క్లౌడ్ బరస్ట్ చేసే టెక్నాలజీనే లేదు

క్లౌడ్ బరస్ట్ చేసే టెక్నాలజీనే లేదు

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్​ చెప్పినట్టు క్లౌడ్​ బరస్ట్​ చేయడం సాధ్యం కాదు. అసలు అలాంటి పరిజ్ఞానమే లేదు. 30 చదరపు కిలోమీటర్ల పరిధి(రెండు మూడు గ్రామాలు)లో గంటలో 10 సెంటీ మీటర్ల వర్షం పడితే క్లౌడ్ బరస్ట్ గా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ జరగలేదు”అని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ చెప్పారు. తెలంగాణపై క్లౌడ్ బరస్ట్ జరిగిందని, ఇందులో విదేశీ కుట్ర ఉందని ఇటీవల సీఎం కేసీఆర్ ఆరోపించారు.  ఈ నేపథ్యంలో క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? అది సాధ్యమేనా? గతంలో ఎవరైనా చేశారా? అనే అంశాలపై రమేశ్​‘వీ6 వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

క్లౌడ్ బరస్ట్​ కాదు.. భారీ వర్షమే
క్లౌడ్ బరస్ట్ ను సృష్టించే టెక్నాలజీ ఇప్పటి వరకు లేదని, సముద్రంపై నుంచి వచ్చే మేఘాలను గుర్తించడం, వాటి తీవ్రతను వినియోగించుకోవడం తప్ప క్లౌడ్ బరస్ట్ అనేది ఉండదని రమేశ్​ చెప్పారు. తనకు తెలిసి అలా జరిగేందుకు ఆస్కారం లేదన్నారు. అరేబియా సముద్రం నుంచి వర్షాకాల మేఘాలు వస్తాయని, అక్కడ ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. ఇటీవల పాకిస్తాన్ మొదలుకుని.. మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని, అందువల్ల కృష్ణా, గోదావరి బేసిన్​లు భారీ వదరతో నిండిపోయాయని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరిందని, ఈ రెండు బేసిన్లలో 15 రోజుల్లో ఇంతలా క్లౌడ్ బరస్ట్ చేయడం ఎవరికైనా సాధ్యమా? అని అన్నారు. తెలంగాణలో జరిగింది క్లౌడ్ బరస్ట్ కాదని, భారీ వర్షం కురిసిందని పేర్కొన్నారు.

కృత్రిమ వర్షాలపై 1972 నుంచి ప్రయోగాలు
దేశంలో 1972 నుంచి కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఉమ్మడి ఏపీలో వైఎస్​ హయాంలో ఏటా మేఘమథనం చేశారని రమేశ్​ చెప్పారు. జూన్, జులైలో వర్షాలు కురవకపోతే మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్నాటకలో సాధారణంగా మేఘమథనం చేస్తారన్నారు. స్టడీస్ ను బట్టి మేఘమథనంతో 13% నుంచి 18% వర్షం పెరిగిందని తెలుస్తోందని, అయితే, ఇది పెద్ద ప్రక్రియ అని అన్నారు. హెలికాప్టర్ల సాయంతో వర్షానికి అవకాశం ఉన్న మేఘాల్లోకి సోడియం క్లోరైడ్, డ్రై ఐస్, ఇతర మూలకాలను ఫీడింగ్ చేస్తారని, తర్వాత వర్షం కురిస్తే ఆ మూలకాలు ఉంటేనే మేఘమథనం జరిగినట్లన్నారు. 

మేఘమథనానికి విమానాలు, చాపర్లు కావాలి
మేఘమథనం మాదిరిగా క్లౌడ్ సీడింగ్ చేసినట్టుగా భావించాలంటే అందుకు ఎయిర్ క్రాఫ్ట్​ కావాలని, దానిని ఆపరేట్ చేయాలంటే అనుమతులు ఉండాలని, వాటికి అనుమతులు ఇచ్చేది ప్రభుత్వాలేనని అన్నారు. ఏ నది నుంచి ఏ ప్రాజెక్ట్ లోకి ఎంత నీరు వచ్చిందో సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలతోపాటు వెల్లడిస్తోందని, ఈ నీటిని ఎలా వదలాలో తెలుగు రాష్ట్రాల వద్ద లెక్కలు కూడా ఉన్నాయని చెప్పారు.

వాతావరణంలో మార్పులు తప్పవు
రాడార్, శాటిలైట్ పద్ధతిలో రెయిన్ ఫాల్ ను అంచనా వేసి ప్రభుత్వాలను అలర్ట్ చేస్తామని, అయితే, ఎమర్జెన్సీ టీం కూడా అదే స్థాయిలో పని చేయాలని, ప్రస్తుతం రెస్పాన్స్ ప్రాబ్లం కన్పిస్తోందని చెప్పారు. గ్రౌండ్ టీమ్​లు చురుకుగా పనిచేయకపోవడమే చాలా ప్రాంతాలు మునిగిపోవడానికి కారణమన్నారు. గడిచిన 15, 20 ఏండ్ల రికార్డును పరిశీలిస్తే.. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పెరుగుతాయని, వర్షం కురిసే రోజులు తగ్గుతాయని రమేశ్ చెప్పారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వర్షం కురుస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ లో వర్షం లేదని, జులైలో అతివృష్టి కురుస్తోందని, రానున్న రోజుల్లో ఇలాంటి వాతావరణమే కొనసాగవచ్చని వెల్లడించారు.