ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోస్టల్‌ బ్యాలెట్లపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..  పోస్టల్‌ బ్యాలెట్లపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మూడు వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓట్లు వేశారు. నవంబర్ 29వ తేదీ నాటికే వినియోగించుకున్న పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి ‌పంపించలేదు. పోస్టల్ బ్యాలెట్ లను వేసిన బాక్స్ లను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏజెంట్లకు తెలియకుండా, ఎవరూ లేకుండా రిటర్నింగ్ అధికారి, సిబ్బంది వాటిని ఓపెన్ చేసినట్లు ఆర్వో కార్యాలయంలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ లు కనిపించాయి. దీంతో ఏజెంట్లు లేకుండా ఎలా ఓపెన్ చేశారని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు.

ఈ విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లు పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా ఆర్వో కార్యాలయంలో ఓపెన్ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆర్డీఓను నిలదీశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు ఇంకా స్ట్రాంగ్ రూమ్ లకు పంపించలేదు. ప్రస్తుతం కూడా ఆర్డీవో కార్యాలయంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. భువనగిరి, ఇబ్రహీంపట్నంతో పాటు చాలా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాచారని తెలుస్తోంది. మొదటి నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.