సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపై పోకిరీల హంగామా

V6 Velugu Posted on Jan 22, 2022

  •     గిరిజన పూజారులకు మాత్రమే గుట్టపైకి పర్మిషన్​
  •     జలధార దగ్గర కూలిన ఫెన్సింగ్‌‌ 
  •     ఆ దారిగుండా పైకి ఎక్కుతున్న భక్తులు, పోకిరీలు
  •     పట్టించుకోని దేవాదాయ శాఖ ఆఫీసర్లు


జయశంకర్‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపై పోకిరీలు తప్పతాగి హంగామా చేస్తున్నారు. స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుట్ట కింద ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌‌ కూలిపోయింది. దీంతో మేడారంలో ముందస్తు మొక్కులు సమర్పించడానికి వస్తున్న భక్తుల్లో కొందరు చిలుకల గుట్ట ఎక్కుతున్నారు. కొందరు అక్కడే మద్యం తాగుతూ చిల్లర పనులు చేస్తున్నారు.  కూలిపోయిన ఫెన్సింగ్‌‌ను బాగు చేసి గుట్టపైకి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా భద్రత కల్పించాల్సిన  ఆఫీసర్లు, పోలీసులు పట్టించుకోవడం లేదు. మహాజాతర సమయంలో ప్రతీ రెండేళ్లకోసారి రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా.. చిలుకలగుట్ట కింద ఫెన్సింగ్‌‌ పనులు చేయకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దది మేడారం మహా జాతర. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మహాజాతర నిర్వహించడానికి గవర్నమెంట్‌‌ ఏర్పాట్లు చేస్తోంది. కోటిమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. జాతరలో అత్యంత ప్రధానమైనది సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చే ఘట్టం. చిలుకలగుట్టపై కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని రహస్యంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో పూజించి గద్దెపై ప్రతిష్టిస్తారు. గద్దెకు చేర్చే పూజారిని సాక్షాత్తు సమ్మక్క తల్లిగా భావిస్తూ భక్తులు ఆ పూజారిని ముట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు. చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెల వరకు దారి వెంబడి రోడ్డుపైనే పడుకొని వరం పడతారు. సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొచ్చే పూజారి వారిని తొక్కుకుంటూనే ముందుకు పోతారు. ఆ సమయంలో సాక్షాత్తు సమ్మక్క తల్లే తమను దీవించిందంటూ భక్తులు తెగ ఆనందపడతారు. సమ్మక్క తల్లి కొలువుదీరిన చిలుకల గుట్టపైకి వెళ్లడానికి ఎవరికీ పర్మిషన్​లేదు. మంత్రులు.. ఎమ్మెల్యేలను కూడా గుట్టపైకి అనుమతించరు. అలాంటిది ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు చిలుకల గుట్ట ఎక్కుతుండటం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కన్పిస్తోంది.   

గుట్ట ఎక్కుతున్న ఆకతాయిలు

సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట చుట్టూరా 2016 కంటే ముందే ఐటీడీఏ ఆధ్వర్యంలో ఫెన్సింగ్‌‌ ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరూ గుట్టపైకి వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ గార్డులను నియమించారు. జంపన్నవాగు సమీపంలో చిలుకలగుట్ట చివరి భాగాన గుట్ట జల వస్తుంది. మేడారం వచ్చిన భక్తులంతా ఆ నీటిని తాగుతారు. కొందరు సీసాలలో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. కొందరు అక్కడే స్నానాలు కూడా చేస్తారు. ఈ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమ్మక్క ధార వచ్చే చోట ఫెన్సింగ్‌‌ కూలిపోయింది. దీంతో ఆ దారిగుండా ఆకతాయిలు చిలుకల గుట్టపైకి ఎక్కుతున్నారు. అక్కడే కొందరు మద్యం కూడా తాగుతున్నారు. కొందరు చెట్లు, పుట్టల వెంట తిరుగుతూ వెకిలి చేష్టలు చేస్తున్నట్లుగా గిరిజనులు చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు డ్యూటీ చేయట్లేదు. ఇది పోకిరీలకు వరంగా మారింది.  చిలుకల గుట్ట ఎక్కుతున్న వారితో సమ్మక్క తల్లి కొలువైన ప్రాంతం అపవిత్రమవుతోందని గిరిజన పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలుకల గుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఎండోమెంట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌పై ఉంది. 2022 మహాజాతర కోసం ఈ డిపార్ట్‌‌మెంట్‌‌కు రూ.3 కోట్లు కేటాయించారు. అయినా ఇప్పటివరకు కూలిపోయిన ఫెన్సింగ్‌‌ రిపేర్లు చేపట్టలేదు. ఐటీడీఏ ఆఫీసర్లు కూడా పట్టించుకోవట్లేదు. 

అపవిత్రం చేయొద్దు

మేడారం మహాజాతరకు కోటిమందికి పైగా భక్తులు వస్తారు. కోట్ల మంది ఇలవేల్పు అయిన సమ్మక్క తల్లి కొలువుదీరిన చిలుకల గుట్ట ప్రదేశానికి ఎవరు పడితే వాళ్లు వెళ్లి ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేయొద్దు. భక్తులు ఎవరికి వాళ్లు నియంత్రణతో ఉండాలి. ఆఫీసర్లు వెంటనే సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి.
‒ జవహర్ లాల్‌‌, మేడారం

లోకల్‌‌ వాళ్లమైనా గుట్ట ఎక్కలేదు

మేడారం లోకల్‌‌ వాళ్లమైనా ఎప్పుడూ మేం చిలుకల గుట్ట ఎక్కలేదు. సమ్మక్క తల్లి కొలువుదీరిన ఈ ప్రాంతమంటే మాకు చాలా పవిత్రం. ఆకతాయిలు గుట్టపైకి వెళ్లి మేడారం పవిత్రతను దెబ్బతీయడం సరికాదు. కూలిన ఫెన్సింగ్‌‌ను ఆఫీసర్లు వెంటనే ఏర్పాటు చేసి చిలుకల గుట్టపైకి ఎవరూ వెళ్లకుండా చూడాలి.
‒ మాదరి మోహన్, మేడారం
 

Tagged Warangal, no protection, sammakka chilukala gutta

Latest Videos

Subscribe Now

More News