పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. ఉద్రిక్తత

పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. ఉద్రిక్తత

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆదివారం (మే 28న) ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా మహా పంచాయత్‌ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్‌ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్‌ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది.

ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెల‌కొంది. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, మరో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఉన్నారు.  శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడ్డారు. 

ఖండించిన కేజ్రీవాల్‌

రెజ్లర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోను సాక్షి మాలిక్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. దీనిపై ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో ఇలా ప్రవర్తించడం తప్పని పేర్కొన్నారు. మరోవైపు.. రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆదివారం ‘మహిళా మహాపంచాయత్‌’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో  ఖంఝావాలా చోక్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ను తాత్కాలిక జైలుగా ఉపయోగించుకొనేందుకు ఢిల్లీ మేయర్‌ను పోలీసులు అనుమతి కోరారు. పోలీసుల అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.

https://twitter.com/ArvindKejriwal/status/1662748030322327552