కొనేవారు లేక గుట్టలుగా పేరుకుపోయిన బట్టలు
నేసిన బట్టలు అమ్ముడుపోక.. కొత్త బట్టలు నేయలేక నేత కార్మికులు అల్లాడుతున్నారు. రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా మార్కెటింగ్ లేదు. దీంతో నేతన్నల ఇండ్లలో, సొసైటీల్లో ఎటుచూసినా గుట్టల్లా బట్టలు పేరుకుపోయాయి. టవల్స్, లుంగీలు, చీరలు, బెడ్ షీట్లు, చద్దర్లు, ధోవతులు, లంగాలు, జాకెట్ పీస్‌లు.. ఇలా అన్ని రకాల వస్త్రాలు తానులకు తానులు మూలకుపడ్డాయి. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా నేత కార్మికుల ఇండ్లలో మగ్గాల సప్పుడు వినిపిస్తలేదు. సొసైటీల్లో సందడి కనిపిస్తలేదు. సిరిసిల్లలో రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తులు, భూదాన్ పోచంపల్లిలో రూ. 50 కోట్ల విలువైన వస్త్రాలు పేరుకుపోయాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు కార్మికులు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తాము నేసిన బట్టలను కొని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అమ్ముకునేదెట్ల?
ఈయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన బొల్లబత్తిని నర్సయ్య. నేతకార్మికుడు. పవర్‌లూమ్స్ నడిపిస్తూ తనతోపాటు మరో నాలుగు కుటుంబాలకు ఉపాధి చూపుతుంటాడు. ప్రధానంగా టవల్స్ నేసి కరీంనగర్ నేత బజార్లో అమ్మేవాడు. లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా నేత బజార్ మూతపడి అమ్మకాలు నిలిచిపోయాయి. ఆయన ఇంట్లో సుమారు రూ.3 లక్షల విలువైన టవల్స్ పేరుకుపోయాయి. బయట ఎక్కడ కూడా టవల్స్ అమ్ముకునే పరిస్థితి లేదు. దీంతో తనతోపాటు తన దగ్గర పనిచేసేవాళ్ల పరిస్థితి దయనీయంగా మారిందని నర్సయ్య ఆవేదన చెందుతున్నాడు.
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా.. ఉన్న బట్టలు అమ్ముడుపోక వారికి పూట గడవడమే కష్టంగా మారింది. ఇటు ముడి సరుకుల కోసం తీసుకున్న అప్పులు కట్టలేక.. అటు కార్మికులకు కూలీ అయినా ఇవ్వలేక చేనేత సొసైటీలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో బట్టల పరిశ్రమను నమ్ముకొని లక్షలాది నేత కార్మికులు బతుకుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల లాంటి ప్రాంతాల్లో పవర్ లూమ్ సొసైటీలు బలంగా ఉండడంతో అక్కడి కార్మికులకు ఆర్డర్‌పై పనులు వస్తున్నాయి.
ప్రభుత్వం కూడా ముడిసరుకుపై సబ్సిడీలు ఇస్తోంది. ప్రస్తుతం అక్కడ కూడా మార్కెటింగ్ సరిగా లేదు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చేనేత, మరమగ్గాల మీద పనిచేసే నేతన్నలు, వారు నేసిన బట్టలను వారే స్వయంగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు సిరిసిల్ల మినహాయిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 20 మండలాలకు చెందిన సుమారు 300 మంది నేత కార్మికులు తాము నేసిన బట్టలను కరీంనగర్ నేతబజార్లో అమ్మేవారు. లాక్‌డౌన్‌తో అది మూసి ఉండడంతో రెండు నెలలుగా బట్టలు ఇండ్లల్లోనే గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సిరిసిల్ల మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు రూ. 5 కోట్ల విలువజేసే క్లాత్ మూలకుపడింది. దీంతో నేతన్నలు పస్తులుండాల్సి వస్తోంది.
యాదాద్రి జిల్లాలో 5300 మంది హ్యాండ్లూమ్స్మీద, 1100 మంది పవర్ లూమ్స్ మీద పని చేసే కార్మికులున్నారు. వీరికి అనుబంధంగా మరో ఎనిమిది వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. భూదాన్‌పోచంపల్లిలో ఎక్కువగా పట్టు చీరలు నేస్తారు. పెండ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని జనవరి నుంచి చీరల ఉత్పత్తిని పెంచారు. లాక్డౌన్ కారణంగా పెండ్లిళ్లు, శుభకార్యాలు జరుగక పోవడంతో కార్మికులు నేసిన వేలాది చీరలు ఇండ్లలోనే ఉన్నాయి. ఈ చీరల విలువ సుమారు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఉంటుందని సహకార సంఘాల వాళ్లు చెప్తున్నారు.
సిరిసిల్లలో సుమారు రూ. 100 కోట్ల విలువైన ఉత్పత్తులు పేరుకుపోయాయని ఆసాములు చెబుతున్నారు. ఇక్కడ18 వేల మరమగ్గాలు ఉండగా, 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలోని కోసిని దగ్గర బెజ్జూర్ సహకార చేనేత ఉత్పత్తి, విక్రయ సంఘం ఉంది. ఈ సొసైటీలో 60 మంది చేనేత కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడ తయారుచేసిన లక్షలాది రూపాయల విలువైన బెడ్ షీట్లు, కార్పెట్లు లాక్ డౌన్ కారణంగా అమ్ముడుపోలేదు. స్టాక్మిగిలిపోవడంతో కార్మికులకు తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది.
జనగామ జిల్లాలో 1600 హ్యాండ్లూమ్స్, 300 పవర్ లూమ్స్ ఉన్నాయి. ఇక్కడి చేనేత కార్మికులు నాలుగువేల నుంచి 12వేల విలువ గల సిల్క్, కాటన్ చీరలను నేస్తారు. ఎక్కువగా కోల్‌కతా కు ఎగుమతి చేస్తారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ట్రాన్స్‌పోర్టు లేక సరుకు ఎక్కడికక్కడ ఆగిపోయింది.
గద్వాలలో సిల్క్ లేక మగ్గాల సప్పుడు నిలిచిపోయింది. జిల్లాలో జియోట్యాగింగ్ చేసిన 2,600 చేనేత మగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 6,800 కార్మికులు బతుకుతున్నారు. లాక్ డౌన్ వల్ల పని, మార్కెట్ నిలిచిపోవడంతో సుమారు రూ. 20 కోట్లకు పైగానే సరుకు నిల్వ ఉందని కార్మికులు అంటున్నారు.
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాకలో ఏడు హ్యాండ్లూమ్ సొసైటీల్లో దాదాపు 800 మంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సొసైటీల్లో టవల్స్, లుంగీలు, చీరలు, కర్చిఫ్లు, షర్ట్బట్ట, బెడ్ షీట్లతోపాటు సిద్దిపేట బ్రాండ్ గొల్లభామ చీరలు నేస్తారు. లాక్ డౌన్ వల్ల టెస్కో, ప్రైవేటు వ్యాపారులు సరుకును కొనడం లేదు. దీంతో ఈ ఏడు సొసైటీల్లో దాదాపు 50 లక్షల వరకు సరుకు నిలిచిపోయింది. ఫలితంగా ముడి సరుకుల కోసం తీసుకున్న అప్పులు కట్టలేక, కార్మికులకు కూలీలైనా ఇవ్వలేక సొసైటీలు ఇబ్బంది పడుతున్నాయి. సరుకును కొనడంతోపాటు పాత బకాయిలు ఇవ్వాలని టెస్కోను కోరుతున్నాయి.
