు. కమిషన్​ బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అప్పటి సర్కార్​ కేవలం సిట్​ వేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నెల 7న కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. ఈ నెల11న సెక్రటేరియెట్​లో  సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసి.. అనంతరం రాజ్ భవన్​లో తన రాజీనామా లేఖను ఇచ్చారు. తర్వాతి రెండ్రోజులకే కమిషన్ మెంబర్లు కూడా సీఎంను కలిశారు. గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో సభ్యులు ఆర్​. సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, లింగారెడ్డి తమ  పదవులకు రాజీనామా చేస్తున్నట్టు రాజ్ భవన్​కు లేఖలు పంపించారు. 

రాజ్ భవన్​ నుంచి నో రెస్పాన్స్

కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కమిషన్మెంబర్లు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి తాము  రాజీనామా చేసి రాజ్ భవన్​లో లేఖలు ఇచ్చినట్టు చెప్పారు. కానీ,దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాజ్ భవన్ నుంచి రాలేదు. రాజీనామాలపైగవర్నర్​ నిర్ణయాన్ని బట్టే కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త బోర్డు వస్తే గానీ..పరీక్షల నిర్వహణపై క్లారిటీ రాదు. 

ఆ ఇద్దరు రాజీనామాకు నో

కమిషన్ లో మొత్తం ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేయగా.. ఇంకో ఇద్దరు సభ్యులు సుమిత్రానంద్ తనోబా, అరుణ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు. రెగ్యులర్​గా వారిద్దరూ కమిషన్​ ఆఫీస్​కు వచ్చి వెళ్తున్నారు. లీకేజీల్లో తమ తప్పేమీ లేదని, అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తున్నది. కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తే.. తాము తప్పుచేశామనే భావన ఉంటుందని ఓ మెంబర్  అన్నారు. కొత్త గవర్నమెంట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పిందని, అలా జరిపిస్తే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నారు. తమ సర్వీస్ ను వదులుకొని సేవ చేయాలనే కమిషన్​లోకి వచ్చామని, గవర్నమెంట్ మారినంత మాత్రాన రాజీనామా చేయాలనడం సరికాదని అన్నారు. 

గ్రూప్​ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా..జరిగేది డౌటే!

గ్రూప్ 2 ఎగ్జామ్స్​ జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇప్పటికే రెండుసార్లు ఈ పరీక్షలు వాయిదాపడ్డాయి. కమిషన్​ చైర్మన్​, మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్​ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్​ 2 ఎగ్జామ్స్​ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కమిషన్​లో  చైర్మన్​ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా, వాయిదా గురించైనా ప్రకటించే చాన్స్​ ఉందని అధికారులు అంటున్నారు. ఇక.. గ్రూప్​ 1, గ్రూప్​ 3 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్​లో పడింది.  9,210 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటికోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది.