నిజామాబాద్​ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్​ జిల్లా సంక్షిప్త వార్తలు

ఘనంగా.. తిరంగా ర్యాలీలు
నిజామాబాద్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. స్కూల్​ స్కూడెంట్లు,   అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఫ్రీడమ్​ ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఫ్రీడమ్​ ర్యాలీలను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డిలో నిజాంసాగర్​ చౌరస్తా నుంచి జూనియర్​ కాలేజీ వరకు ర్యాలీ తీసి, మూడు రంగుల బెలూన్లను ఎగురవేశారు. స్వాతంత్య్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని  పంద్రాగస్టున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, 16న సాముహిక   జనగణమన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి ప్రశాంత్​ రెడ్డి సూచించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, జడ్పీ చైర్​ ​పర్సన్​   శోభ, ఉర్దు ఆకాడమి ​చైర్మన్​ ఎం.కె.ముజీబుద్ధీన్​, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​, ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్​దొత్రే, చంద్రమోహన్​, డీఎస్పీ సోమనాథం, డీఈవో రాజు పాల్గొన్నారు. నిజామాబాద్ లో జిల్లా యంత్రాంగం రూపొందించిన 750 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ విఠల్​ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, మేయర్ దండు నీతు కిరణ్ పాల్గొన్నారు. అలాగే మండలాల్లో ఆటలపోటీలు నిర్వహించారు. కామారెడ్డిలో కేపీఆర్​ కాలనీ వద్ద బీజేపీ నియోజక వర్గ ఇన్​చార్జీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. - వెలుగు, నెట్​వర్క్​

ఇంటింటా  భగవద్గీత ఉండాలి
పిట్లం, వెలుగు: మండలంలోని కంబాపూర్​ ఆలయంలో శ్రావణమాసం మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు గురునాథ స్వామి, ఓం స్వామి గ్రామస్థులకు భగవద్గీత గ్రంథాలను పంపిణీచేశారు. ప్రతి ఇంటా భగవద్గీత  ఉండాలనే లక్ష్యంతో పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ వైస్​  ప్రెసిడెంట్​ పంపాటి సంగప్ప తెలిపారు. 


ఎమ్మెల్యేను కలిసిన ఫీల్డ్​ అసిస్టెంట్లు
ఆర్మూర్, వెలుగు :   తమను వెంటనే విధుల్లో  తీసుకోవాలని ఆదేశించిన సీఎం కేసీఆర్​ కు  ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు  ఆర్మూర్ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డిని శనివారం కలిశారు.  సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో 7వేలకు  పైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. 


కండ్లలో కారంచల్లి.. 20 తులాల గోల్డ్ చోరీ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు:  టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వెళ్తున్న గోల్డ్​ షాప్​ ఓనర్​ ఆసిఫ్ ఖాన్  పై  కండ్లలో కారం చల్లి 20 తులాల గోల్డ్ , 80 వేల రూపాయను దొంగలు ఎత్తుకెళ్లారు.  శుక్రవారం రాత్రి అజమ్ రోడ్ లో ఈ ఘటన జరిగింది.  షాప్ మూసేసి  ఆసిఫ్​ ఇంటికి వెళ్తున్న టైంలో, మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి, కండ్లలో కారం చల్లారు.    ఆసిఫ్​​  బ్యాగులో ఉన్న బంగారాన్ని,  80వేలను ఎత్తుకెళ్లారు. బంగారం విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.  టూ టౌన్ ఎస్ఐ 
పూర్ణేశ్వర్ కేసు నమోదు చేశారు.   ఇన్ స్పెక్టర్​  ​కృష్ణ కేసు దర్యాప్తు  చేస్తున్నారు.


బీజేపీ కార్యకర్త కుటుంబానికి సాయం
నవీపేట్, వెలుగు : మండల కేంద్రానికి చెందిన బీజేపీ  కార్యకర్త  నారాయణ ఇటీవలే కరెంట్ షాక్ తో  మృతి చెందగా..  ఆయన కుటుంబానికి  పార్టీ నాయకులు ఆర్థిక సాయం చేశారు.  నారాయణ సంతాప సభను  పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా  కార్యకర్త కుటుంబానికి రూ.25వేలను  ఎంపీ అర్వింద్  ఫౌండేషన్ తరఫున అందించారు. బీజేపీ నాయకులు మోహన్​ రెడ్డి  మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మైస రాధ, సర్పంచ్ సరిన్, సొసైటీ చైర్మన్ శైలేష్​  కుమార్,  నాయకులు ఆనంద్, రచ్చ సుదర్శన్ పాల్గొన్నారు. 
 