పెరిగిన నూలు రేట్లు
అసలే లాక్ డౌన్ తో వ్యాపారం అంతంతగా సాగుతుంటే, తాజాగా పెరిగిన నూలు ధరలు నేత కార్మికులను కలవరపెడుతున్నాయి. రెండు నెలల క్రితం కిలో కాటన్ నూలు రూ.150 – రూ.170 వరకు ఉండేది. కరోనా ఎఫెక్ట్‌తో అది రూ.165 – 185కు చేరింది. వార్ప్ గుండి యారన్ ధర గతంలో రూ. 240 ఉండగా ప్రస్తుతం రూ. 255 పలుకుతోంది. దీంతో చేనేత, మరమగ్గాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూలు ధరల నియంత్రణ లేకపోవడంతో కార్మికులు ఇంటిల్లిపాది నెలంతా పని చేసినా రూ. 10 వేలు కూడా మిగలడం లేదని వాపోతున్నారు. యార్న్ ధరలు పెరుగుతుండడంతో ఉత్పత్తిదారులు వస్త్రాలు నేయించేందు కు భయపడుతున్నారు. పెరిగిన నూలు, రంగుల ధరలతో కార్మికులను పెట్టి నేయించినప్పటికీ మా ర్కెట్లో వస్త్రాల ధరలు పెంచితే కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉంటుందని మరమగ్గాలను బంద్ చేస్తున్నారు.
మూతపడ్డ నేత బజార్లు
చేనేత కార్మికులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన నేత బజార్లు లాక్డౌన్ కారణంగా మూతపడ్డాయి. దీంతో కార్మికులు తాము నేసిన బట్టలను అమ్ముకోలేకపోతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నేత బజార్ ఉత్తర తెలంగాణలోనే పెద్దది. ప్రతి శనివారం జరిగే ఈ నేత బజార్‌కు చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు తాము తయారుచేసిన టవల్స్, లుంగీలు, చీరలు, బెడ్ షీట్లు, చద్దర్లు, నమార్లు, ధోవతులు, బనియన్లు, డ్రాయర్లు, షర్ట్స్, ప్యాంట్స్, లంగాలు, జాకెట్ పీస్‌లు తీసుకువస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో వచ్చి హోల్‌సేల్‌గా కొని తీసుకెళ్తారు. సూరత్, అహ్మదాబాద్, షోలాపూర్, భీవండి, ముంబై, ఇచ్చలకరంజి తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన గార్మెంట్స్, చీరలను కూడా ఇక్కడ అమ్ముతారు. ఏటా వేసవి కాలంలో అంటే మార్చి రెండో వారం నుంచి జూన్ మొదటి వారం వరకు ప్రతి శనివారం రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు క్రయవిక్రయాలు జరిగేవి. కానీ రెండు నెలలుగా ఈ నేతబజార్ తెరుచుకోవడం లేదు. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేనేత, దాని అనుబంధ రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 50 వేల మంది నేత కార్మికులు, చిరువ్యాపారులు ఆగమవుతున్నారు. ప్రభుత్వం నేతబజార్లను తెరిపించి, సోషల్డిస్టెన్స్తో అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
సోషల్ మీడియా వేదికగా వేడుకోలు
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో కార్మికులు తమ ఉత్పత్తులు కొనాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దుబ్బాక సొసైటీ పరిధిలోని కార్మికుల పరిస్థితిని సొసైటీ అధ్యక్షుడు బోడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్మికులను ఆదుకునేందుకు ఉత్పత్తులను కొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది. రూ. 225 విలువజేసే దాదాపు 12 వేల టవళ్లను ఆన్లైన్లో రూ. 150 చొప్పున అమ్మారు. దీంతో సొసైటీకి దాదాపు 15 లక్షలు రాగా, కార్మికుల కూలికింద పంపిణీ చేశారు. మిగతా చోట్ల కూడా కార్మికులు కొందరు సోషల్ మీడియా వేదికగా సమస్యలను జనం దృష్టికి తెస్తున్నారు. తమ ఉత్పత్తులను కొనాలని వేడుకుంటున్నారు.
ఏడాది నుంచీ అమ్మలే
చేనేత సొసైటీ లో తయారు చేసిన బట్టలకు గతేడాది నుంచి మార్కెట్ లేదు. మా దగ్గర లాక్ డౌన్ ప్రకటించక ముందు తయారు చేసిన రూ.6 లక్షల విలువైన కార్పెట్లు, బెడ్ షీట్లు మూలన పడ్డాయి. ఏడాదిలో ఒక్కటి కూడా అమ్మలే. గతంలోనే మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం ఇచ్చినం. సొసైటీలో 40 ఫ్రేమ్ లూమ్స్‌తో పాటు 30 మంది కార్మికులు ఖాళీగా ఉంటున్నరు. మా బట్టలు సర్కారే కొని ఆదుకోవాలి.
– నల్ల కనకయ్య, బేజ్జురు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, కోసిని, ఆసిఫాబాద్ జిల్లా
పనిలేకుంటయింది
రెండోవిడత లాక్‌డౌన్‌తో ఆసాములు బట్టల తయారీని నిలిపివేశారు. నూలు ధరలు పెరగడంతో బట్టల ధరకూడా పెంచాల్సివస్తుందని, అలాగైతే గిరాకీ ఉండదని ఉత్పత్తిని ఆపేశారు. నేను కూలీకి తెచ్చుకునే చోట 10 మరమగ్గాలు మూలనపడ్డాయి. దీంతో మాకు పని లేకుంటయింది. ప్రభుత్వం ఒక్కో నేత కార్మిక కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలి.
– బి.పరశురాం, చేనేత కార్మికుడు, గంగాధర మండలం, కరీంనగర్
వచ్చే నెలలో నేత బజార్ తెరుస్తం
నేత బజార్ తెరిచే అంశం ప్రభుత్వం చేతిలో ఉంది. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి అమ్ముకునేవాళ్లు, కొనేవాళ్లు నేత బజార్‌కు వస్తుంటారు. ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉంటుందని నేత బజార్‌ను మూసేశాం. ఈ నెల 31 వరకు లాక్డౌన్ ఉంది. అది ముగిసేవరకు నేతకార్మికులు ఓపికగా ఉండాలి. వచ్చే నెలలో నేతబజార్ తెరుస్తం. – గుండా సంపత్, చేనేత, జౌళి శాఖ ఏడీ, కరీంనగర్
అయ్యో.. వరంగల్ జంబుఖానా
వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ చేనేత కార్మికులు నేసే జంబుఖానా(దరీ) ఒకప్పుడు వరల్డ్‌ఫేమస్. లండన్ మ్యూజియంలో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. జియోగ్రాఫికల్ ఐడెంటిటీని పొందింది. వరంగల్‌లో వ్యవసాయం తర్వాత అదేస్థాయిలో వేలమంది చేనేతలకు ఇది అన్నం పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగింది. పిట్ట రాములు నేచిన దరీకి జాతీయ అవార్డు దక్కింది. అయితే.. ఇప్పుడు మగ్గాలు మూలకుపడ్డాయి. నేచిన లక్షలాది జంబుఖానాలు కొనేవారు లేక మూలుగుతున్నాయి. సమస్యను మంత్రులు, లీడర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తమ వద్ద ఉన్న దరీలను కొనుగోలుచేసి చేనేత వృత్తిని బతికించాలంటూ నేతన్నలు వాట్సప్, ఫేస్‍బుక్‍లో ప్రజలను కోరుతున్నారు.
సెక్యూరిటీ గార్డులుగా మారుతున్న నేతన్నలు
వరంగల్ కొత్తవాడ, వీవర్స్ కాలనీ, సీకేఎం కాలేజీ రోడ్డు, ఎస్‍ఆర్‍ఆర్ తోట, మట్టెవాడ, పరకాల, శాయంపేట, రాయపర్తి, పెద్ద కోడేపాక, టేకుమాట్ల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నేతన్నలు నేసే దరీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మిగతాచోట్ల నేతన్నలు పవర్ లూమ్ పద్ధతిలో బట్టలు తయారు చేస్తుండగా.. వరంగల్ కళాకారులు మాత్రం హ్యాండ్లూమ్ పద్ధతిలోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. 30 మ్యాక్స్ కేంద్రాలు, 25 ప్రాథమిక సహకార కేంద్రాల ఆధ్వర్యంలో వేలమంది కులవృత్తిపై ఆధారపడ్డారు. గతంలో 15 వేల నుంచి 20 వేల మంది ఈ వృత్తిలో ఉండగా.. ప్రస్తుతం ఐదువేల కుటుంబాలు మిగిలాయి. మిగిలిన వారు సెక్యూరిటీ గార్డులుగా, హోటళ్లు, మిర్చి బండిల వద్ద కూలీలుగా పని చేస్తున్నారు.
