
- గల్ఫ్‌లో శవమైతే తీస్కరానీకి తిప్పలే
- పట్టించుకోని తెలంగాణ సర్కారు
సొంత ఊళ్లో పనులు లేక, వ్యవసాయం కలిసి రాక, పిల్లల చదువులు, పెండ్లిళ్లు, అప్పులు తీర్చేందుకు పొట్ట చేతబట్టుకుని ఎడారి దేశాలు పోయినోళ్లలో కొందరు వివిధ కారణాలతో అక్కడే కన్నుమూస్తున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో చనిపోయినా, బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకున్నా, అనారోగ్యాలతో కన్నుమూసినా ..తమవారి మృతదేహాలను తెప్పించడం ఇక్కడి కుటుంబసభ్యులకు తలకు మించిన భారమవుతున్నది. గల్ఫ్ నుంచి ఒక్కో డెడ్‌బాడీని తేవాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వాళ్ల కాళ్లు..వీళ్ల కాళ్లు పట్టుకుని అప్పులు చేసి మరీ పైసలు కట్టినా వారాలు, నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. ఆ స్థోమత కూడా లేనివారు తమ వారి శవాన్ని వీడియోకాల్‌లోనే చివరి చూపులు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తామని చెప్పిన టీఆర్ఎస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. కేరళ పాలసీ అమలు చేసి ఆదుకుంటామన్నా ఇప్పటివరకు చేసిందేమీ లేదు.
మెట్ పల్లి, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లి, జగిత్యాల, సిరిసిల్ల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏండ్లలోపు వారే. వీరిలో 80 శాతం మంది పేదవాళ్లే కాగా, 50 శాతం మంది కూలీలుగా పని చేస్తున్నారు. ఇందులో సగం మందికి కనీసం గుంట భూమి లేదు. రాష్ట్రంలోని జిల్లాల నుంచి ఇప్పటికే లక్షల్లో గల్ఫ్ బాట పట్టగా ప్రతి నెల వెయ్యి నుంచి పదిహేను వందల మంది కొత్తవారు ప్రయాణం కడుతున్నారు. అయితే ఏజెంట్లు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేసి ఆశించిన పనులు ఇవ్వడం లేదు. దీంతో మానసిక ఒత్తిడితో గుండెపోటు వచ్చి కొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు చనిపోతున్నారు. ఇలా రెండేండ్లలో వివిధ కారణాలతో గల్ఫ్ దేశాల్లో ఊపిరి వదిలిన తెలంగాణ వారు సుమారు 200 మందికి పైగానే ఉన్నారు.
శవం రావాలంటే లక్షలు కావాల్సిందే..
గల్ఫ్ లో అనుకోని ఘటనలో చనిపోతే వారి డెడ్ బాడీలు స్వగ్రామాలకు తీసుకురావాలంటే కత్తి మీద సాము చేయాల్సిందే. అక్కడ మరణించిన వారి వివరాలను స్వచ్ఛంద సంస్థల ద్వారా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నా.. పట్టించుకోకపోవడంతో శవాలను స్వగ్రామాలకు చేర్చడంలో ఆలస్యమవుతోంది. ఒక వ్యక్తి మృతదేహం తీసుకురావాలంటే సుమారు రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతోంది. శవపేటికకు రూ.60 వేలు పెట్టాలి. విమానంలో తరలించడానికి శవపేటికతో పాటు శవానికీ టికెట్ కొనాలి. మార్చురీలో మృతదేహాన్ని ఉంచినందుకు అక్కడి దవాఖానాలకు పెద్ద మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది. సర్కారు పట్టించుకోకపోవడంతో ఎవరైనా చనిపోతే అతడితో కలిసి పనిచేసిన వారు తలా కొంత చందాలు వేసుకుని ఇంటికి పంపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ అవకాశం కూడా లేనివారు తమ బంధువుల శవాలను తెప్పించుకోవడానికి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రయత్నాలు విఫలమై, డబ్బులు దొరకకనప్పుడు అక్కడే అంతక్రియలు నిర్వహించాలని చెప్పి వీడియో కాల్ ద్వారా కడసారి చూపు చూసుకుంటున్నారు.
ఏదీ సాయం?
గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు అనారోగ్యంతో చనిపోయినా, హత్యకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా ఎలాంటి పరిహారం అందడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి వీసా కరెక్టుగా ఉండడంతో పాటు పాస్ పోర్ట్ ఉంటేనే పరిహారం వస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అక్కడి కంపెనీల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. తెలంగాణ కార్మికులకు బీమా పథకం లేకపోవడం కూడా పెద్ద లోటుగా మారింది. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నా ఈ స్కీంలో కార్మికులు నమోదు చేసుకోవడం లేదు. చేసుకున్నా రెండేండ్ల వరకు మాత్రమే వర్తిస్తోంది. ఆ తర్వాత ప్రమాదాలు జరిగితే ప్రయోజనం లేకుండా పోతోంది. నెరవేరని టీఆర్ఎస్ హామీ టీఆర్‌ఎస్ సర్కారు గల్ఫ్ వలస కార్మికుల కోసం కేరళ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కేరళ గల్ఫ్ పాలసీలో ప్రత్యేక శాఖతో పాటు నోర్క్ రూల్స్ పేరిట విస్తృత స్థాయి యంత్రాంగంతో కూడిన విభాగం పనిచేస్తోంది. 1996లో ఏర్పాటైన నోర్క్.. వలస కార్మికులకు 2008 ఆగస్టు నుంచి ప్రవాస గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. రెండేండ్ల పాటు గల్ఫ్ వెళ్లిన కేరళ వాసులకు స్వాంతన పథకం పేరుతో రూ.50 వేల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తోంది. ఒకవేళ వలస కార్మికుడు మరణించినా, అక్కడి నుంచి రప్పించాల్సి వచ్చినా ఖర్చును కేరళ సర్కారే భరిస్తుంది. ఇక వలస వెళ్లే కార్మికుల కోసం ఐఐటీల ద్వారా వృత్తి శిక్షణ అందిస్తూ ఫీజులో 80 శాతం ప్రభుత్వమే భరిస్తోంది. ఇలాంటి పద్ధతులను రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు చేసిందేమీ లేదు.
కాళ్లు మొక్కుతా...నా భర్త శవాన్ని తీసుకురండి
నా భర్త శివరాత్రి శ్రీనివాస్ (37) నాలుగేండ్ల కింద డ్రైవర్ పని చేయడానికి సౌదీ వెళ్లాడు. పోయినప్పటి నుంచి పని చేసే చోట వేధిస్తున్నారని చెప్పేవాడు. ఆయన ఇండియాకు పంపాలని వేడుకున్నా కనికరించలేదు. గత మార్చి 20న వీడియో కాల్ చేసి నాతో, పిల్లలతో మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నాడు. డెడ్ బాడీని మా ఊరికి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. అక్కడి కఫిల్ (యజమాని) అక్రమ కేసు నమోదు చేయించడంతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయనతో పని చేసేవారు చెప్పిన్రు. ఈ కేసు పెండింగ్ లో ఉండడంతో మృతదేహం తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్కారులోని పెద్దలకు చెప్పినా పనైతలేదు. నాకు ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు ఉన్నరు. చిన్న ఇల్లు కూడా లేదు. రేకుల షెడ్డు కిరాయి తీసుకొని ఉంటున్నం. తినడానికి పైసలు లేక కూలి పని చేస్తున్నా. కాళ్లు మొక్కుతం..నా భర్త శవాన్ని తీసుకురండి.
– శివరాత్రి లక్ష్మి, మాదాపూర్ , సౌదీలో చనిపోయిన శ్రీనివాస్ భార్య
తెలంగాణ సర్కారు చొరవ చూపాలి
గల్ఫ్ లో చనిపోయిన తెలంగాణ కార్మికుల డెడ్ బాడీలను తీసుకురావడానికి తెలంగాణ సర్కారు చొరవ చూపాలి. ఇండియన్ ఎంబసీ ఆఫీసులు ఇలాంటి ఘటనలపై వేగంగా స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ వాసులపై సర్వే నిర్వహించి అందరి వివరాలు నమోదు చేయాలి. అక్కడ ఎవరు చనిపోయినా కుటుంబసభ్యులకు వెంటనే సమాచారం అందించేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పలు కారణాలతో కంపెనీల్లో చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇప్పించాలి. లేకపోతే ఆ కంపెనీ ద్వారా ఎక్స్ గ్రేషియా చెల్లించేలా ఒత్తిడి తేవాలి. కేంద్ర సర్కారుతో పాటు తెలంగాణ సర్కారు తరపున కూడా గల్ఫ్ దేశాలలో ప్రతినిధులను నియమించాలి. కేరళ ప్రభుత్వం తరహాలో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ ప్రవాసి విధానం అమలు చేస్తే బాధిత కుటుంబాలకు కొంతైనా సాయం చేసినట్టవుతుంది.
– బొడుగు. లక్ష్మణ్,
జీడబ్ల్యూఏసీ, సౌదీ శాఖ అధ్యక్షుడు