టీఎస్ పీఎస్సీ ఉద్యోగుల్లో టెన్షన్​

టీఎస్ పీఎస్సీ ఉద్యోగుల్లో టెన్షన్​

హైదరాబాద్, వెలుగు : ఒక్కొక్కరిగా ఉద్యోగులను సిట్ అధికారులు విచారిస్తుండడంతో.. పేపర్ల లీకేజీ కేసు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టీఎస్ పీఎస్సీ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. నిన్నమొన్నటి వరకూ ఎంప్లాయీస్​ను విచారించిన సిట్.. తాజాగా కమిషన్​ సెక్రటరీ అనితా రాంచంద్రన్, మెంబర్ లింగారెడ్డిని విచారించింది. మరోవైపు రద్దయిన, వాయిదాపడ్డ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు డేట్లను కమిషన్​ ప్రకటిస్తున్నా.. అందుకు తగ్గట్టు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

త్వరలో మరికొందరి విచారణ

పేపర్ల లీకేజీ కేసులో కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డిని మొదట సిట్ అరెస్టు చేసింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఉద్యోగులు షమీమ్, రమేశ్, మాజీ ఉద్యోగి సురేశ్ ను అరెస్ట్ చేసింది. టీఎస్​పీఎస్సీలో పని చేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన వారితోపాటు ఇతర ఉద్యోగులు కలిపి 30 మందిని ఇప్పటి వరకు విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరు ఉద్యోగులనూ త్వరలోనే విచారించనున్నట్టు తెలిసింది. కమిషన్​లోని చాలామంది ఉద్యోగులకు పేపర్ లీకేజీ గురించి తెలుసని చర్చ జరుగుతోంది. వారందరినీ విచారించే అవకాశముంది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు సెలవు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకోవైపు శుక్రవారం అనితా రాంచంద్రన్, లింగారెడ్డి పీఏలు అరెస్టులు కావడంతో, వీరి నుంచి సమాచారం సేకరించేందుకు ఇటీవల సిట్ నోటీసులు ఇచ్చింది. రెండ్రోజుల కింద వీరి నుంచి పీఏల గురించి వివరాలు సేకరించింది. ఈ క్రమంలో చైర్మన్​జనార్దన్​రెడ్డికి నోటీసులు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

లీకేజీ అంశం తేలకముందే కొత్త ఎగ్జామ్ డేట్లు

పేపర్ల లీక్ తో ఏఈ, ఏఈఈ, గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో ఎగ్జామ్స్ రద్దు కాగా.. ఈ నెలలో జరగాల్సిన రెండు పరీక్షలను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సిట్ విచారణ జరుగుతుండగానే హడావిడిగా పలు ఎగ్జామ్స్ డేట్లను అధికారులు ప్రకటించారు. గ్రూప్1 ప్రిలిమ్స్ ను జూన్11న.. ఏఈఈ పరీక్షను మే 8, 9, 21 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ పరీక్షను జూన్17కు వాయిదా వేశారు. అయితే లీకేజీ అంశం తేలకముందే డేట్లను ప్రకటించడంపై ప్రతిపక్షాలు ఫైర్​ అవుతున్నాయి. టీఎస్ పీఎస్సీ అధికారులు, ఉద్యోగులపై ఆరోపణలు ఉండగా, ఇప్పుడు వాళ్లతోనే మళ్లీ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా హడావిడిగా ఏర్పాట్లు చేయడమేంటని మండిపడుతున్నాయి. సర్కార్ నుంచి వచ్చిన ఒత్తిడితోనే కమిషన్ హడావిడిగా డేట్లు ప్రకటించిందనే విమర్శలు వస్తున్నాయి.

కమిషన్ అధికారుల నిర్లక్ష్యం..

అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది తప్పుడు విధానాల కారణంగానే కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ గా చెప్పుకునే టీఎస్​పీఎస్సీ.. రోడ్డు మీద పడ్డది. కొందరు పలు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్​పేపర్లను అమ్మకానికి పెట్టినా కమిషన్​ ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్​తోపాటు పలు పేపర్లు టీఎస్​పీఎస్సీలోని చాలామంది ఎంప్లాయీస్​ చేతికి అందాయి. బయటి వ్యక్తులు ఫిర్యాదు చేసేంత వరకూ లీకేజీ వ్యవహారం కనిపెట్టలేకపోయారు. ఇదంతా ప్రవీణ్ నడిపిస్తున్నా గుర్తించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కమిషన్​లో 26 మంది గ్రూప్ 1 పరీక్షలు రాయగా, వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇద్దరికి వందకు పైగా మార్కులు వచ్చాయి. ప్రవీణ్ క్వాలిఫై కానప్పటికీ వందకు పైగా మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కూడా కమిషన్ ఉన్నతాధికారులు తేరుకొని విచారించకపోవడం అనుమానాలు రేపుతోంది.