టీఆర్​ఎస్​ ఒక దేశద్రోహుల పార్టీ
నిజామాబాద్, వెలుగు: రైతు సంక్షేమ పథకాలను తామే అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, మరోవైపు రైతుల సబ్సిడీలకు టీఆర్​ఎస్​ కొరివి పెడుతోందని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ బస్వాలక్ష్మి నర్సయ్య, కిసాన్​ మోర్చ ప్రెసిడెంట్ నూతి శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శనివారం బీజేపి జిల్లా ఆఫీస్​ పై జెండాను ఎగురవేశారు. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లో తిరంగ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ సర్కార్​ రైతులను మోసగించిందని, ఎన్నికల హామీలను విస్మరించిందని, ఆ పార్టీ దేశద్రోహుల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, ఏకకాలంలో లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపి నాయకులు మహేశ్, దొంతుల రవి, శ్రీనివాస్, కిశోర్ పాల్గొన్నారు. 


వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలె
నవీపేట్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్​ఏల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా నాయకులు రమేశ్​ బాబు డిమాండ్​ చేశారు. స్థానిక తహసీల్దార్ ఆఫీస్​ ఎదుట సమ్మె చేస్తున్న వీఆర్​ఏలకు శనివారం ఆయన మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వీఆర్ఏల పట్ల వివక్ష చూపిస్తున్నారని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్,  సాయిలు, రవి   పాల్గొన్నారు. 
 

అన్నా..  స్పౌజ్​ టీచర్ల బదిలీ సమస్య పరిష్కరించండి
మంత్రికి రాఖీ కట్టి మహిళా టీచర్ల వినతి 

నిజామాబాద్,  వెలుగు: బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో  స్పౌజ్ టీచర్లు బదిలీల సమస్య పరిష్కరించాలని     మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డిను  మహిళా టీచర్లు  శనివారం రాఖీ కట్టి వేడుకున్నారు.  అన్నగా సమస్యను అర్థం చేసుకోవాలని కోరారు.    జిల్లాలో     ఖాళీలున్నా,  వాటిని భర్తీ చేయడంలేదని తెలిపారు.  7 నెలలుగా స్పౌజ్​ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,   ప్రతిరోజూ వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు  ప్రయాణించి విధులకు హాజరవుతున్నామని ఆవేదన చెందారు.  అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కు చెందిన స్పౌజ్​ మహిళా టీచర్లు, స్పౌజ్​ టీచర్ల సంఘం ప్రతినిధులు  పాల్గొన్నారు.

16న కవి సమ్మేళనం
నిజామాబాద్ టౌన్, వెలుగు:   స్వాతంత్ర్యఉత్సవాల సందర్భంగా  ఈనెల 16న కలెక్టరేట్​లో కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్టు అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్​ తెలిపారు.  దీనికి సంబంధించిన కమిటీతో శనివారం ఆయన మీటింగ్​ నిర్వహించారు.  ఈసందర్భంగా చంద్రశేఖర్​ మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్య స్ఫూర్తి - వజ్రోత్సవ దీప్తి’ అనే అంశంపై  కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందింపజేసేలా , దేశభక్తి  స్ఫురించేలా 20  నుంచి - 25  లైన్ల  కవితలు రాయొచ్చన్నారు.  జిల్లా కవులు కవితలు కవి సమ్మేళనంలో పాల్గొనాలని 
ఆయన కోరారు.


ప్రజావ్యతిరేక పాలకులను తరిమికొట్టాలె
ఆలిండియా కాంగ్రెస్​ కార్యదర్శి నదీమ్​ జావీద్​ 
నిజామాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందుతోందని, రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని  ఈ రెండు పార్టీలను తరిమి కొట్టాలని ఆలిండియా కాంగ్రెస్​ కార్యదర్శి నదీమ్​ జావీద్​ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో సెక్యూలర్​ పాలన కాంగ్రెస్​ తోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రాంతీయపార్టీలను చీల్చి బీజేపీ సంక్షోభాలను సృష్టిస్తోందని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్​  గెలుస్తుందని ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్​ ను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ గౌడ్​, జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్​ రెడ్డి, కాంగ్రెస్​ అర్బన్​ ప్రెసిడెంట్ కేశ వేణు అర్బన్​ ఇన్​ ఛార్జ్​ తాహెర్​   పాల్గొన్నారు. భిక్కనూరు  : కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణను దోచుకొని, నిండా ముంచాయని కాంగ్రెస్​ మాజీమంత్రి మహ్మద్​ షబ్బీర్​ఆలీ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడీ నుంచి ఆయన శనివారం పాదయాత్ర ప్రారంభించారు. గడపగడపకు వెళ్లి జాతీయ జెండాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ రాష్ర్టాన్ని ఇస్తే.. కేసీఆర్​ ఇప్పుడు తన కుటుంబ పాలనతో సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్టాన్ని అప్పుల ఉబిలో ఉంచి, తన కుంటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆగ్రహించారు.  తెలంగాణ ప్రజలు కేసీఆర్​ మాటలు నమ్మొద్దని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కుటుంబ పాలనకు అంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధతతో దేశంలో నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగాయని, దేశం మొత్తం జీఎస్టీ భారం పడుతోందని అన్నారు.  సామాన్యులను దోచుకుంటున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి  ఇంద్రకరన్​ రెడ్డి, నాయకులు శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.అలాగే నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​మహేశ్​ గౌడ్​ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర వేడుకల సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. బీజేపీ పాలనలో స్వాతంత్య్ర ఫలాలు పేద ప్రజలకు అందడం లేదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్​ మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అర్బన్ ఇంచార్జ్ తాహెర్​, ప్రెసిడెంట్​ కేశ వేణు, కాంగ్రెస్​ మహిళా కార్యదర్శి గాజుల సుజాత, కార్పొరేటర్ గడుగు రోహిత్  పాల్గొన్నారు. 


జంటహత్య కేసులో నిందితుడు అరెస్ట్
24 గంటల్లో పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: తన తండ్రిని, బాబాయిని హత్య చేసిన కర్రోల్ల సతీశ్​ను  24 గంటల్లో అరెస్ట్​ చేసినట్టు ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  మృతుడు అబ్బయ్యకు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఇద్దరు గల్ఫ్ లో ఉన్నారు. నడిపి కొడుకు సతీశ్​  పని లేకుండా జులాయిగా తిరుగుతూ, పెండ్లి చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పని లేని వాడికి పెండ్లి ఎందుకని తల్లిదండ్రులు అనగా.. వారితో గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజామున తన తండ్రిని, బాబాయిని పారతో కొట్టి, పారిపోయాడు. సిరిపూర్ లో శివాలయం దగ్గర ఉన్న సతీశ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐ నరేశ్​, మోపాల్ ఎస్సై మహేశ్​ ఉన్నారు. 

లోక్​ అదాలత్​లో 1100 కేసులు పరిష్కారం
ఆర్మూర్, వెలుగు :    ఆర్మూర్​ మున్సిఫ్​ కోర్టు ఆవరణలో శనివారం  జాతీయ లోక్​ అదాలత్​ నిర్వహించారు.   1100 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయసేవా సిబ్బంది   మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లోక్​ అదాలత్​ ప్రిసైడింగ్​ జడ్జిలుగా సీనియర్ సివిల్​ జడ్జి నసీం సుల్తానా, జూనియర్​ సివిల్​ జడ్జి   శాలిని, ​ మెంబర్స్​ గా అడ్వకేట్స్​  పోచన్న, జక్కుల శ్రీధర్, కొండిపవన్​ వ్యవహరించారు. లోక్​ అదాలత్ లో రాజీకి వచ్చిన సివిల్​, క్రిమినల్, డైవర్స్, ఎస్​టీసీఎస్​ కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. 

మండలం మారి ఐదేండ్లయిన.. పేరు మార్చలే
ఎర్గట్ల మండలాన్ని మోర్తాడ్  నుంచి విడదీసి ప్రత్యేక మండలంగా ప్రకటించినా..  మండల కేంద్రం లోని హైస్కూల్  బోర్డుపై ఇప్పటి వరకు పాతమండలం పేరే కొనసాగుతోంది.  దాదాపు ఐదేండ్లు అవుతున్నా  అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. - ఎర్గట్ల,  వెలుగు