3 లక్షలకు పడిపోయిన మార్కెట్
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ‘ఆప్కో’ ద్వారా వరంగల్ చేనేతల నుంచి ఏడాదికి 12 లక్షల దరీలు కొనుగోలు చేసేది. సర్కారు గురుకులాలు, హాస్టళ్లలో ఉండే స్టూడెంట్లకు ఏటా వీటిని పంపిణీ చేసేది. ఇందులో ఆంధ్రా ప్రాంతానికి 8 లక్షలు, తెలంగాణలో 4 లక్షల వరకు పంపేది. వైఎస్ హయాంలో ఒక్కో స్టూడెంట్‌కు రెండు దరీల చొప్పున ఇవ్వగా.. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఒక్కో స్టూడెంటుకు ఒక్క జంబుఖానా మాత్రమే ఇస్తోంది. పైగా మార్కెట్ సగంలో సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు 12 లక్షల వరకు ఉన్న వరంగల్ దరీల మార్కెట్ఇప్పుడు 3 లక్షలకు పడిపోయింది.
సర్కారు సబ్సిడీ ఏది?
వరంగల్ వేదికగా చేనేతల సంక్షేమంపై మంత్రి కేటీఆర్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన సబ్సిడీ హామీలు అందడం లేదు. ‘చేనేత మిత్ర’ స్కీం బెనిఫిట్లు రెండేండ్లుగా దక్కడం లేదు. నూలు, రంగులకు 50% సబ్సిడీ ఒకటీ రెండు నెలు మాత్రమే అందిందని నేతన్నలు ఆవేదన వెలిబుచ్చారు. వరంగల్ దరీలకు మార్కెట్ లేకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిగా ‘టెస్కో’ వీరి దగ్గర గతంలో మాదిరి స్టాక్ కొనుగోలు చేయట్లేదు. దీంతో రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల విలువ చేసే 3 లక్షల జంబుఖానాలు నేతన్నల దగ్గరే పేరుకుపోయాయి. కొత్తగా మరిన్ని తయారు చేద్దామంటే మార్కెట్ లేదు. చివరకు మిగిలిన 5 వేలమంది చేనేతలు కూడా రోడ్డునపడేలా ఉన్నారు.
మాది చేనేతల ప్రభుత్వం
మాది చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. అందుకే ‘నేతన్నకు చేయూత’, ‘చేనేత మిత్ర’ పథకాలు తెచ్చినం. నూలు, రంగులు, రసాయనాలకు కేంద్రం ఇస్తున్న 10 శాతంతో కలిపి మొత్తంగా 50 శాతం సబ్సిడీ ఇస్తం. వరంగల్ చేనేతల దరీలకు మార్కెట్ పెంచుతం. కేసీఆర్ సైతం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. చివరి మీటర్ వరకు కొంటాం. ఒక్కో నేతన్నకు నెలకు రూ. 13 వేల నుంచి 14 వేల సంపాదన వస్తుంది. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తున్నం. 2017 నవంబర్‍లో వరంగల్ లో ‘చేనేత మిత్ర’ స్కీమ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలివీ…
చెక్ తీసుకున్నంక ఒక నెలనే సబ్సిడీ వచ్చింది
మంత్రి కేటీఆర్ ‘చేనేత మిత్ర’ స్కీంను వరంగల్‌లో ప్రారంభించినప్పుడు ఆయన చేత్తో సబ్సిడీ చెక్ అందుకుంది నేనే. అది 2017 నవంబర్‍లో జరిగింది. ఆపై మరో నెల ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నూలు, రంగులకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వలేదు. ఏడాది నుంచి ప్రభుత్వం మా వద్ద స్టాక్ కొనకపోవడంతో 3 లక్షల దరీలు మిగిలిపోయాయి. కొత్తవి నేసే పరిస్థితి లేదు. వరంగల్ చేనేత కార్మికుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – యెలగం సాంబయ్య, ఉప్పు మల్లయ్య చేనేత సహకారం సంఘం అధ్యక్షుడు
రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ
తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి
పడిపోయిన టమాట రేటు

