ఇంకుడు గుంతలు లేక వాన నీళ్లు వృథా

ఇంకుడు గుంతలు లేక వాన నీళ్లు వృథా
  • రీచార్జ్​ జరగక వేసవిలో అడుగంటిన భూగర్భ జలాలు
  • పట్టించుకోని వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు
  • మూడేండ్లుగా పెద్దగా అవగాహన కల్పించట్లే
  • కాగితాలకే పరిమితమైన ఇంకుడు గుంత నిబంధన

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో ఇంకుడు గుంతలు లేక వాన నీళ్లు వృథాగా పోతున్నాయి. మూడేండ్లుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భూమిలోకి ఇంకట్లేదు. ఫలితంగా ఈ ఏడాది వేసవి చివరిలో బోర్లు అడుగంటాయి. ప్రతి ఇంటిలో, కాలనీలో ఇంకుడు గుంతలు ఉండేలా చూడాల్సిన అధికారులు పట్టించకోవడం లేదు. గతంలో పార్కులు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అవకాశం ఉన్న ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించాలని సూచించారు.

కొత్తగా నిర్మించే ఇండ్లకు పర్మిషన్​ఇవ్వాలంటే ఇంకుడు గుంత మస్ట్​అనే నిబంధన పెట్టారు. కానీ ప్రస్తుతం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. రెండు డిపార్ట్​మెంట్ల మధ్య కోఆర్డినేషన్​లేకనే ప్రజలకు అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడేండ్లుగా భారీగా వర్షాలు కురవడం, పెద్దగా నీటి సమస్య లేకపోవడంతోనే ఇంకుడు గుంతలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అధికారులు నామ్ కే వాస్తేగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు.

గ్రేటర్​వ్యాప్తంగా 25 లక్షల ఇండ్లు ఉండగా, వీటి పరిధిలో గతంలో 10 శాతం వరకు ఇంకుడు గుంతలు ఉండేవి. ప్రస్తుతం అవి కూడా లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదో ఒక నిర్మాణం పేరుతో తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మూడేండ్లుగా పట్టించుకోవట్లే..

గతంలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్​బీనగర్ జోన్ల పరిధిలో 11వేల ఇంకుడు గుంతలు నిర్మించారు. మూడేండ్ల క్రితం వరకు ఏటా వాటికి రిపేర్లు చేశారు. ఇంకుడు గుంతలు చెత్త, చెదారంతో నిండిపోయి ఉంటే స్థానిక కాలనీ వాసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాక్ బృందాలతో కలిసి క్లీన్​చేశారు. కొత్తగా ఇసుక, కంకర నింపారు. అయితే మూడేండ్లుగా అధికారులు పెద్దగా అవగాహన కల్పించకపోవడంతో ఉన్నవాటిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.

వానలు కురిసిన టైంలో ఇంటి పరిసర ప్రాంతాల్లోని నీటిని ఇంకుడు గుంతలోకి పంపిస్తే వరద రోడ్డెక్కదు. సిటీలోని ప్రతి కాలనీ, బస్తీల్లో ఎక్కడా గ్యాప్​లేకుండా సీసీ, బీటీ రోడ్లు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా ఇంకే పరిస్థితి లేదు. భారీ వర్షాలు కురిసినా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పైగా ఎక్కడికక్కడ ఇండ్లు మునుగుతున్నాయి. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తే వరదలు ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకుడు గుంత ఇలా ఉండాలి

200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటే బోరు బావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. పొడవు 2 మీటర్లు, వెడల్పు2 మీటర్లు, లోతు1.5 మీటర్లు ఉండాలి. 50 శాతం 40 ఎంఎం సైజు పలుగురాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లు, 15 శాతం బఠానీ ఇసుకతో గుంతను నింపాలి. 10 శాతం ఖాళీగా ఉంచాలి. ఇంటి పైకప్పు నుంచి పడిన నీరు ఇందులో ఇంకేలా చూసుకోవాలి.

ఆ సెస్​ ఖర్చు చేయాలె

ఎప్పటికప్పుడు గ్రౌండ్​వాటర్ రీచార్జింగ్ జరగాలి. కానీ గ్రేటర్ లో వాన నీళ్లు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఉన్న ఇంకుడు గుంతలకు రిపేర్లు చేయడం లేదు. చెత్త, పూడికతో నిండిపోయి ఉన్నాయి. జనం నుంచి ఇంకుడు గుంతల పేరుతో వసూలు చేస్తున్న సెస్​ని ఖర్చు పెట్టాలి. జీహెచ్ఎంసీ వద్ద ఇంకుడు గుంతల సెస్​పైసలు దాదాపు రూ.250 కోట్లు ఉన్నాయి. ఎకరాల కొద్ది నిర్మిస్తున్న కంపెనీల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టాలి. సిటీలో వరదలు రావడానికి ఇంకుడు గుంతలు లేకపోవడం ఒక కారణం. సహజంగా నీటిని ఇంకించే వ్యవస్థ ఉండాలి.  – దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త