సెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ సభలు

సెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ సభలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్‌‌ 17పై పొలిటికల్‌‌ టెన్షన్‌‌ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో భారీ వేడుకలు చేపడుతున్నాయి. అటు బీజేపీ, ఇటు టీఆర్​ఎస్​ పోటాపోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌‌, కమ్యూనిస్టు పార్టీలు కూడా సెప్టెంబర్‌‌ 17ను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌‌ చేసిన టీఆర్‌‌ఎస్‌‌.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాటే మరిచింది. ఆజాదీ కా అమృత్‌‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం ఏడాది పాటు విమోచన ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల తర్వాత అధికారికంగా సెప్టెంబర్‌‌ 17ను నిర్వహిస్తోంది.

తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల పేరుతో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనుంది. ఇక ఎంఐఎం పార్టీ తొలిసారిగా సెప్టెంబర్‌‌ 17న తిరంగా యాత్ర చేయనుంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ వేర్వేరు పేర్లతో ఒకే వేడుకను నిర్వహిస్తుండటం.. ఇందుకు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్‌‌ హీట్‌‌ పెరిగింది. తెలంగాణ విమోచనం, విలీనం, జాతీయ సమైక్యత పేర్లతో ప్రభుత్వాలు, పార్టీలు ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో బహిరంగ సభల్లో రాజకీయ విమర్శలు హైపిచ్‌‌కు చేరే అవకాశముంది. 

కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం.. 

కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విమోచన వేడుకలను గవర్నర్‌‌ తమిళిసై బుధవారం ప్రారంభించారు. సెప్టెంబర్‌‌ 17న పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో నిర్వహించే వేడుకకు అమిత్‌‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌‌కూ ఆహ్వానం పంపారు. అప్పటి హైదరాబాద్‌‌ సంస్థానంలోని ప్రాంతాలు విలీనమైన మహారాష్ట్ర, కర్నాటక సీఎంలు ఏక్‌‌నాథ్‌‌ షిండే, బసవరాజు బొమ్మైని కూడా వేడుకలకు ఆహ్వానించారు. అయితే కేంద్రం నిర్వహించే వేడుకలకు కేసీఆర్‌‌ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. 

పోలీసులకు సవాలే.. 

నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు కాంగ్రెస్‌‌, ఎంఐఎం పోటాపోటీగా ఉత్సవాలు నిర్వహించనున్నాయి. ఆ రోజు ఎంఐఎం తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. ఇక కాంగ్రెస్‌‌ పార్టీ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి 17నే ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో తెలంగాణ తల్లిపైనా రాజకీయ దుమారం తలెత్తే చాన్స్‌‌ ఉంది. కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ విమోచన వీరగాథలను నేటి తరానికి తెలియజెప్పేందుకు ఉద్యమ కేంద్రాల్లో యాత్రలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వేడుకలకు వీవీఐపీలు అటెండ్‌‌ అవుతున్నారు. మరోవైపు బైక్‌‌ ర్యాలీలు, భారీ ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఉత్సవాలకు భద్రత కల్పించడం పోలీసులకూ కత్తిమీద సాములా మారింది.

షా సభకు పోటీగా కేసీఆర్ సభ.. 

కేంద్ర ఉత్సవాలకు పోటీగానే కేసీఆర్‌‌ సెప్టెంబర్‌‌ 17న మూడు కార్యక్రమాలతో బిజీగా ఉండేలా షెడ్యూల్‌‌ రూపొందించుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పబ్లిక్‌‌ గార్డెన్‌‌లో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌‌లో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవన్‌‌లను ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం నెక్లెస్‌‌ రోడ్డులోని పీపుల్స్‌‌ ప్లాజా నుంచి ఎన్టీఆర్‌‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌‌ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌‌ మాట్లాడతారు. ఈ ఉత్సవాలను శుక్రవారం నుంచి ఆదివారం వరకు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన ఉత్సవాలకు ప్రచారం దక్కకుండా చేసేందుకు అన్ని మెట్రో పిల్లర్లు, హోర్డింగులను ప్రభుత్వమే బుక్‌‌ చేసుకుంది. అమిత్‌‌ షా బహిరంగ సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి అన్నింటిని రాష్ట్ర సర్కారే బుక్ చేసుకుంది.