నిమజ్జనం విషయంలో అపోహలు అవసరం లేదు

నిమజ్జనం విషయంలో అపోహలు అవసరం లేదు

హైదరాబాద్ : వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అంతా యథావిధిగా జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఆదర్శనగర్​లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే తామే ఏర్పాట్లు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారని.. వాళ్లు ఎట్ల చేస్తారని ప్రశ్నించారు. ఇంతమంది పోలీసులను ఎక్కడ్నించి తీసుకువస్తారన్నారు. నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటిదాకా అనేక సార్లు రివ్యూ చేసినట్లు చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత సంస్కృతి, సంప్రదాయాలు గొప్పగా ఉండాలని అన్ని పండుగలను వేడుకగా జరుపుకుంటున్నామని తెలిపారు. చిన్న విగ్రహాల కోసం చిన్న పాండ్ లు ఏర్పాటు చేస్తే వాటిలో మురుగునీరు ఉందంటున్నారని మండిపడ్డారు. మాట్లాడితే హిందువుల పండుగలు అంటున్నారని.. మరి తాము ఎవరమని ప్రశ్నించారు. పండుగలు జరపడంపై ప్రభుత్వానికి ఎవరైనా చెప్పాలా అన్నారు. అది బాధ్యత అంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.