న్యూఢిల్లీ: నీట్ ఎగ్జామ్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇతర సభ్యులతో కలిసి వెల్‌లోకి దూసుకెళ్లడంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకొన్నది. దన్ఖడ్, ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇది కళంకిత దినమని, అపోజిషన్ లీడర్ ఇంతకు ముందెన్నడూ వెల్‌లోకి దూసుకురాలేదని దన్ఖడ్ అన్నారు. ‘‘ఈ ఘటనతో నేను షాక్ అయ్యా.. బాధపడ్డా.. ప్రతిపక్షనేత, ఉపనేత వెల్‌లోకి దూసుకొచ్చేటంత దాకా భారత పార్లమెంటరీ సంప్రదాయం దిగజారిపోయింది”అని వ్యాఖ్యానించారు.
చైర్మన్ పట్టించుకోకపోవడం వల్లే..: ఖర్గే
తాను10 నిమిషాల పాటు చేతులు పైకెత్తినప్పటికీ చైర్మన్ పట్టించుకోకపోవడంతోనే అలా చేశానని ఖర్గే సమాధానమిచ్చారు. చైర్మన్తనను పట్టించుకోకుండా అవమానించారని, తనకు మరో దారిలేక అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. ‘‘నాకున్న మరో ఆప్షన్ సీటులోంచి గట్టిగా అరవడం మాత్రమే. అయినా చైర్మన్ పట్టించుకోరనే ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వెల్‌లోకి దూసుకెళ్లా. ఇది చైర్మన్ తప్పే. నీట్ పరీక్షలో ఇంతపెద్ద స్కామ్ జరిగింది. పేపర్ లీక్ అయి లక్షలాది మంది స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. మేందీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల సమస్యలను లేవనెత్తుతున్నాం” అని ఖర్గే పేర్కొన్నారు.
