
- రెండు నెలల కిందటే ఆగిన స్మార్ట్ సిటీ వర్క్స్
- ఇప్పుడు జనరల్, సీఎం అష్యూరెన్స్ పనులు ఆపిన్రు
- పెండింగ్ బిల్లుల కోసం ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు
- ఫండ్స్ లేకనే బిల్స్ ఇవ్వట్లేదన్న కార్పొరేషన్ అధికారులు
వరంగల్, వెలుగు: వరంగల్ కార్పొరేషన్‍లో ఫండ్స్ కొరత నెలకొంది. స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పటి నుంచి వరంగల్ లో పనులు స్లోగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఫండ్స్ ఇవ్వకపోవడంతో గతంలో చేపట్టిన ప్రాజెక్టులు మధ్యలోనే ఆగాయి. కొత్త పనులకు అడుగులు పడట్లేదు. భద్రకాళి బండ్ రెండో దశ పనులకుతోడు పద్మాక్షి టెంపుల్ నుంచి హంటర్‍రోడ్, కాపువాడ నుంచి భద్రకాళి టెంపుల్, వరంగల్ స్టేషన్ రోడ్, ఉర్సు బొడ్రాయి, జేపీఎన్ రోడ్, పోచమ్మ మైదాన్ స్మార్ట్ రోడ్ల నిర్మాణ పనులు రెండు నెలల కిందటే ఆగాయి. బిల్లులు వస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ నుంచి వరంగల్, కరీంనగర్ సిటీలను స్మార్ట్ సిటీ పథకంలో చేర్చినా.. స్టేట్ గవర్నమెంట్తీరుతో పనులు ముందుకు సాగట్లేదు. వరంగల్, కరీంనగర్‍లో రూ.1,533 కోట్లతో 72 ప్రాజెక్టుల పనులు జరగాల్సి ఉండగా.. 2015 నుంచి రూ.287 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.1,246 కోట్లు పూర్తి స్థాయిలో వాడుకునే ఉద్దేశం ఉందో లేదో చెప్పాలని కేంద్రం సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని ప్రశ్నించింది. చాలా పనులు మొదలుపెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తన వాటాగా రూ.392 కోట్లు రిలీజ్ చేసినా.. రాష్ట్ర సర్కారు తన వాటాను రిలీజ్ చేయకుండా మొత్తం స్మార్ట్‌సిటీ ఫండ్స్ వాడుకోలేకపోతోందని లెటర్ రాసింది. అయినా ఫండ్స్ ఇవ్వలేదు. కేసీఆర్ హామీ ఇచ్చినా...
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 20న వరంగల్ సిటీలో పర్యటించారు. హనుమకొండ కలెక్టరేట్‍లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి.. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. పనులకు తక్షణమే రూ.200 కోట్లు రిలీజ్ చేయాలని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు చెప్పారు. తీరా చూస్తే 8 నెలల తర్వాత ఈ నెలలో మంత్రి చెప్పిన రూ.200 కోట్లలో రూ.20 కోట్లే విడుదల చేశారు. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో చేసిన పనులకు బిల్లులు ఇయ్యట్లేదని కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పెండింగ్‌బిల్లుల కోసం ధర్నాకు దిగారు.
కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు ఆగినయ్
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఓ దిక్కు స్మార్మ్ సిటీ ప్రాజెక్టు పనులు ఆగగా.. ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ చేపట్టిన పనులకు సైతం బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి పనులను ప్రధానంగా జనరల్ ఫండ్స్, ఎస్సీ సబ్‍ప్లాన్, సీఎం అష్యూరెన్స్ నిధులతో చేపట్టారు. 66 డివిజన్ల పరిధిలో గతంలో చేపట్టిన పనులు చాలా వరకు సగంలో ఉండగా.. మేయర్, కమిషనర్ నగరబాట కార్యక్రమంలో భాగంగా తీసుకున్న కొత్త పనులైన రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్, వాటర్ లీకేజీలు వంటి సివిల్ వర్క్స్ చేయాల్సి ఉంది. హనుమకొండ సిటీ పరిధిలో వీటిని దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కాగా, ఏప్రిల్ నెల నుంచి బిల్లులు ఇవ్వలేదు. ఇప్పటికే రూ.30 కోట్ల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండగా.. మరో రూ.30 కోట్లు బిల్లులు చేసి ఫండ్స్ ఇవ్వట్లేదని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా చేస్తున్న పనులకుగాను ఇంకో రూ.30 కోట్ల బిల్లులను అధికారులు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా వరంగల్ కార్పొరేషన్ రూ.90 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ నెల 5న వారంతా గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. 7వ తారీకు వరకు బిల్లులు చెల్లించాలని.. లేదంటే 8 నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. సిటీలో పనులు ఆపేస్తామన్నారు. అన్నట్లుగానే పనులు బంద్ చేసి రోజూ నిరసన తెలుపుతున్నారు. బిల్లులు చెల్లించేదాకా పనులు మొదలుపెట్టేదిలేదని తేల్చిచెప్పారు. గ్రేటర్‍లో ఇక్కడ అక్కడ అనే తేడాలేకుండా అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటిక పనులు ఆగడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మేయర్ గుండు సుధారాణి 29వ డివిజన్‍లో నిర్మిస్తున్న పెద్ద మోరి పనులు డేంజర్‍గా ఉన్నాయి.
డిసెంబర్ గడువు ఉత్తముచ్చటే అయింది
పెద్దమోరి పనులు చేస్తామని చెప్పి ఏడాదిన్నర కింద ఇండ్లముందు చిన్న కెనాల్ సైజ్‍లో తవ్విన్రు. సగం పనులు చేసి పక్కనపెట్టిన్రు. ఇండ్లళ్లకు పోవడానికి కూడా దారిలేదు. చెక్కలు, కట్టెలపై నడ్వాలంటే ముసలోళ్లు భయపడుతున్నరు. చిన్నపాటి వానొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సిందే. మొన్నటి వానకాలంలో చాలా ఇబ్బంది అయింది. ఈ డిసెంబర్ వరకు పనులు పూర్తయితయ్ అన్నరు. డిసెంబర్ వచ్చిందిగానీ, పనులు మాత్రం అక్కడే ఆగినయ్.
- యెలగం ఉపేందర్, రామన్నపేట